రాష్ట్ర రాజకీయాలిప్పుడు రైతుల చుట్టూ తిరుగుతున్నాయి. రైతే రాజు, రైతే రాష్ట్రానికి వెన్నెముక లాంటి నినాదాలతో రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు రైతులపట్ల మొసలి కన్నీరు కార్చడం మొదలు పెట్టినయ్ . తాజాగా అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షమైన బిఆర్‌ఎస్ ఏకంగా రైతు సదస్సుల పేరిట యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ఈ రెండు పార్టీలు కూడా రైతు సమస్యలను తీసుకుని చేపట్టిన కార్యక్రమానికి వరంగల్ వేదికైంది. ఉమ్మడి వరంగల్‌కు మొదటినుండి రాజకీయ పరిణితిచెందిన జిల్లాగా పేరుంది. ఉద్యమ కాలంనుండి వరంగల్ వేదికగా ఏ సమావేశం ఏర్పాటుచేసినా అవి విజయవంతం అవుతాయన్న నమ్మకం రాజకీయ పార్టీలకు మొదటినుండీ ఉంది. తాజాగా కాంగ్రెస్, బిఆర్‌ఎస్‌లు రైతులను దృష్టిలో పెట్టుకుని నిర్వహిస్తున్న కార్యక్రమాలకు వరంగల్ వేదికవడం కాకతాళీయం మాత్రం కాదంటున్నారు రాజకీయ పరిశీలకులు.
రైతు సమస్యలపై వరంగల్‌లో ‘రైతు సంగ్రామ సదస్సు’ను నిర్వహిస్తున్న విషయాన్ని భారత రాష్ట్ర సమితి ముందుగానే ప్రకటించింది. దానికి పోటీగా అధికార కాంగ్రెస్‌కూడా ‘రైతు మేలా ’ను వరంగల్‌లో నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ రెండు పార్టీలు కూడా తమ కార్యక్రమానికి వేదికను ఎంచుకోవడంలో గందరగోళం ఏర్పడింది. ఈ సదస్సులకు ప్రాంగణ ఎంపిక విషయంలోనూ ఈ రెండు పార్టీల మధ్య పోటీ ఏర్పడింది. ఏ రోజు హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో ‘రైతు సంగ్రామ సదస్సు’ను ఏర్పాటు చేయాలనుకుంది బిఆర్‌ఎస్. ఎందుకంటే ఇదే మైదానంలో గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2022 మే 6వ తేదీన కాంగ్రెస్‌పార్టీ తమ అధినాయకుడు రాహుల్‌గాంధీ సమక్షంలో రైతు డిక్లరేషన్‌ను ప్రకటించింది.
ఆ డిక్లరేషన్ ప్రకారం రైతులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ ఒక్క హామీనికూడా పూర్తిస్థాయిలో అమలు పర్చలేదన్నది బిఆర్‌ఎస్ ఆరోపణ. అందుకు అదే రోజు, అదే ప్రాంగణంలో ‘రైతు సంగ్రామ సదస్సు’ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తన హామీలను గుర్తుచేసేందుకే బిఆర్‌ఎస్ ఈ సదస్సును ఏర్పాటు చేస్తున్నది. కాగా, అధికార కాంగ్రెస్‌కూడా తాము తలపెట్టిన రైతు మేలా కు అదే ప్రాంగణాన్ని ఎంచుకుంది. తమ కార్యక్రమానికి అటంకం కలిగించేందుకే అధికార పార్టీ ఆ స్థలాన్ని కావాలని ఎంపిక చేసుకుందని బిఆర్‌ఎస్ ఆరోపిస్తున్నది. మంగళవారం నుండి ఏడవ తేదీవరకు మూడు రోజులపాటు ప్రభుత్వం ఇక్కడ మేలా నిర్వహిస్తున్నది.
