ఎడ్యుకేషన్, ఇండస్ట్రియల్ హబ్‌గా తీర్చిదిద్దుతా

– కొడంగ‌ల్‌పై సీఎం రేవంత్ రెడ్డి వ‌రాల జ‌ల్లు
– రూ.9,053 కోట్లతో భారీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన
– డిసెంబర్ నాటికి కృష్ణా జలాలు తెస్తాం
– పాలమూరు అభివృద్ధిని గత పదేళ్లలో అడ్డుకున్నారు
– కేసీఆర్, కేటీఆర్‌లపై తీవ్రస్థాయిలో మండిపాటు

కొడంగల్, ప్రజాతంత్ర, నవంబర్ 9 : పాలమూరు జిల్లాను, ముఖ్యంగా కొడంగల్ నియోజకవర్గాన్ని సర్వతోముఖాభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. లగచర్ల ఇండస్ట్రియల్ కారిడార్ వేదికగా సోమవారం నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. సుమారు రూ.9,053 కోట్ల భారీ అంచనా వ్యయంతో కూడిన పలు అభివృద్ధి, సంక్షేమ పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా లగచర్లలో ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. పాలమూరు ఎడారిగా మారడానికి గత పాలకుల నిర్లక్ష్యమే కారణమని బీఆరఎస్‌పై నిప్పులు చెరిగారు. బూర్గుల రామకృష్ణారావు నుంచి నేటివరకు ఎంతోమంది పాలమూరు గడ్డ నుంచి ప్రాతినిధ్యం వహించినప్పటికీ ఈ ప్రాంతంలో వలసలు పూర్తిగా ఆగలేదని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వస్తే కష్టాలు తీరుతాయని ఆశించి కేసీఆర్‌ను గెలిపిస్తే ఆయన పాలమూరు ప్రాజెక్టులను పదేళ్లు పడావు పెట్టాడని విమర్శించారు. తెలంగాణ వచ్చాక ముఖ్యమంత్రిగా బాధ్యత ఇచ్చినా పాలమూరు జిల్లా గుండెలపై తన్ని గజ్వేల్‌కు పోయి కక్షగట్టి అభివృద్ధిని అడ్డుకున్నారని మండిపడ్డారు. మాట్లాడాలంటే కేసీఆర్ ఆసెంబ్లీకి రాడంటూ ఆయన తింటే కుంభకర్ణుడు.. పడుకుంటే బకాసురుడని సీఎం ఎద్దేవా చేశారు. మక్తల్-నారాయణపేట-కొడంగల్ (ఎంఎన్‌కేఎలఐఎస్) ఎత్తిపోతల పథకం పనులు తాము మొదలుపెడితే బీఆరఎస్ నేతలు అడ్డుకోవాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు. కేటీఆర్ గడ్డం పెంచుకున్నా రేవంత్ రెడ్డి కాలేరని, రేవంత్ రెడ్డి కావాలంటే గుండె ధైర్యం, నమ్ముకున్న వారి కోసం నిలబడే తెగువ ఉండాలని స్పష్టం చేశారు.

కొడంగల్‌కు కృష్ణా జలాలు పక్కా

ఎవరు అడ్డమొచ్చినా అడ్డువచ్చిన వారిని తొక్కుకుంటూ డిసెంబర్ నాటికి కృష్ణా జలాలు తెచ్చి కొడంగల్ బీడు భూములను తడుపుతాం” అని సీఎం రేవంత్ రెడ్డి పోలేపల్లి ఎల్లమ్మతల్లిపై ఆన చేసి ప్రకటించారు. కొడంగల్ నియోజకవర్గాన్ని ఒక ఎడ్యుకేషన్ హబ్‌గా మారుస్తున్నామని, రాబోయే రోజుల్లో వేల కోట్ల పెట్టుబడులు తెచ్చి ఉపాధి అవకాశాలు సృష్టిస్తామని తెలిపారు. జర్నలిస్టులు ఎవరూ అధైర్యపడొద్దని, వారి సమస్యలను పరిష్కరించే పూర్తి బాధ్యత తనదని భరోసా ఇచ్చారు.

శంకుస్థాపనల వివరాలు

నియోజకవర్గంలో రూ.9,053 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కొత్తవాల్‌గూడ నుంచి నాచారం వరకు రూ.5,060 కోట్లతో రేడియల్ రోడ్డు-2 నిర్మాణానికి, ప్రత్యేక అభివృద్ధి నిధుల కింద రూ.1,410 కోట్లతో 223 కొత్త, అసంపూర్తి బీటీ రహదారుల పనులకు శంకుస్థాపన చేశారు. రూ.2,100 కోట్లతో ఎంఎన్‌కేఎలఐఎస్ రెండో దశ పనులకు, రూ.118.80 కోట్లతో 10 తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటుకు, రూ.123 కోట్లతో కొడంగల్‌లో వ్యవసాయ కళాశాల నిర్మాణానికి, రూ.41.83 కోట్లతో కొడంగల్, కోస్గి, మద్దూరులో ఆధునిక బస్ స్టాండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే రూ.20 కోట్లతో మద్దూరులో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (న్యాక్) స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ నిర్మాణానికి, రూ.20 కోట్లతో సమీకృత డివిజనల్ కార్యాలయ సముదాయం నిర్మాణానికి, రూ.59.30 కోట్లతో రహదారుల నిర్మాణ పనులకు, రూ.4.45 కోట్లతో తిమ్మారెడ్డిపల్లిలో గురులోక మసంద్ ప్రభు మందిరం అభివృద్ధికి, రూ.5.10 కోట్లతో కొడంగల్‌లో నిరంజన్ మఠం అభివృద్ధికి, రూ.10 కోట్లతో లగచర్ల ఇండస్ట్రియల్ కారిడార్‌లో పర్యాటక హోటల్ నిర్మాణానికి, రూ.81 కోట్లతో ఎకోపామ్ పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమాల్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర్ రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎంపీ మల్లు రవి, వేం నరేందర్‌రెడ్డి, తదిరులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పెద్ద ఎత్తున రైతులు, ప్రజలు పాల్గొన్నారు.

పోలేపల్లి ఎల్లమ్మ ఆలయం నుంచి పాదయాత్ర 

అంతకుముందు పోలేప‌ల్లి ఎల్ల‌మ్మ ఆల‌యంలో ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. అక్క‌డినుంచి పాదయాత్రగా లగచర్ల బహిరంగ సభకు బయలుదేరారు. ఆయనతోపాటు పాదయాత్రలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *