– రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి
– కబ్జాలోని ప్రభుత్వ భూములు గుర్తించి పేదలకు అందిస్తాం
హైదరాబాద్/కూసుమంచి, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 17: ఇళ్ల స్థలాలు కావాలని అనేకమంది పేదలు ప్రభుత్వాన్ని కోరుతున్నారని, పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యమని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో లబ్దిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో పేదలకు ఇళ్ల స్థలాలు అందించాలనే ఉద్దేశంతో కొన్ని గ్రామాల్లో భూములను సేకరించిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆ భూములు అన్యాక్రాంతమై కొందరి అధీనంలోకి వెళ్లాయని మంత్రి ఆరోపించారు. ఆ భూములను గుర్తించి అన్యాక్రాంతం నుంచి విడిపించి అర్హులైన పేదలకు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని చెప్పారు. ఈ మేరకు ఆయా భూములను గుర్తించి వివరాలను పరిశీలించి, అర్హులైన పేదలకు కేటాయించేలా ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి వెల్లడించారు. పేదలకు ఇళ్ల స్థలం ఇవ్వడం కేవలం ప్రభుత్వ పథకం కాదు.. ప్రతి పేద కుటుంబానికి ఆత్మగౌరవంతో జీవించే హక్కును కల్పించే బాధ్యత అని అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





