– వర్సిటీ పాలనా వైఫల్యం వల్లే ఉద్యోగులు రోడ్డెక్కే దుస్థితి
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు
– సమ్మె చేస్తున్న సిబ్బందికి బీజేపీ సంపూర్ణ సంఘీభావం
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 4 : చారిత్రక ఉస్మానియా విశ్వవిద్యాలయం బోధనేతర సిబ్బంది తమ న్యాయమైన హక్కుల కోసం రోడ్డెక్కాల్సి రావడం అత్యంత బాధాకరమని, వారి న్యాయమైన డిమాండ్లకు బీజేపీ పూర్తి సంఘీభావం ప్రకటిస్తోందని రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు స్పష్టం చేశారు. ఓపీఎస్ అమలు, సర్వీసుల క్రమబద్ధీకరణ, హెల్త్ కేర్ బెనిఫిట్స్ తదితర డిమాండ్లతో ఓయూ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఎదుట నిరసన తెలుపుతున్న నాన్ టీచింగ్, టెక్నికల్, టైమ్ స్కేల్, కాంట్రాక్టు సిబ్బంది సమ్మె శిబిరాన్ని ఆయన బుధవారం సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రామచందర్ రావు మాట్లాడుతూ తాను ఇదే వర్సిటీలో ఎంఏ, ఎలఎల్బీ పూర్తి చేసి ప్రజా జీవితంలోకి వచ్చానని, తండ్రి ఇక్కడే ప్రొఫెసర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారని తెలిపారు. సమాజ నిర్మాణానికి అవసరమైన శాస్త్రవేత్తలు, న్యాయవాదులు, మేధావులు, రాజకీయ నాయకులను తీర్చిదిద్దిన ఒక గొప్ప విద్యా కేంద్రంలో పనిచేస్తున్న ఉద్యోగులకు సరైన వేతనాలు, ఉద్యోగ భద్రత, పెన్షన్ సౌకర్యం లేకపోవడం వర్సిటీ పరిపాలన వైఫల్యానికి నిదర్శనమని మండిపడ్డారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పదేపదే తీర్పులు ఇస్తున్నా వర్సిటీ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు. 25, 30 ఏళ్లుగా చాలీచాలని వేతనాలతో కాలం వెళ్లదీస్తున్న టైమ్ స్కేల్, కాంట్రాక్టు సిబ్బందిని రెగ్యులరైజ్ చేయకపోవడం దారుణమన్నారు. ఇతర యూనివర్సిటీల్లో వర్తింపజేస్తున్న ప్రయోజనాలను ఓయూలో ఎందుకు అమలు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. వర్సిటీ ఖాతాల జప్తు పేరుతో ఏటా ఉద్యోగులకు రావాల్సిన రూ.1500 ఇంక్రిమెంట్‌ను రద్దు చేసి, పీఎఫ్ పేరుతో వారి ఆర్థిక హక్కులను కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2001 నుంచి 2004 మధ్య నియమితులైన వారికి పాత పెన్షన్ విధానాన్ని(ఓపీఎస్) పునరుద్ధరించాలని, 2004 తర్వాతి వారికి సీపీఎస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎక్కడా లేని విధంగా ప్రవేశపెట్టిన ఎలఐసీ లింక్డ్ పెన్షన్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలన్నారు. ఉద్యోగుల మెడికల్ రీయింబర్స్‌మెంట్‌ను రూ.10 వేల నుంచి రూ.30 వేలకు పెంచాలని, అన్ని విభాగాల్లో పెండింగ్‌లో ఉన్న అంతర్గత పదోన్నతులు, నోటిఫికేషన్లను వెంటనే భర్తీ చేయాలని రామచందర్‌రావు డిమాండ్ చేశారు. హక్కుల కోసం నిలదీస్తే ఉద్యోగులను బెదిరించడం, నిరసన తెలిపిన వారిపై సస్పెన్షన్ వేట్లు వేయడం నియంతృత్వ పోకడలకు పరాకాష్ట అని ధ్వజమెత్తారు. గతంలో అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న ప్రొఫెసర్ మనోహర్‌పై తీసుకున్న సస్పెన్షన్ చర్యలపైనా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని గుర్తు చేశారు. ప్రభుత్వం, వర్సిటీ ఉన్నతాధికారులు మొండివైఖరి వీడి సమ్మె చేస్తున్న ఉద్యోగ జేఏసీ నాయకులను వెంటనే చర్చలకు పిలిచి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సిబ్బంది పోరాటానికి బీజేపీ ప్రత్యక్షంగా అండగా నిలిచి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు, మాజీ ప్రొఫెసర్లు, విద్యార్థి సంఘాల నేతలు, పలు యూనివర్సిటీల నాన్ టీచింగ్ అసోసియేషన్ ప్రతినిధులు, ఓయూ జేఏసీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