ఇదిలా ఉంటే సుమారు పదివేల మంది రైతులతో నిర్వహించ తలపెట్టిన రైతు సంగ్రామ సదస్సుకు అధిక సంఖ్యలో రైతులను తరలించడంలో భాగంగా గత కొద్ది రోజులుగా బిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్రంలోని ప్రధాన వ్యవసాయ మార్కెట్‌యార్డులను సందర్శించి, అక్కడ రైతులు పడుతున్న అవస్థలను , మార్కెట్‌లో జరుగుతున్న అన్యాయాలను రైతులతోపాటు, ప్రజల దృష్టికి తీసుకువొచ్చే కార్యక్రమాలను చేపట్టింది. కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి రావడానికి ముందు ప్రజలకు అనేక వాగ్ధానాలు చేసింది. ముఖ్యంగా రైతాంగానికి ఇచ్చిన వాగ్ధానాలనైనా గడచిన రెండున్నరేండ్లుగా పూర్తిచేయకపోవడంపట్ల ప్రభుత్వాన్ని నిలదీసేందుకు రైతులను సమీకరిస్తున్నది. రైతులకు ఇచ్చిన హామీల్లో ప్రధానంగా అధికారంలోకి వొచ్చిన వెంటనే ప్రతీ రైతుకు సంబంధించిన రెండు లక్షల రూపాయల వరకు రుణాన్ని ఏకకాలంలో మాఫీ చేస్తామన్న మాటను ఈ ప్రభుత్వం నిలుపుకోలేదన్నది ప్రధాన ఆరోపణ.
భూమి ఉన్న రైతులతోపాటు కౌలు రైతులకు ఏడాదికి ఎకరానికి 15 వేలు ఇస్తామన్న వాగ్ధానాన్ని నిలుపుకోలేదు. అలాగే భూమి లేని రైతు కూలీలకు ఏడాదికి 12 వేల రూపాయలను తమ ప్రభుత్వం అందిస్తుందని ఆ డిక్లరేషన్‌లో కాంగ్రెస్ పేర్కొంది. రైతు బీమా తరహాలోనే కౌలు రైతులకు కూడా 5 లక్షల రూపాయల బీమా వర్తింపచేస్తామంది. నకిలీ విత్తనాలు, పురుగుమందుల వ్యాపారు పై ఉక్కుపాదం మోపి, అవసరమైతే వారిపై పిడీ యాక్టును పెడతామన్నారు. పోడు రైతులకు, అసైన్డ్ భూములవారికి క్రయవిక్రయంతో సహా అన్ని హక్కులను కల్పిస్తామంది. అన్ని పంటలకు మెరుగైన మద్దతు ధర కల్పిస్తూ, ప్రభుత్వమే పంట కొనుగోలు చేస్తుందన్నారు. అలాగే రైతు సమస్యల పరిష్కారంకోసం చట్టపరంగా రైతు కమిషన్‌ను ఏర్పాటు లాంటి పలు హమీలను కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండున్నరేండ్లుగా బుట్టదాఖలు చేసిందన్నది బిఆర్‌ఎస్ ఆరోపణ.
ఈ విషయాలపై నిర్వహించ తలపెట్టిన సదస్సుకు అధికార పార్టీ అడ్డంకులు పెడుతున్నదని బిఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. తాము ఏర్పాటు చేద్దామనుకున్న ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం పోటీగా రైతు మేలా ను నిర్వహించడంపట్ల వారు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీంతో హనుమకొండ హంటర్‌రోడ్డులో సుమారు నాలుగు ఎకరాల స్థలంలో నేడు నిర్వహించనున్న ఈ సదస్సులో పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కెటిఆర్ ముఖ్యఅతిధిగా పాల్గొంటున్న సందర్బంగా ఏర్పాటు చేసిన బ్యానర్లను, కటౌంట్లను, జండాలను గ్రేటర్ మున్సిపల్ కార్పోరేషన్ తొలగించడంపై పెద్ద గందరగోళం ఏర్పడింది. ఆగ్రహించిన బిఆర్‌ఎస్ కార్యకర్తలు కార్పోరేషన్ ఆఫీస్‌పై దాడిచేసి అద్దాలను పగులగొట్టడం, కాంగ్రెస్ నాయకుల జోక్యంతో ఇరుపార్టీల మధ్య యుద్ధ వాతావరణానికి దారి తీసింది. గత నెల20న ఇరు పార్టీలు ఒకే రోజున పోటాపోటీ సమావేశాలు ఏర్పాటు చేసినట్లుగానే బుధవారం జరిగే పోటాపోటీ సమావేశాలు మరింత రాజకీయ వేడిని రగిలించేట్లున్నాయి.





