బేటీ బచావో’ నినాదం ఎటు పోయింది?

  • బండి సంజయ్ కొడుకుపై ఫోక్సో కేసు.. ప్రధాని ఎందుకు స్పందించరు?
  • బాధితురాలిపైనే రివర్స్ కేసులా?
  • తెలంగాణ‌లోనూ జంగిల్ రాజ్ స‌ర్కారు..
  • కాంగ్రెస్-బీజేపీల మధ్య అసహ్యకర ఒప్పందం!
  • మోదీ, రాహుల్‌లపై బీఆర్ఎస్ నేత‌ కేటీఆర్ విమ‌ర్శ‌లు

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మే 9:  కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై నమోదైన ఫోక్సో కేసు వ్యవహారంపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ విషయంలో అటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఇటు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఆయన ఎండగట్టారు. బాలిక పరిస్థితి…వారి కుటుంబం పైన జరుగుతున్న వేధింపులపై కేటీఆర్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మీ ‘బేటీ బచావో’ కేవలం ఒక నినాదమేనా? కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై మీరు ఎలాంటి చర్య తీసుకోబోతున్నారు? అతనికి మినహాయింపు ఉంటుందా? బండి సంజయ్ ఎప్పుడు రాజీనామా చేస్తారు లేదా మంత్రివర్గం నుంచి ఎప్పుడు బర్తరఫ్ చేయబడతారు? అని కేటీఆర్ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు.

రాహుల్ గాంధీ, తెలంగాణలో మీ పార్టీ ఎలాంటి ‘జంగిల్ రాజ్’ నడుపుతోంది? ఒక మైనర్ బాలిక అన్ని ఆధారాలతో వచ్చినప్పుడు పోలీస్ శాఖ అత్యంత వేగంగా ఎందుకు స్పందించలేదని అన్నారు.  కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడిపై ఇతర పోక్సో నేరస్తుల మాదిరిగానే కేసు నమోదు చేసి ఎందుకు విచారణ జరపడం లేద‌ని అన్నారు. మైనర్ బాలికపైనే ఎదురు కేసు ఎందుకు పెట్టారు? ఉన్నావ్ కేసులో చేసినట్లుగా, రాహుల్ గాంధీ హైదరాబాద్‌ వచ్చి బాధితురాలికి, ఆమె కుటుంబానికి అండగా నిలబడాల‌న్నారు.   తెలంగాణ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీకి ఒక ఫ్రాంచైజీలా పనిచేస్తోంద‌ని, ఒక మైనర్ బాలిక గౌరవం విషయంలో కాంగ్రెస్, బిజెపి ఒక అపవిత్రమైన, అసహ్యకరమైన ఒప్పందానికి వచ్చాయ‌ని మండిప‌డ్డారు.

ఒక 17 ఏళ్ల అత్యాచార బాధితురాలు, ఆమె కుటుంబం, ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయించుకోవడానికే మూడు నెలలకు పైగా ఎందుకు పోరాడాల్సి వస్తోందని ప్ర‌శ్నించారు. మనం ఎంతటి దుర్భరమైన, భయంకరమైన నరకంలో జీవిస్తున్నామో ఆ కుటుంబం కష్టం చూస్తే అర్థమవుతుంద‌ని అన్నారు.  బాధితురాలిని ఆమె కుటుంబాన్ని నేరస్తుల్లా చూస్తూ ఎందుకు వేధిస్తున్నారని నిల‌దీశారు. ఆ మైనర్ బాలిక రెండుసార్లు ఆత్మహత్యాయత్నం చేసింది. న్యాయం కోసం వారు మూడు నెలలుగా తిరుగుతున్నారు. ఇప్పుడు మీరు ఆమెనే నిందిస్తున్నారు. ఏ నిబంధన ప్రకారం తెలంగాణ పోలీసులు ఒక మైనర్ బాలికపై హనీ-ట్రాప్, వసూళ్ల కేసు నమోదు చేశారు? అని కేటీఆర్ ప్ర‌శ్నించారు.  మన మహిళల గౌరవం కోసం గతంలో అణచివేతదారులతో, ప్రభుత్వాలతో పోరాడామ‌ని ఇప్పుడు  ఆడబిడ్డల రక్షణ కోసం అవసరమైతే మరో మిలియన్ సార్లు మళ్లీ పోరాడుతామ‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *