మహిళలు నిర్ణయాత్మక శక్తిగా ఎదగాలి

– మహిళా సాధికారతకు అండగా కాంగ్రెస్
– యూత్ కాంగ్రెస్ నారీ శక్తి అభియాన్ శిక్షణలో మంత్రి సీతక్క

దిల్లీ, ప్రజాతంత్ర, ఆగస్టు 8 : మహిళల రాజకీయ భాగస్వామ్యమే ప్రజాస్వామ్యానికి బలమైన పునాది అని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క పేర్కొన్నారు. మహిళలు కేవలం ఓటర్లుగా కాక దేశ భవిష్యత్తుకు నిర్ణయాత్మక శక్తిగా ఎదగాలని పిలుపునిచ్చారు. మహిళా సాధికారతకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా నిలిచిందన్నారు. దిల్లీలోని యూత్ కాంగ్రెస్ నారీ శక్తి అభియాన్ శిక్షణ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా ప్రసంగించారు. రాజకీయాల్లో మహిళల పాత్ర, మహిళా సాధికారత కోసం కాంగ్రెస్ ప్రభుత్వాల కృషి, నిర్ణయాత్మక శక్తిగా మహిళలు ఎదగడంలో కాంగ్రెస్ పాత్ర, ఆన్‌లైన్ యుగంలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లు వంటి అంశాలపై కీలక ఉపన్యాసం చేశారు. మహిళల అభివృద్ధి లేకుండా దేశ అభివృద్ధి సాధ్యం కాదని సీతక్క అన్నారు. మహిళల హక్కులు, సమాన అవకాశాలు, రాజకీయ భాగస్వామ్యం కోసం కాంగ్రెస్ పార్టీ చారిత్రకంగా పోరాడిందని తెలిపారు. మహిళలకు సమానావకాశాలు కల్పించడం కేవలం సంక్షేమ కార్యక్రమం కాదని, అది సామాజిక న్యాయానికి, ప్రజాస్వామ్యానికి పునాది అని అన్నారు. దేశంలో మహిళల రాజకీయ ప్రాతినిధ్యం పెరగాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలకు ఓటు హక్కు రావడంతోనే సమానత్వం పూర్తికాదని, ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం, విధాన నిర్ణయాల్లో భాగస్వామ్యం, ప్రభుత్వాలను నడిపించే అవకాశం కూడా సమానంగా ఉండాలని అన్నారు. మహిళలు రాజకీయాల్లోకి వస్తే వారి దృష్టి రోడ్లు, భవనాలపై ఉండదని, పిల్లల విద్య, తల్లుల ఆరోగ్యం, తాగునీరు, అంగన్‌వాడీ కేంద్రాలు, పోషకాహారం, గ్రామీణ జీవనోపాధులు, మహిళల ఆర్థిక స్వావలంబన వంటి అంశాలకు మహిళా నాయకత్వం ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రస్తావిస్తూ మారుమూల అడవుల్లో, గిరిజన ప్రాంతాల్లో ప్రజలతో కలిసి పనిచేసిన అనుభవం మహిళల రాజకీయ భాగస్వామ్యం ఎంత అవసరమో తనకు నేర్పిందన్నారు. అవకాశాలు కల్పిస్తే మహిళలు నాయకత్వంలో అద్భుతంగా రాణించగలరని చెప్పారు. ఆన్‌లైన్ యుగంలో మహిళలు ఎదుర్కొం టున్న సవాళ్లపై మంత్రి సీతక్క తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలు ప్రజా సమస్యలను లేవనెత్తినప్పుడు వారి వాదనలకు సమాధానం చెప్పకుండా వ్యక్తిగత దూషణలు, ట్రోలింగ్, అసభ్యకర వ్యాఖ్యలు, తప్పుడు ప్రచారం, మార్ఫింగ్, బెదిరింపులకు పాల్పడటం ఆందోళనకరమని అన్నారు. మహిళల గొంతును అణచివేసే డిజిటల్ వేధింపులు కేవలం ఒక మహిళకు ఎదురవుతున్న సమస్య కాదని, అది ప్రజాస్వామ్యానికి ఎదురవుతున్న సవాలని సీతక్క అన్నారు. ఇలాంటి దాడులు రాజకీయాల్లోకి రావాలనుకునే యువతులను కూడా వెనక్కి లాగే ప్రమాదం ఉందని తెలిపారు. రాజకీయ విభేదాలు విధానాలపై ఉండాలి కానీ వ్యక్తులపై కాదని స్పష్టం చేశారు. మహిళలపై ఆన్‌లైన్ వేధింపులకు పాల్పడే సంస్కృతిని అడ్డుకోవాల్సిన బాధ్యత పార్టీలు, మీడియా, డిజిటల్ వేదికలు, పౌర సమాజంపై ఉందన్నారు. తెలంగాణలో మహిళా స్వయం సహాయక సంఘాల విజయాలను ఈ సందర్భంగా మంత్రి సీతక్క ప్రస్తావించారు. చిన్న పొదుపులతో ప్రారంభించిన మహిళలు నేడు వ్యాపారవేత్తలుగా ఎదిగి ప్రభుత్వ కార్యక్రమాల అమలులో భాగస్వాములుగా మారారని చెప్పారు. పాఠశాల యూనిఫామ్‌ల తయారీ నుంచి గ్రామీణ జీవనోపాధుల బలోపేతం వరకు మహిళలు తమ సామర్థ్యాన్ని నిరూపించుకున్నారని తెలిపారు. గ్రామ పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు మహిళల గొంతు వినిపించాలని సీతక్క పిలుపునిచ్చారు. మహిళలకు కేవలం ప్రాతినిధ్యం కాకుండా నిర్ణయాధికారం దక్కాలన్నారు. మహిళలు భయపడకుండా మాట్లాడాలి.. ధైర్యంగా ఎన్నికల్లో పోటీ చేయాలి.. నిర్ణయాలు తీసుకునే స్థాయికి ఎదగాలి అని పిలుపునిచ్చారు. మహిళలను బలోపేతం చేయడం అంటే ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడమేనని మంత్రి సీతక్క అన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *