– రెండు దశాబ్దాల నిరీక్షణకు తెరదించాలి
– దేవాదులకు అడ్డంకులన్నీ తొలగించాలని సీఎం రేవంత్ ఆదేశం
– భూసేకరణ, ఆర్ అండ్ ఆర్, అటవీ సమస్యల పరిష్కారానికి నిధుల కొరత రానివ్వం
– గోదావరి జలాలను గరిష్ఠంగా ఎత్తిపోసి 6 లక్షల ఎకరాలకు సాగునీరు
– రైతుల చేతికి పరిహారం చేరడమే ప్రభుత్వ లక్ష్యం
– మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
– దేవాదులకు అడ్డంకులన్నీ తొలగించాలని సీఎం రేవంత్ ఆదేశం
– భూసేకరణ, ఆర్ అండ్ ఆర్, అటవీ సమస్యల పరిష్కారానికి నిధుల కొరత రానివ్వం
– గోదావరి జలాలను గరిష్ఠంగా ఎత్తిపోసి 6 లక్షల ఎకరాలకు సాగునీరు
– రైతుల చేతికి పరిహారం చేరడమే ప్రభుత్వ లక్ష్యం
– మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 25: దాదాపు రెండు దశాబ్దాలుగా పూర్తిస్థాయిలో ఫలాలు అందించలేకపోతున్న దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని వచ్చే ఏడాదిలోగా పూర్తి చేయాలన్న దృఢ సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు దేవాదుల ప్రాజెక్టును ఫాస్ట్‌ట్రాక్‌పై పెట్టి, దాని పూర్తికి అడ్డుగా నిలిచిన ప్రతి సమస్యను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించాలని నిర్ణయించినట్లు తెలిపారు. దేవాదుల ప్రాజెక్టుపై మంగళవారం నిర్వహించిన విస్తృతస్థాయి సమీక్ష అనంతరం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. గోదావరి జలాలను ఎత్తిపోసి తెలంగాణలోని విశాలమైన ప్రాంతానికి సాగునీటి భరోసా కల్పించాలన్న మహత్తర లక్ష్యంతో రూపుదిద్దుకున్న దేవాదుల రాష్ట్ర సాగునీటి చరిత్రలో అత్యంత కీలకమైన ప్రాజెక్టుల్లో ఒకటని పేర్కొన్నారు.దాదాపు రెండు దశాబ్దాల క్రితం చేపట్టిన ఇంతటి ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టు గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ఇప్పటికీ అసంపూర్తిగా ఉండడం దురదృష్టకరమన్నారు. ఇకపై జాప్యానికి తావులేకుండా, ప్రాజెక్టును అత్యంత ప్రాధాన్యతతో పూర్తి చేయాలన్నదే ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు. సుమారు 38 టీఎంసీల గోదావరి జలాలను ఎత్తిపోసి, దాదాపు ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో దేవాదుల పథకం రూపుదిద్దుకుందని మంత్రి తెలిపారు. హనుమకొండ, వరంగల్, కరీంనగర్, జనగామ, యాదాద్రి–భువనగిరి, సూర్యాపేట, సిద్ధిపేట, మేడ్చల్-మల్కాజిగిరి, ములుగు, జయశంకర్ భూపాలపల్లి తదితర జిల్లాలకు ఈ ప్రాజెక్టు ప్రయోజనాలు విస్తరించనున్నాయని వివరించారు.
అడ్డంకి ఎక్కడుంటే పరిష్కారం అక్కడే
దేవాదుల ప్రాజెక్టును కేవలం సమీక్షించడానికే పరిమితం కాకుండా ప్రతి కాంపోనెంట్‌ను విడివిడిగా పరిశీలించి ఏ పని ఎక్కడ నిలిచిపోయింది.. దానికి కారణమేంటి.. పరిష్కారానికి ఏం చేయాలి అనే అంశాలపై లోతుగా చర్చించినట్లు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ప్రధానంగా భూసేకరణ, పునరావాసం–పునరావాస ప్యాకేజీ, అటవీ అనుమతులు, ఇతర పరిపాలనా సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు చెప్పారు. భూసేకరణ ప్రక్రియ పూర్తయి, అవార్డులు ఖరారైన చోట నిధుల విడుదలలో ఒక్కరోజు కూడా జాప్యం ఉండకూడదన్నది ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టుల్లో భూసేకరణ తదితర అడ్డంకులను తొలగించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రూ.6,000 కోట్ల ప్రత్యేక ప్యాకేజీకి హామీ ఇచ్చారని, అందులో ఇప్పటికే సుమారు రూ.2,500 కోట్లు విడుదలయ్యాయని మంత్రి వెల్లడించారు. దేవాదుల ప్రాజెక్టుకు కూడా ఇటీవల భూసేకరణ కోసం నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. అవసరమైన ప్రక్రియలు పూర్తయిన వెంటనే మిగిలిన నిధులను సైతం సమకూరుస్తామని భరోసా ఇచ్చారు.
నిధులు విడుదలైతే సరిపోదు.. రైతు చేతికి చేరాలి
భూసేకరణ కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేయడమే అంతిమ లక్ష్యం కాదని, భూములు కోల్పోయిన రైతులు, నిర్వాసితుల చేతికి పరిహారం సకాలంలో చేరినప్పుడే ప్రభుత్వ సంకల్పం సార్థకమవుతుందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇదే అంశంపై మంగళవారం జిల్లా కలెక్టర్లు, చీఫ్ ఇంజినీర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినట్లు తెలిపారు. రెవెన్యూ, నీటిపారుదల శాఖలు, జిల్లా కలెక్టర్లు, ఇంజినీరింగ్ అధికారులు సమన్వయంతో పనిచేసి భూసేకరణ, ఆర్ అండ్ ఆర్, ఇతర సమస్యల కారణంగా ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యం జరగకుండా చూడాలని ఆదేశించినట్లు చెప్పారు.
గోదావరి జలాలను గరిష్ఠంగా ఎత్తిపోస్తాం
దేవాదుల సమీక్షలో మరో కీలక నిర్ణయం తీసుకున్నామని మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పంపింగ్ వ్యవస్థలన్నింటినీ పూర్తి సామర్థ్యంతో వినియోగించి, గోదావరి నుంచి సాధ్యమైనంత గరిష్ఠ పరిమాణంలో నీటిని ఎత్తిపోసి ఆయకట్టుకు, ప్రాజెక్టు పరిధిలోని రిజర్వాయర్లకు చేరవేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఏళ్లుగా దేవాదుల అమలులో ఎదురైన సమస్యలను క్షుణ్ణంగా విశ్లేషించామని, మిగిలిపోయిన ప్రతి అడ్డంకిని అధిగమించేందుకు ఆచరణాత్మక పరిష్కారాలను రూపొందించినట్లు చెప్పారు. సమీక్షలో రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార-పౌరసంబంధాల శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎంపీ పోరిక బలరాం నాయక్, సీనియర్ శాసనసభ్యుడు కడియం శ్రీహరి, ప్రాజెక్టు పరిధిలోని ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, ఇంజినీర్లు పాల్గొన్నారు. ప్రాజెక్టుతో ఏళ్లుగా అనుబంధం ఉన్న ప్రజాప్రతినిధులు సమీక్షలో పాల్గొనడం వల్ల క్షేత్రస్థాయిలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను సమగ్రంగా పరిశీలించే అవకాశం లభించిందని మంత్రి పేర్కొన్నారు.
దేవాదులపై నిరంతర పర్యవేక్షణ
ఇకపై విధానపరమైన, పరిపాలనా లేదా కాంట్రాక్టు సంబంధిత సమస్యల పేరుతో దేవాదుల పనులు సాగదీయడానికి అవకాశం ఉండదని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. చిత్తశుద్ధి, నిబద్ధత, నిరంతర పర్యవేక్షణతో ప్రాజెక్టును లక్ష్యిత గడువులో పూర్తి చేసేందుకు ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ‘దేవాదులను ఫాస్ట్‌ట్రాక్‌పై పూర్తి చేయాలన్నది ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టమైన ఆదేశమని, త్వరితగతిన ప్రతీ అడ్డంకినీ తొలగించి సకాలంలో అవసరమైన నిధులు అందించి గోదావరి జలాలను గరిష్ఠంగా ఎత్తిపోయడం ద్వారా ఈ చారిత్రక ప్రాజెక్టు ఫలాలను సాధ్యమైనంత త్వరగా రైతుల పొలాలకు చేరుస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు.
