-ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
-నెల రోజులుగా సత్రంలోనే ఉండడంపై అనుమానాలు
-దర్యాప్తు చేపట్టిన స్థానిక పోలీసులు
నంద్యాల, ఆగస్టు 25 : శ్రీశైలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. శ్రీశైలం వడ్డెర అన్నదాన సత్రంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. మూడు రోజులుగా గది నుంచి బయటకు రాకపోవడంతోపాటు దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన సత్రం నిర్వాహకులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని తలుపులు తెరచి చూడగా బాత్రూమ్‌లో ముగ్గురు మహిళలు, ఫ్యాన్‌కు ఇద్దరు పురుషులు ఉరివేసుకొని కనిపించారు. మృతులు సుధాకర్(36), గోగుల ఆదిలక్ష్మి(50), మల్లేశ్వరి(45), శ్రీదేవి(33), మణికంఠ(15)గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. శ్రీశైలం వడ్డెర సత్రంలో సంఘటనా స్థలాన్ని ఆలయ ఈవో శ్రీనివాసరావు, శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ రమేష్ నాయుడు, ఆత్మకూరు డీఎస్పీ రామాంజి నాయక్ పరిశీలించారు. సుధాకర్ కుటుంబ సభ్యులు గత నెల 28వ తేదీన శ్రీశైలం వడ్డెర సత్రం రూమ్ నెంబర్ 11లో రూ. 800 చెల్లించి అద్దెకు తీసుకున్నారు. రెండు రోజుల తర్వాత ఖాళీ చేయాలని సత్రం నిర్వాహకులు చెప్పినప్పటికీ అనారోగ్యంతో వచ్చామని, మరికొద్ది రోజులు ఉండి పూజలు చేయించుకుంటామని సుధాకర్ చెప్పినట్లు సమాచారం. రోజుకు రూ.800లు చెల్లిస్తూ సత్రంలోనే సుధాకర్ కుటుంబ సభ్యులు ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. మృతులు సత్యసాయి జిల్లా బత్తలపల్లి గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. ఐదుగురి మృతదేహాలను కిందకు దించిన శ్రీశైలం పోలీసులు శవ పరీక్షల కోసం సున్నిపెంట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అయితే, నిబంధనలకు విరుద్ధంగా వడ్డెర సత్రం యాజమాన్యం యాత్రికులకు నెల రోజులపాటు రూమును ఎందుకు అద్దెకు ఇచ్చారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతిచెందిన వ్యక్తులు శ్రీశైలంలో నెల రోజులపాటు ఎందుకు ఉన్నారనే కోణంలోనూ విచారణ చేపట్టారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు



