1991 చట్టంపై చర్చలు ఎందుకు?

భారతదేశం లౌకిక దేశం. పౌరులు స్వేచ్ఛగా తమ మతాలను ఆచరించవొచ్చు. మత స్వేచ్ఛకు భంగం కలగకుండా చూడటం ప్రభుత్వాల విధి. అలాగే మతం ప్రాతిపదికన ప్రభుత్వాలు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ఇక, మత స్వేచ్ఛకు సంబంధించిన ఎన్నో చట్టాలు ఉన్నాయి. వాటిలో ప్రముఖమైనది ప్రార్థనా స్థలాల చట్టం. 1947లో దేశానికి స్వతంత్రం వొచ్చినప్పుడు అస్థిత్వంలో ఉన్న మతపరమైన కట్టడాలు. వాటి గుర్తింపు, స్వభావాన్ని, నిర్మాణాన్ని రక్షించేందుకు ఉద్దేశించిన చట్టం ఇది. మతపరమైన కట్టడాలు అంటే అవి దేవాలయాలు, మసీదులు, చర్చిలు, గురుద్వారా లు…ఏవైనా కావొచ్చు, 1947లో దేశానికి స్వతంత్రం వొచ్చినప్పుడు వాటి స్వరూపం ఎలా ఉందో అలాగే కొనసాగించాలని ఈ చట్టం చెబుతోంది. అయోధ్యలో బాబ్రీ మసీదు స్థానంలో రామ మంది రం నిర్మించాలని బీజేపీ నాయకత్వంలో చేపట్టిన ఉద్యమం బలం పుంజుకోవడంతో కేంద్రంలోని నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం 1991లో ‘ది ప్లేస్‌ ఆఫ్‌ వర్షిప్‌ (స్పెషల్‌ ప్రొవిజన్స్‌)’ చట్టం తీసుకొచ్చింది. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ దీనిని గట్టిగా వ్యతిరేకించింది. 1991లో అమల్లోకి వచ్చిన ఈ చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో అనేక కేసులు దాఖలయ్యాయి. సర్వోన్నత న్యాయస్థానం ఇప్పుడు వాటిని విచారిస్తోంది. కాగా, మతపరమైన ప్రార్థనా స్థలాలను సర్వే చేయాలని కోరుతూ కొత్తగా దాఖలయ్యే పిటిషన్లను స్వీకరించరాదని, ప్రస్తుతం విచారణలో ఉన్న పిటిషన్లపై తాత్కాలిక లేదా తుది ఉత్తర్వులు జారీ చేయరాదని దేశంలోని అన్ని కోర్టులను సుప్రీంకోర్టు తాజాగా ఆదేశిం చింది.

ప్రార్థనా స్థలాల ప్రత్యేక నిబంధనల చట్టం, 1991 చెల్లుబాటుపై విచారణ జరిపి, తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు కోర్టులు సంయమనం పాటించాలని తెలిపింది. సీజేఐ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది. దీంతో జ్ఞానవాపి, మథుర, సంభల్‌ సహా 10 మసీదులు, దర్గాలపై హిందూ పిటిషనర్లు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ నిలిచిపోయింది. వీటి మతపరమైన అసలు స్వభావాన్ని తెలుసుకునేందుకు సర్వే చేయాలని ఈ పిటిషనర్లు కోరుతున్నారు. సీజేఐ నేతృత్వంలోని ప్రత్యేక ధర్మాసనం 6 పిటిషన్లపై విచారణ సందర్భంగా ఈ ఆదేశాలను ఇచ్చింది. ప్రార్థనా స్థలాల ప్రత్యేక నిబంధనల చట్టం, 1991 నిబంధన లను సవాల్‌ చేస్తూ న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్‌ దాఖలు చేసిన పిటిషన్‌ కూడా వీటిలో ఉంది. ఈ పిటిషన్లపై నాలుగు వారాల్లోగా స్పందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రార్థనా స్థలాల చట్టం1991 విరీద దాఖల్కెన పిటిషన్‌ విషయంలో సుప్రీంకోర్టు చెప్పబోయే తీర్పు విరీద దేశంలో ప్రస్తుతం వివాదంలో చిక్కుకున్న డజన్ల కొద్దీ ప్రార్థనాలయాల భవిష్యత్‌ ఆధారపడి ఉంది. ఇందులో ఎక్కువ భాగం కట్టడాలు ముస్లింలకు చెందినవి. వీటి విరీద హిందూ సంస్థలు పిటిషన్లు దాఖలు చేశాయి. కోర్టు కేసుల్లో చిక్కుకున్న వాటిలో జ్ఞానవాపి, షాహి ఈద్గా, వారణాసి, మధురలోని రెండు వివాదాస్పద మసీదులు ఉన్నాయి. రెండు వారాల కిందట అజ్మీర్‌ దర్గా విషయంలో దాఖల్కెన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం రాజస్థాన్‌ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

అజ్మీర్‌లో ప్రతిరోజూ వేలమంది సందర్శించే 13వ శతాబ్దానికి చెందిన ఈ సూఫీ మందిరాన్ని హిందూ ఆలయం విరీద నిర్మించారని కోర్టులో పిటిషన్‌ దాఖల్కెంది. నెల రోజుల కిందట ఉత్తరప్రదేశ్‌లోని సంభల్‌ 16వ శతాబ్దానికి చెందిన మసీదులో సర్వే నిర్వహించాలని కోర్టు ఆదేశించడంతో హింస చెలరేగింది. ఇందులో నలుగురు మరణించారు. సర్వే నిర్వహించాలన్న కోర్టు నిర్ణయంపై ముస్లిం సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. కోర్టులు సర్వేకు ఆదేశాలు జారీ చేసినప్పుడల్లా ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి. జ్ఞానవాపి మసీదు విషయంలోనూ ఇదే జరిగింది. 17వ శతాబ్దంలో కాశీ విశ్వనాధుడి ఆలయాన్ని కూల్చివేసి మొఘల్‌ చక్రవర్తి ఔరంగజేబు మసీదు నిర్మించారని హిందూ సంఘాలు ఆరోపించాయి. జ్ఞానవాపి మసీదులో సర్వే నిర్వహించాలన్న కోర్టు ఆదేశాలను ముస్లిం సంఘాలు వ్యతిరేకించాయి. ఇది 1991 ప్రార్థనా స్థలాల చట్టానికి విరుద్ధమనేది వారి వాదన. అయితే 2022లో సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని బెంచ్‌ సర్వేను ఆపాలని చెప్పలేదు. 1947 ఆగస్టు 15నాటికి ఉన్నప్రార్థనాలయాల స్వభావాన్ని మార్చడానికి ప్రయత్నించనంత వరకు, వాటిపై దర్యాప్తును 1991 చట్టం నిరోధించలేదని ప్రధాన న్యాయమూర్తి చెప్పారు. ఈ ఉత్తర్వులను అనేక మంది విమర్శించారు. వివిధ ఆరోపణల వల్ల స్థలాల చారిత్రక స్థితిని నిర్ణయించడం అనేది మతాల మధ్య ఘర్షణలను, హింసను రెచ్చగొట్టే అవకాశం ఉంది. ఒకవేళ ఈ చట్టాన్ని తొలగించినా లేక బలహీనపరిచినా అది ఇలాంటి అనేక పిటిషన్లకు గేట్లు తెరవడం లాంటిదేనని ప్రతిపక్ష నాయకులు, ముస్లిం సంఘాల నేతలు భావిస్తున్నారు. దీని వల్ల దేశంలో హిందువులు, ముస్లింల మధ్య మతపరమైన ఉద్రిక్తతలు చెలరేగే అవకాశం ఉందని అంటున్నారు.

-మహేందర్‌ మిట్టపల్లి
(సీనియర్‌ జర్నలిస్ట్‌ )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *