– భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నిర్మాణాలు
– రెవెన్యూ, హౌసింగ్ మంత్రి పొంగులేటి
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 29: పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేదలకు సౌకర్యవంతమైన, భద్రమైన, భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన ఇళ్లను నిర్మించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని గృహ నిర్మాణ, రెవెన్యూ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. పట్టణాల్లోని పేదవాడికి తన జీవనోపాధికి ఇబ్బంది లేకుండా గౌరవప్రదమైన జీవనం కల్పించాలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజన్‌కు అనుగుణంగా అర్బన్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. క్యూర్ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో తొలి విడతగా లక్ష ఇళ్ల నిర్మాణానికి ఇటీవలి కేబినెట్ సమావేశం ఆమోదం తెలిపిన నేపథ్యంలో మంత్రి పొంగులేటి అధికారులతో శుక్రవారం సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అర్బన్ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి రూపొందించిన పలు నమూనా డిజైన్లను పరిశీలించి మార్పులు, సూచనలు చేశారు. రానున్న 40 నుండి 50 సంవత్సరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్మాణాలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఇళ్లు కట్టడం మాత్రమే కాదు.. భవిష్యత్ తరాలకు అనుకూలంగా ఉండే విధంగా డ్రైనేజీ వ్యవస్థ, పార్కింగ్, వాణిజ్య అవసరాలు, ప్రజల జీవనశైలిని దృష్టిలో పెట్టుకుని సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్లాలన్నారు. స్థానిక పరిస్థితులనుబట్టి అవసరమైతే పది అంతస్తుల వరకు భవనాలు నిర్మించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. హాల్, బెడ్‌రూమ్, కిచెన్, బాత్‌రూమ్ వంటి వాటి పరిమాణాల రూపకల్పనలో వాస్తు అంశాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పేద కుటుంబాలు సంతోషంగా, ఆత్మగౌరవంతో జీవించేలా డిజైన్ ఉండాలన్నారు. పార్కింగ్‌తోపాటు షాపుల ఏర్పాటుకు కూడా అవకాశం కల్పించే విధంగా ప్రణాళికలు రూపొందించాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించిన అనంతరం డిజైన్లను ఖరారు చేసి యుద్ధప్రాతిపదికన పనులు ప్రారంభించేలా రోజువారీ కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లోని ప్రతి పేద కుటుంబానికి సొంతింటి భద్రత కల్పించాలనే సంకల్పంతో దేశానికే ఆదర్శంగా నిలిచే అర్బన్ హౌసింగ్ మోడల్‌ను తమ ప్రభుత్వం తీసుకొస్తోందని మంత్రి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