స్పష్టమైన కార్యాచరణతో పనులు వేగవంతం చేయాలి
– మంత్రి పొంగులేటి
– మంత్రి పొంగులేటి
దేవాదుల ప్రాజెక్టును ఏడాదిలోగా వంద శాతం పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. దేవాదుల ప్రాజెక్టుపై సమీక్షలో ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టు పనులను ప్రారంభం నుంచి ముగింపు వరకు సమగ్రంగా సమీక్షించి ఎక్కడ పనులు నిలిచిపోయాయి, అందుకు కారణాలేంటి.. వాటిని పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన చర్యలేంటి అనే అంశాలను పాయింట్వారీగా గుర్తించాలని అధికారులను ఆదేశించారు. సమస్యను గుర్తించకుండా పనులు పూర్తవుతాయి అంటూ కాలయాపన చేయడం సరికాదని, ప్రతి సమస్యకు స్పష్టమైన పరిష్కారం, బాధ్యత, గడువు నిర్ణయించాలని అధికారులకు సూచించారు. భూసేకరణ, అనుమతులు, నిర్మాణ పనులు, నిధులు, కాంట్రాక్టు ఏజెన్సీలకు సంబంధించిన సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం, అధికారులు, ఇంజినీర్లు, ఏజెన్సీలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రాజెక్టుపై పూర్తి అవగాహన ఉన్న అధికారులతో మొదలు నుంచి చివరి వరకు సమగ్ర సమీక్ష నిర్వహించి స్పష్టమైన కార్యాచరణను రూపొందించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. సమస్య ఎక్కడ ఉందో ముందుగా గుర్తించాలి.. కారణాన్ని విశ్లేషించాలి.. పరిష్కారాన్ని ఖరారు చేసి అమలు చేయాలి.. ఫలితం వచ్చే వరకు నిరంతరం పర్యవేక్షించాలి.. దేవాదుల పూర్తి విషయంలో ఎలాంటి కాలయాపనకు తావులేదు అని మంత్రి స్పష్టం చేశారు.
శాఖల మధ్య సమన్వయం మరింత పెంచాలి : మంత్రి సీతక్క
దేవాదుల ప్రాజెక్టు పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు వివిధ శాఖల మధ్య సమన్వయాన్ని మరింత పెంచాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. పనుల్లో ఎక్కడా జాప్యం లేకుండా అధికారులు చొరవ తీసుకుని పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. దేవాదుల ప్రాజెక్టు, రామప్ప-లక్నవరం లింక్ కెనాల్ తదితర పనుల పురోగతిపై అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి సీతక్క పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం రామప్పలో 29 అడుగుల వరకు నీటిని నిల్వ చేస్తున్నామని, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని 35 అడుగుల వరకు నీటిని నిల్వ చేసే విధంగా అంచనాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. 29 అడుగుల నుంచి 35 అడుగుల వరకు నీటిని నిల్వ చేస్తే ఎంత మేర భూమి అవసరమవుతుంది, ఎంత భూసేకరణ చేపట్టాల్సి వస్తుందనే అంశంపై స్పష్టమైన లెక్కలు సిద్ధం చేయాలన్నారు. ఒక్కో అడుగు నీటి నిల్వ పెంచినప్పుడు ఎంత భూమి అవసరమవుతుందో విడివిడిగా లెక్కలు రూపొందించి సమగ్ర నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. రూ.33 కోట్లతో రామప్ప-లక్నవరం లింక్ కెనాల్ పనులను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సీతక్క తెలిపారు. ఇది పూర్తయితే ములుగు నియోజకవర్గంలోని మూడు మండలాలకు సాగు, తాగునీటిపరంగా ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. జంపన్న వాగులో ఏడాది పొడవునా నీటి లభ్యత ఉండేలా ఈ లింక్ కెనాల్ కీలకంగా ఉపయోగపడుతుందన్నారు.
జాతర లోపు పనులను కొలిక్కి తీసుకురావాలి
త్వరలో జరగనున్న జాతరను దృష్టిలో ఉంచుకుని రామప్ప-లక్నవరం లింక్ కెనాల్ పనులతోపాటు సంబంధిత అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని మంత్రి సీతక్క ఆదేశించారు. జాతర లోపు పనులను ఒక కొలిక్కి తేవడానికి అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు. అవసరమైనచోట శాఖల మధ్య సమన్వయ సమావేశాలు నిర్వహిస్తూ సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించుకోవాలని సూచించారు.
ములుగు ప్రాంత అభివృద్ధికి నీటి వనరులు కీలకం
నియోజకవర్గ సమగ్ర అభివృద్ధిలో సాగు, తాగునీటి వనరుల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి సీతక్క తెలిపారు. ప్రజలకు, రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనం కలిగించే ప్రాజెక్టులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అధికారులు కేవలం ప్రతిపాదనలు, అంచనాలకే పరిమితంకాక పనులను క్షేత్రస్థాయిలో వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు చొరవ చూపాలని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ప్రతి పనికి స్పష్టమైన కాలపరిమితి, బాధ్యతలు నిర్దేశించుకుని సమన్వయంతో ముందుకు సాగాలని అధికారులను ఆదేశించారు.




