7/7/2026 తేదీన ప్రజాతంత్ర దినపత్రికలో శ్రీధర్ దేశ్ పాండే గారు రాసిన ” చార్ ధాం యాత్రికులకు ఒక అడ్వైజరీ ” అనే వ్యాసం చదివాను. ఆయన తన వ్యాసంలో..” పైడిమర్రి గిరిజగారు రాసిన గిరిగమనం పుస్తకంలో ఒక వ్యాసం తప్ప మరేమీ దొరకలేదు. అందులో కూడా పోయాము, వచ్చాము అన్న రీతిలో కొంత సమాచారాన్ని, తన అనుభవాలను ఆమె రాసుకున్నారు.” అంటూ నేను చేసిన చార్ ధాం యాత్రను తేలికగా తీసుకున్నారు. ఆయన నా వ్యాసాన్ని యాత్ర ముగించు కొని వచ్చిన తర్వాత చదివి ఉంటారు. లేదా సరైన అవగాహన చేసుకొని ఉండరు. ఈ సందర్భంగా నా చార్ ధాం యాత్రలో రాసిన కొంత సమాచారాన్ని ఇక్కడ ఇవ్వడం ఒక యాత్రికురాలిగా నా బాధ్యతగా భావించి ఈ వ్యాసం రాస్తున్నాను.
” ఆ ప్రయాణం చాలా ప్రమాదకరమని చిన్నప్పటి నుంచి కథలు కథలుగా విన్న విషయాలు, చూసిన వీడియోలు చార్ ధాo ప్రయాణం పట్ల ఆసక్తిని పెంచాయి,” అని వ్యాసం మొదటి పేరాలోనే చెప్పాను. ( గిరి గమమం.. పుట 32) అది అతి ప్రమాదకరమైన, సాహసోపేతమైన ప్రయాణం అనే విషయం జగమెరిగిన సత్యం.
గుర్రాలు, డోలీలు, పాల్కికీల ధరలు, శుభ్రత,కొండ అంచులలో ప్రయాణం ఎంత భయంకరమైందో చెప్పలేదనేది మరో ఆరోపణ. నా యమునోత్రి ట్రిక్ అనుభవాల సందర్భంలోనే..” గుర్రాలు, డోలీలు, పాల్కిలీలు, నడిచి వెళ్ళే వాళ్ళు అందరికీ ఒకటేదారి ఉండడం వలన నడిచి వెళ్ళేవాళ్ళు అన్నింటినీ తప్పించుకుంటూ జాగ్రత్తగా వెళ్ళాలి. ఏ మాత్రం అప్రమత్తంగా ఉన్నా ప్రమాదం మన వెంటే పొంచి ఉంటుంది. మేం వెళుతున్నప్పుడూ వస్తున్నప్పుడు ఐదారుగురు గుర్రాల పైనుంచి కింద పడిపోయారు.. గుర్రం తొక్కడం వలన నా స్నేహితురాలి బూటు చిరిగి కాలికి గాయం అయింది..దారి పొడుగునా గుర్రాల మలమూత్రాల వాసన..” ( పుట.. 33, 34 )దీనిని బట్టి అక్కడ ఎంత రద్దీ వుందో అర్థమవుతుంది. అయినా మన దేశంలో పుణ్యక్షేత్రాలలో రద్దీ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇదే సందర్భంలో మరోచోట రద్దీ కారణంగా నేను నా స్నేహితుల నుంచి విడిపోయి పోలీసుల సహాయాన్ని తీసుకున్న విషయాన్ని కూడా ఉటంకించాను.
కేదార్ నాథ్ ప్రయాణానికి సంబంధించి.. గంగోత్రిలోనే మా బృంద సభ్యులందరికీ అక్కడి డాక్టర్లు పరీక్షించి కొందరిని కేదార్ నాథ్ వెళ్ళవద్దని హెచ్చరించారని ప్రస్తావించాను.(పుట 35,36)ముఖ్యంగా ప్రహ్లాద్ గారి గురించి స్పష్టంగా రాశాను. వయసు 54 ఏళ్ళు. అతనికి అక్కడి వాతా వరణం కారణంగా శ్వాస సమస్య వచ్చింది. అతని భార్య అంజన మా ఐదుగురి బృందంలో చేరింది. మేం గుర్రం ఎక్కవద్దని అనుకున్నా మా నిర్వాహకుల సూచన మేరకు ఎక్కక తప్పలేదు. ఆ సందర్భంలో కూడా గుర్రం మీద నుంచి కిందకు పడిపోకుండా ఉండడానికి ఎలాంటి మెళకువలు పాటించాలో వివరంగా చెప్పాను. గుర్రాలకు, డోలీలకు, పాల్కీలకు అక్కడి ప్రభుత్వం నిర్ణయించిన ధరలను పేర్కొన్నాను. ఆ కౌంటర్ల కొరకు రెండు కిలోమీటర్లు నడిచి వెళ్ళిన విషయం చెప్పాను. అది అర్థం చేసుకోకుండా తొందరపడి ముందరే ప్రైవేటుగా మాట్లాడుకుంటే ఆర్థిక భారం తప్పదు మరి.
మరో విషయం ..చిన్న చిన్న గుడిసె హోటళ్ళు, అక్కడి ఆహారం, అవి తింటే వచ్చే అనారోగ్యం.. ఆ పర్వతాలలో పక్కా భవనాలతో స్టార్ హోటళ్ళు నిర్మించడం శ్రేయస్కరం కాదనే విషయం సామాన్యులకు కూడా తెలిసిందే.. ఏది తినాలి? ఏది మనకు సరిపడుతుందనే విషయం ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఉచితంగా ఇచ్చే ఆహారం పట్ల మనకు ఒక రకమైన సందేహం ఎప్పుడూ ఉంటుంది. కానీ అలాంటి చోట్ల అదే శ్రేయస్కరమైంది. కేదార్ నాథ్ దారిలో ఆ సౌకర్యం కూడా ఉన్నదన్న విషయాన్ని చెప్పాను. (పుట 38)ఈ విషయం ప్రకృతి వైపరీత్యాలు వ్యాసంలో రాసాను. online payments కాలంలో ఉన్న మనం అక్కడికి వెళ్ళాక నగదు ఇబ్బంది పడకూడదని ఒక యాత్రికురాలిగా ఆ విషయం కూడా సూచించాను. ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు ఎదుర్కోకుండా శ్రీధర్ గారి బృందం తిరిగి రావడం సంతోషకరం.
బద్రీ నాథ్ తొక్కిసలాటలో ప్రాణాలతో బయట పడ్డానని స్పష్టంగా రాశాను. (పుట 39) అయినా మన దేశంలోని పుణ్యక్షేత్రాలలో ఉండే రద్దీ, మూఢభక్తి దానివల్ల ఏర్పడే తొక్కిసలాట గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దేవుడి మీద ఉండే భక్తి, పరిసరాల శుభ్రత మీదా ప్రకృతిపట్ల లేక పోవడం మనం చాలా చోట్ల గమనిస్తాం.
ఎవరి ఊపిరి వాళ్ళే పీల్చాలి అన్నట్లుగా మన శక్తి సామర్థ్యాన్ని, ఆరోగ్య పరిస్థితి, రోగనిరోధక శక్తి, ఆర్థిక పరిస్థితిని బట్టి వాళ్ళు తమ తమ ప్రయాణ గమ్యాలను నిర్ణయించుకోవాలి. ఇక్కడ ఒక చిన్న అనుభవం చెపుతాను. అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళి గతవారమే వచ్చాను. ఇండో చైనా బార్డర్ బూమ్లా పాస్ 15200 అడుగులకంటే ఎత్తైన ప్రదేశం. కేదార్ నాథ్ కంటే దాదాపు మూడు, నాలుగువేల ఎత్తు. రెండు కిలోమీటర్లు నడిస్తే బార్డర్ కు చేరుకుంటాం. వాహనం దిగిన పది నిమిషాలకు నా స్నేహితు రాలికి బ్రీతింగ్ సమస్య మొదలైంది. రిస్క్ తీసుకోలేనని, తాను రానని వెనక్కి వెళ్ళిపోయి, కెఫ్టీరియాలో కూర్చొని వేడి కాఫీ తాగి ఉపశమించింది.
నేను బార్డర్ వరకు వెళ్ళి వచ్చి, తనను కలుసుకొని వర్షం మొదలు కాకముందే అక్కడినుంచి బయలుదేరిపోయాం. ఈ సంఘటన ఇక్కడ ఎందుకు ప్రస్తావించానంటే కొన్ని పరిస్థితులలో ఎవరికి వాళ్ళే నిర్ణయం తీసు కోవాలి. ఒక యాత్రికురాలుగా పర్యాటకులను భయభ్రాంతులకు గురిచేయడం సమంజసం కాదని నా అభిప్రాయం. ముఖ్యంగా ఎలాంటి ట్రావెల్ ఏజెంట్ తో వెళ్ళాలి? అనేది చాలా ముఖ్యం. మనం వెళ్ళే పర్యాటక ప్రాంతాల నైసర్గిక స్వరూపాలు, సామాజిక పరిస్థితులు తెలుసుకొని బయలుదేరడం చాలా అవసరమని సూచిస్తున్నాను.
writer: గిరిజ పైడిమర్రి





