– రూ.2.25 కోట్లు అందించాలని కేసీఆర్ నిర్ణయం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 8 : అనారోగ్యంతో ఇటీవల మరణించిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా నిలనుంది. ఆయన కుటుంబానికి పార్టీ తరఫున రూ.2.25 కోట్ల సాయం అందజేయాలని పార్టీ సీనియర్లు, వరంగల్ జిల్లా ముఖ్య నేతలతో కేసీఆర్ చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లలకు చెరో రూ.కోటి చొప్పున ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించారు. అదే సమయంలో సుదర్శన్ రెడ్డి తల్లి అమృతమ్మ వృద్ధాప్యంలో ఉన్నందున వారి బాగోగుల కోసం రూ.25 లక్షలను ఆమె పేర బ్యాంకులో జమ చేయాలని కూడా కేసీఆర్ నిర్ణయించారు. అంతేగాక పిల్లల భవిష్యత్తు, వారి చదువు, కుటుంబ సంక్షేమానికి సంబంధించి పార్టీ నిరంతరం పర్యవేక్షిస్తూ అండగా నిలుస్తుందని అధినేత తెలిపారు. కాగా, సుదర్శన్ రెడ్డి దశదినకర్మల కార్యక్రమాలు ముగిసిన తర్వాత పార్టీ జిల్లా ముఖ్యులు సమావేశమై వారి కుటుంబ సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారనీ, ఎల్లకాలం వారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని కేసీఆర్ పునరుద్ఘాటించారు.
రేపు పెద్ది కుటుంబ సభ్యులకు కేసిఆర్ పరామర్శ
నర్సంపేట నియోజకవర్గ పరిధిలోని నల్లబెల్లికి కేసిఆర్ ఆదివారం వెళ్లి పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. పార్టీ స్థాపించిన నాటి నుంచి ఎంతో నిబద్ధతతో పనిచేస్తూ తన ముఖ్య అనుచరుడుగా కొనసాగిన పెద్ది సుదర్శన్ రెడ్డి మరణంతో విషాదంలో ఉన్న అధినేత కేసిఆర్ తన ఆప్తుని కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఈ సందర్భంగా ఇంటి పెద్దను కోల్పోయి శోక తప్త హృదయులై వున్న పెద్ది కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చి కష్టకాలంలో ఉన్న వారికి భరోసా ఇవ్వనున్నారు. ఇదే సందర్భంలో పార్టీ నియోజకవర్గ నాయకులకు, కార్యకర్తలకు, పెద్ది అభిమానులకు అధినేత కేసిఆర్ గుండె ధైర్యం నింపనున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





