– పరిశోధనలు, పరిశ్రమలు, ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయంతో ఆవిష్కరణలకు ప్రోత్సాహం
– 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం
– పెట్టుబడులకు అనుకూల విధానాలు, అత్యుత్తమ మౌలిక వసతులతో పారిశ్రామికాభివృద్ధి
– ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
– 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం
– పెట్టుబడులకు అనుకూల విధానాలు, అత్యుత్తమ మౌలిక వసతులతో పారిశ్రామికాభివృద్ధి
– ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 4 : డీప్‌టెక్ రంగంలో పరిశోధనలు, ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూ వాటిని ప్రజల జీవితాల్లో ప్రత్యక్ష మార్పులు తీసుకొచ్చే ఉత్పత్తులు, సేవలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. పరిశోధకులు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేసినప్పుడే సాంకేతిక ఆవిష్కరణలకు నిజమైన సార్థకత లభిస్తుందన్నారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న లక్ష్య సాధనలో సాంకేతిక ఆవిష్కరణలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. బేగంపేటలోని ఓ హోటల్లో బుధవారం నిర్వహించిన ఫిక్కీ @ 100 వేడుకలు, తెలంగాణ డీప్‌టెక్ లీడర్షిప్ సమ్మిట్‌కు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి పాల్గొన్న ఆయనకు ఫిక్కీ చైర్మన్ వీవీఆర్ రాజు, ఎఫ్‌టీసీసీఐ అధ్యక్షురాలు కేకే మహేశ్వరి, ఫిక్కీ మాజీ అధ్యక్షురాలు, అపోలో హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతారెడ్డి తదితరులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ తెలంగాణను పెట్టుబడులు, పరిశ్రమలకు అత్యంత అనుకూలమైన గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం స్పష్టమైన లక్ష్యాలు, విధానాలతో ముందుకు సాగుతోందన్నారు. 2034-35 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పరిశ్రమలకు అనుకూలమైన విధానాలను రూపొందిస్తున్నట్లు వివరించారు. హైదరాబాద్‌లో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం, ఐఐటీలు, కేంద్ర విశ్వవిద్యాలయాలు, ట్రిపుల్ ఐటీలు, ప్రముఖ ఇంజినీరింగ్ విద్యాసంస్థలు రాష్ట్రానికి ప్రధాన బలమని చెప్పారు. రీజినల్ రింగ్ రోడ్డు, భారత్ ఫ్యూచర్ సిటీ వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులతోపాటు హిల్ట్ పాలసీ వంటి వినూత్న విధానాలు పారిశ్రామికాభివృద్ధికి మరింత ఊతమిస్తాయని తెలిపారు.
డీప్‌టెక్ రంగంలో ప్రపంచస్థాయి ఆవిష్కరణలకు వేదిక 

సాఫ్ట్వేర్, ఫార్మాస్యూటికల్స్, బయోటెక్నాలజీ, ఏరోస్పేస్, ఇంజినీరింగ్ వంటి విభిన్న రంగాలకు హైదరాబాద్ కేంద్రంగా ఉందని, ఈ సామర్థ్యాలన్నింటినీ సమన్వయం చేయడం ద్వారా తెలంగాణ డీప్‌టెక్ రంగంలో ప్రపంచ స్థాయి ఆవిష్కరణలకు వేదికగా ఎదగగలదని అన్నారు. ఒక పరిశోధకుడు అభివృద్ధి చేసిన వైద్య నిర్ధారణ పరికరానికి వైద్యులు, ఇంజినీర్లు, తయారీదారుల సహకారం లభించినప్పుడే అది సామాన్యులకు అందుబాటులోకి వస్తుందని వివరించారు. ప్రయోగశాలలో రూపొందిన ఆవిష్కరణకు తొలి వినియోగదారుడు దొరకడం, పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన సదుపాయాలు లభించడం, పెట్టుబడులు సమకూరడం వంటి అంశాలు స్టార్టప్‌లకు ఎదురవుతున్న సవాళ్లని అన్నారు. ఈ అడ్డంకులను ప్రభుత్వం, పరిశ్రమలు సంయుక్తంగా పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. ఇంధన రంగంలో పునరుత్పాదక విద్యుత్ వినియోగం, విద్యుత్ నిల్వ సాంకేతికత, విద్యుత్ సరఫరా వ్యవస్థల పనితీరు మెరుగుదల వంటి అంశాల్లో డీప్‌టెక్ ఆవిష్కరణలకు విస్తృత అవకాశాలున్నాయని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. విద్యుత్ డిమాండ్‌ను ముందుగానే అంచనా వేసే సాంకేతిక పరిజ్ఞానం, సూర్యాస్తమయం తర్వాత కూడా సౌర విద్యుత్‌ను సమర్థంగా వినియోగించుకునే నిల్వ వ్యవస్థలు విద్యుత్ రంగానికి ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. వైద్య రంగంలో వ్యాధులను ముందుగానే గుర్తించే నిర్ధారణ పరికరాలు, వ్యవసాయ రంగంలో రైతులకు పెట్టుబడి వ్యయాన్ని తగ్గించి, దిగుబడులు పెంచే సాంకేతిక పరిష్కారాలు అభివృద్ధి చేయాలని సూచించారు. ఏ సాంకేతిక ఆవిష్కరణ అయినా సామాన్యులకు, రైతులకు అందుబాటు ధరల్లో ఉండేలా ప్రారంభ దశ నుంచే ప్రణాళిక రూపొందించాలని స్పష్టం చేశారు.
యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు కల్పించాలి
డీప్‌టెక్ అభివృద్ధి పరిశోధకులు, సంస్థలకే పరిమితం కాకుండా యువతకు విస్తృత ఉపాధి అవకాశాలను కల్పించాల న్నారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేయడం, నిర్వహించడం, మరమ్మతులు వంటి పనులకు అవసరమైన నైపుణ్యాలతో టెక్నీషియన్లు, ల్యాబొరేటరీ సిబ్బంది, కార్మికులను పరిశ్రమలు సిద్ధం చేయాలని సూచించారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలు కూడా పెద్ద పరిశోధనా విభాగాలు ఏర్పాటు చేయకుండానే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునేలా సహకారం అందించాలన్నారు. ఆవిష్కరణల ఫలితాలు కుటుంబాల ఆదాయాలు పెరగడం, ప్రజలకు మెరుగైన ప్రభుత్వ సేవలు అందడం, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం రూపంలో కనిపించాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో పరిశోధనలు, పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం పెట్టుబడులు పెట్టడంతోపాటు ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యానికి పెద్దపీట వేస్తోందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పెట్టుబడిదారులకు భరోసా కల్పిస్తూ, వారి పెట్టుబడులు వృద్ధి చెందేందుకు అవసరమైన వాతావరణాన్ని ప్రభుత్వం కల్పిస్తోందన్నారు.
గ్లోబల్ సమ్మిట్‌కు పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం
భారతీయ పారిశ్రామిక రంగం అభివృద్ధికి ఫిక్కీ వందేళ్లుగా విశేష సేవలందిస్తోందని భట్టి విక్రమార్క ప్రశంసించారు. సంస్థ శతాబ్ది వేడుకలు నిర్వహించుకుంటున్న తరుణంలో భారతీయ పరిశోధనలు, ఆవిష్కరణలు ప్రపంచస్థాయి సంస్థలుగా ఎదిగేందుకు మరింత చొరవ తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో డీప్‌టెక్ అభివృద్ధికి అవసరమైన కొన్ని కీలక సవాళ్లను గుర్తించి వాటి పరిష్కారానికి పరిశోధకులు, పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ శాఖలు కలిసి పనిచేసేలా చొరవ చూపాలని సూచించారు. భవిష్యత్తులో సమావేశమైనప్పుడు రైతులు, వైద్యులు, చిన్న వ్యాపారులు వంటి ప్రత్యక్ష లబ్దిదారులు సాంకేతిక ఆవిష్కరణల వల్ల పొందిన ప్రయోజనాలను వివరించే పరిస్థితి రావాలని ఆకాంక్షించారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, వారి భాగస్వాములు అధిక సంఖ్యలో హాజరై రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని భట్టి విక్రమార్క ఆహ్వానించారు.
———————————————————————————————————————————————————-
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





