– కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, కిషన్ రెడ్డి
– మోదీ జన్మదినం సందర్భంగా తిమ్మాపూర్‌లో ఘనంగా ‘ఆశీర్వాద దీపం’
కందుకూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 17: మోదీ ప్రధాని అయ్యాక ప్రపంచవ్యాప్తంగా దేశ గౌరవం పెరిగిందని, వికసిత భారత్‌గా విరాజిల్లుతోందని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కొనియాడారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 76వ జన్మదినం, ప్రభుత్వ అధినేతగా ఆయన 25 ఏళ్ల ప్రజా సేవను పురస్కరించుకుని ‘సేవా సంకల్ప అభియాన్’లో భాగంగా రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్ లో ‘ఆశీర్వాద దీపం’ కార్యక్రమాన్ని స్థానిక మహిళలు అత్యంత వైభవంగా నిర్వహించారు. గురువారం జరిగిన ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, జి.కిషన్ రెడ్డిలకు మహిళలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన రైతుల ముఖాముఖిలో శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల ద్వారా పూచీకత్తు లేకుండా బ్యాంక్ రుణాలు అందిస్తూ ప్రతి అక్కాచెల్లెలిని లక్షాధికారిని చేయడమే మోదీ గ్యారంటీ అని స్పష్టం చేశారు. పీఎం ఆవాస్ యోజన కింద రాష్ట్ర ప్రభుత్వం కట్టించే ప్రతి పక్కా ఇంటికి కేంద్రం రూ.2 లక్షలు అందిస్తోందని వెల్లడించారు. తెలంగాణ రైతుల ఆదాయం పెంచేలా ప్రత్యేక రోడ్ మ్యాప్ రూపొందించామని, ఫసల్ బీమా యోజన ద్వారా పంట బీమా కల్పిస్తున్నామని తెలిపారు. రజాకార్ల దాడుల నుంచి రక్షణకు ఇక్కడి ప్రజలు నిర్మించుకున్న ‘బురుజు’ స్ఫూర్తిదాయకమన్నారు.
అరుదైన నాయకుడు నరేంద్ర మోదీ 
కిషన్ రెడ్డి మాట్లాడుతూ 25 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా దేశ ప్రజల కోసమే పనిచేస్తున్న అరుదైన నాయకుడు నరేంద్ర మోదీ అని ప్రశంసించారు. శివరాజ్ సింగ్ మధ్యప్రదేశ్ సీఎంగా ఉన్నప్పుడు ప్రజలందరితో మామా అని పిలిపించుకున్నారని, ఇప్పుడు దేశ గ్రామీణాభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని కొనియాడారు. సెప్టెంబర్ 17కి తెలంగాణ చరిత్రలో అత్యంత కీలక స్థానం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం 14, 15, 16వ ఆర్థిక సంఘాల ద్వారా గ్రామ పంచాయతీలకు నేరుగా నిధులు కేటాయిస్తోందన్నారు. అంతర్జాతీయంగా ఎరువుల ధరలు పెరిగినా ఆ భారం రైతులపై పడకుండా యూరియాపై భారీ సబ్సిడీని కేంద్రమే భరిస్తోందని, కిసాన్ సమ్మాన్ నిధితో అండగా నిలుస్తోందని చెప్పారు. గ్రామీణ రవాణా వ్యవస్థ మెరుగుదలలో భాగంగా బేగంపేట-మాదాపూర్-ఎల్మినేడు మార్గానికి రూ.17 కోట్లు, శ్రీశైలం రోడ్డు-గుణగల్ మార్గానికి రూ.20 కోట్లు, రాచలూరు-తిమ్మాపూర్-జబ్బార్‌గూడ-ఇబ్రహీంపట్నం రహదారికి రూ.20 కోట్లతో పక్కా రోడ్లు నిర్మిస్తున్నట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. తిమ్మాపూర్ లో తొలిసారిగా బ్యాంక్, కమ్యూనిటీ హాల్ వసతులు కల్పించామన్నారు. కార్యక్రమంలో ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, పోలీస్ యంత్రాంగానికి మంత్రులు కృతజ్ఞతలు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





