అసెంబ్లీ స‌మావేశాలకు స‌హ‌క‌రించాలి

– స‌భ్యుల ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు స‌త్వ‌రం అందించాలి
– చ‌ర్చ స‌మ‌యంలో అధికారులు అందుబాటులో వుండాలి
– మెటీరియ‌ల్‌ను ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూ భాష‌ల్లో ప్ర‌చురించాలి
– శాస‌న‌స‌భ స్పీక‌ర్ ప్ర‌సాద్‌కుమార్‌

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 5: సోమవారం నుండి ప్రారంభం కానున్న  రాష్ట్ర శాసనసభ, శాసన పరిషత్ వర్షాకాల సమావేశాలు స‌జావుగా సాగేందుకు అధికార్లు స‌హ‌క‌రించాల‌ని స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ సూచించారు. ఈ నేపధ్యంలో నిర్వాహణ, వసతులు, భద్రతా ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసు శాఖ ఉన్నతాధికారుల తో శ‌నివారం శాసన పరిషత్ సమావేశ మందిరంలో నిర్వ‌హించిన స‌న్నాహ‌క స‌మావేశంలో ఆయ‌న ప్ర‌సంగించారు. గత సమావేశాలు సజావుగా జరగడానికి సహకరించిన ప్రభుత్వ అధికారులు, పోలీసు శాఖ, శాసనసభ అధికారులు, సిబ్బంది అందరికీ ధన్యవాదాలు తెలిపారు. గతంలో లాగానే ఈ సమావేశాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు సహకారం అందించాలి. సభ్యులు అడిగిన సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా అందించాలి. సభ్యులకు అందించే మెటీరియల్ ను తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషలలో ముందస్తుగా సమర్పిస్తే సభ్యులు చదువుకుని సమావేశాలకు హాజరవుతారు. శాఖలకు సంబంధించిన చర్చ జరుగుతున్నప్పుడు సంబంధిత శాఖల అధికారులు అందుబాటులో ఉంటూ మంత్రులకు, సభ్యులకు తగిన సమాచారం అందిస్తూ సహకరించాలి.శాసనసభ, శాసనమండలి సమావేశాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా జరగడానికి పోలీసు శాఖ తరుపున అవసరమైన చర్యలు  తీసుకోవాల‌న్నారు. సభ లోపల, బయట కూడా ప్రశాంత వాతావరణం ఉంటేనే సమావేశాలు సజావుగా జరుగుతాయ‌ని గుర్తుచేశారు. తెలంగాణ పోలీసు శాఖకు దేశ వ్యాప్తంగా సమర్ధవంతమైనదిగా పేరుంది. ఈసారి సమావేశాలు కూడా విజయవంతంగా జరగడానికి అవసరమైన రక్షణ,బందోబస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నాన్నారు. శాస‌న మండ‌లి ఛైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో మాదిరిగా కాకుండా ఇంకా వేగంగా అధికారులు పని చేయాలన్నారు.
సమావేశాలు జరిగే సమయంలో అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండాలి. నోడల్ అధికారులను నియమించి , సమావేశాలు సక్రమంగా నిర్వహించాలి. ఈ సారి సమావేశాలు హాట్ హాట్ గా జరిగే అవకాశం ఉంది. పోలీస్ శాఖ చాలా అప్రమత్తంగా  ఉండాల్సిన అవసరం ఉంది. ఇంటెలిజెన్స్ అధికారులు త్వరగా సమాచారం అసెంబ్లీ అధికారులకు అందించాలి. ధర్నాలు , రాస్తారోకోలు జరగకుండా ప్రశాంతంగా సమావేశాలు జరిగేలా అధికారులు చూడాల‌న్నారు. శాసన స‌భ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు  మాట్లాడుతూ చైర్మన్,  స్పీకర్  సూచనలను ఖచ్చితంగా అమలు చేయాలి. ఒకరోజు ముందే సంబంధిత ప్రశ్నలకు జవాబులను అందజేయాలి. ఉభయ సభల సమావేశాల సమయంలో ప్రభుత్వం బాధ్యతగా ఉంటూ పూర్తి స్థాయిలో సహకరిస్తాం. ప్రతి శాఖ తరుపున ఒక అధికారి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారన్నారు. ప్రభుత్వ కార్యనిర్వాహక వ్యవస్థ సమర్ధతకు ఉభయ సభల  సమావేశాలు నిదర్శనం. అందుకే ప్రభుత్వ యంత్రాంగం తరుపున పటిష్టమైన చర్యలు తీసుకుని  సమావేశాలు విజయవంతంగా జరపడానికి సహకరిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. స‌మావేశంలో శాసన మండలి చైర్మన్  గుత్తా సుఖేందర్ రెడ్డి , తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి  గడ్డం ప్రసాద్ కుమార్  శాసన వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు గా, డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాష్ , కౌన్సిల్ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, శాసన పరిషత్ కార్యదర్శి డాక్టర్ వి.నరసింహాచార్యులు, శాసనసభ కార్యదర్శి రేండ్ల తిరుపతి పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ప్రిన్సిపల్ సెక్రటరీ  అహ్మద్ నదీమ్, డిజిపి సివి ఆనంద్, ప్రిన్సిపల్ సెక్రటరీ హోం) శిఖా గోయల్, లా అండ్ ఆర్డర్ డీజీ మహేష్ భగవత్, అడిష‌న‌ల్ డీజీ(ఇంటెలిజెన్స్) విజయకుమార్, సిటీ కమిషనర్ విసి సజ్జనార్, ఇంటెలిజెన్స్ఐ జీ కార్తికేయ, అసెంబ్లీ, కౌన్సిల్ చీఫ్ మార్షల్స్ కర్ణాకర్, సంజీవ రెడ్డి  త‌దిత‌రులు కూడాపాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *