ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా ఎందుకు చేయరు?

“ప్రక్క దేశాలైన నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ లాంటి చోట్ల వచ్చిన జెన్ జెడ్ తిరుగుబాటు ప్రభావం భారతీయ యువత పై ఉంది.ఇదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం లో పేరుకుపోయిన అవినీతి మూలంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ప్రవేశ పరీక్ష పేపర్లు పదేపదే లీక్ కావడం, పరీక్షలు రద్దు కావడం.కొందరు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడంతో విద్యార్థుల్లో అసహనం పెరిగింది.ఉద్యోగ అవకాశాలు లేని నిరుద్యోగ యువత అగ్నికి ఆజ్యం లా ఇప్పుడు తోడైంది.కాక్రోచ్ జనతా పార్టీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలి అనే ఏకైక నినాదంతో భౌతిక ఉద్యమానికి సైతం సన్నద్ధం అయ్యారు..”

ఎన్.తిర్మల్
(పొలిటికల్ ఎనలిస్ట్, సామాజిక కార్యకర్త)
సెల్:9441864514,

జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల నిర్వాహణలో వైఫల్యం చెందిన కేంద్ర మానవ వనరుల మంత్రి(కేంద్ర విద్యాశాఖ మంత్రి) ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా ఎందుకు చేయరు? అసలు ధర్మేంద్ర ప్రదాన్ పేరులో ధర్మం లేదు.అది ప్రదానం కూడా కాదు!ఆయన ఆచరణ అలా ఉంది.ఆయనే కాదు కేంద్ర క్యాబినెట్ నే వైఫల్యాల పుట్ట!ఆయన రాజీనామా చేస్తే కేంద్ర క్యాబినెట్ మోత్తం రాజీనామా చేయాల్సి ఉంటుంది.సంకట స్థితిలో దేశ ప్రధాని చేష్టలుడిగి పోవడం ఇదే తొలిసారి! ప్రక్షాళన జరిగితే,ఒక్కరినే చేస్తారా! వ్యూహాత్మకంగా క్యాబినెట్ మోత్తం ప్రక్షాళన చేస్తారా?

    గత కొన్నేళ్లుగా మన విదేశాంగమంత్రి జయశంకర్ కూడా వివాధస్పధ నిర్ణయాలు తీసుకొంటున్నారు.మన అలీనం అనబడే విదేశాంగ విధానం కు మంగళం పాడి చాలా కాలం అయ్యింది.బిజెపి ప్రభుత్వం కు సైద్ధాంతిక పునాది గా ఉన్న ఆర్ యస్ యస్ కు పాలనలో తీవ్రమైన సంస్కరణలు,అభిప్రాయాలు కలిగి ఉన్నప్పటికీ విదేశాంగ విధానంలో అంత స్పష్టత లేదు. దేశీయంగా తమదైన ముద్ర వేసుకుంటున్న బిజెపి ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ రాజకీయాల్లో వైఫల్యం చెందడానికి అదే ప్రధాన కారణం.నెహ్రూ అన్నా,ఆయన పంచశీల సూత్రాలన్నా గిట్టవు.పట్టవు.కానీ,దానికి ప్రత్యామ్నాయం వారి దగ్గర లేదు.అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు వంగి ఉన్నట్లు కనిపించడం, మరోవైపు ఇరుగు పొరుగు దేశాలతో సఖ్యత ఏ మాత్రం లేకపోవడం .రష్యా,చైనాతో కూడా సఖ్యతగా మెలగలేకపోవడం , అమెరికా వేసే టారీపులటుంచితే, ముగ్గురు భారతీయ నావికులు మధ్యప్రాచ్యంలో అమెరికా చంపేసినా చలనం లేని పరిస్థితి అంతర్జాతీయ రాజకీయ వైఫల్యం ను సూచిస్తుంది.
     ఇక సుదీర్ఘ కాలం ఆర్థిక మంత్రిగా కొనసాగుతున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యవహారం పని విధానం అంత బాగాలేదు.ధరలు, ద్రవ్యోల్బణం పెరుగుతుండగా, మరోవైపు రూపాయి విలువ రోజురోజుకు కుదించుకు  పోతుంది.ప్రభుత్వరంగ సంస్థలన్నీ ఒకరిద్దరు వ్యాపారులకు దారాదత్తం చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
కాస్తోకూస్తో పనిమంతుడు అనుకున్న నితిన్ గట్కారీ శాఖ భిన్నంగా లేదు.నిర్మాణ రంగం విషయానికి వస్తే మోదీ  పన్నెండు సంవత్సరాల కాలం లోనే నిర్మించిన బ్రిడ్జిలు,రోడ్లు,చివరకు డ్యామ్ లు పేకమేడల్లా కుప్పకూలడం చూశాం.ఇక హోంశాఖ మంత్రి అమిత్ షా పనితీరు చూస్తే వ్యవస్థలను ఎలా వాడుకోవాలనే చాణక్యం తప్ప మరో ఆలోచన లేదు.ఇప్పటికే స్వతంత్ర వ్యవస్థలైన ఐటి,సిబిఐ,ఇడి, ఎన్నికల కమిషన్,చివరకు న్యాయవ్యవస్థ పైన సైతం కేంద్రం కనుసన్నల్లో నడుచుకొని ప్రత్యర్థులను బలహీన పరచడం లో వాడుకొంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.నోరువిప్పి మాట్లాడగలిగే మేధావులను అర్భన్ నక్సల్స్ పేరుతోనో,బీమాకోరేగాం కేసుపేరుతోనో,ఉపా చట్టం పేరుతోనో విచారణ ఖైదీలుగా ఏళ్ళతరబడి జైళ్ళలో మగ్గుతున్నారు.ఒకరకంగా భారత ప్రజాస్వామ్య వ్యవస్థ, ఫెడరల్ వ్యవస్థ స్వరూపం ఆర్ ఎస్ ఎస్  భావజాలం కనుగుణంగా మార్చడం వలన ప్రధాని మోదీ  పరిపాలన సైతం ప్రజాస్వామ్య రహితమైన అర్థపాసిస్టు పాలనగా మారిందనే బావన కొందరిలో లేకపోలేదు.    ఇన్నేండ్ల మోదీ  పరిపాలన లో సర్దార్ పటేల్ విగ్రహం ఏర్పాటు,అయోధ్యలో రామాలయ నిర్మాణం తప్ప ఆయనదంటూ చెప్పుకోవడానికి పరిపాలనా ముద్ర ఏమీ లేదు.చేసిన మార్పులు, చేర్పులు,వాగ్దానాలన్నీ ఉత్త డొల్లలని నిరూపితం అయ్యింది.పాలకపక్షం వైఫల్యాలు నిలదీయడంలో , ఉద్యమాలు నిర్మించడంలో ప్రతిపక్షాలు కూడా దారుణంగా వైఫల్యం చెందాయి.అధికారయావతప్ప విధానపరమైన ఐక్యతకు ప్రతిపక్షాలు రాలేక పోతున్నాయి.బీజేపీ బలం కంటే ప్రతిపక్షాల అనైక్యత ఆపార్టీ అధికారం లో ఉండేలా చేస్తుంది.నెడితే పడిపోయో గోడను కూడా నెట్టే శక్తి కూడా ప్రతిపక్షల్లోలేదు.ఇట్లాంటి స్థితి లో ప్రజల జీవనం రోజు రోజుకు దుర్భరం అవుతుంది.హక్కులు మృగ్యం అవుతున్నాయి ..
    దేశంలో, రాష్ట్రల్లో ప్రజలకు చేరువ కావాల్సిన విద్యా, వైద్యం అమ్మకం సరుకైంది.ప్రభుత్వరంగం రోజురోజుకు కుంచించుకు పోవడం వలన ఉద్యోగ కల్పన,ఉపాధి అవకాశాలు కుదేలు అవుతున్నాయి.నిరుద్యోగుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతుంది.ఈ స్థితిలో చేసేది ఏమీ లేక ఇంటికే పరిమితం అయిన యువత పనీపాటాలేని “బొద్దింకలు”కాక మరేమవుతారు.ఇలాంటి సమయం లోనే భారత చీప్ జస్టీస్ ఒక కేసు విచారణ సందర్భంగా సమాచార హక్కు కార్యకర్తలు,యువతను దృష్టిలో పెట్టుకొని చేసిన “కాక్రోచ్ “వ్యాఖ్యానం యువతలో కదలిక తెచ్చింది.మిస్ పైర్ అవుతుందని ప్రభుత్వం కూడా ఊహించలేదు.మహారాష్ట్రకు చెందిన అభిజిత్ దీప్కే అనే విద్యార్థి సరదాగా సోషల్ మీడియా లో,సెటైర్ గా సృష్టించిన “కాక్రోచ్ జనతాపార్టీ “. ఇప్పుడు యువత తిరుగుబాటు కు సంకేతంగా మారింది.
    ప్రక్క దేశాలైన నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ లాంటి చోట్ల వచ్చిన జెన్ జెడ్ తిరుగుబాటు ప్రభావం భారతీయ యువత పై ఉంది.ఇదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం లో పేరుకుపోయిన అవినీతి మూలంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ప్రవేశ పరీక్ష పేపర్లు పదేపదే లీక్ కావడం, పరీక్షలు రద్దు కావడం.కొందరు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడంతో విద్యార్థుల్లో అసహనం పెరిగింది.ఉద్యోగ అవకాశాలు లేని నిరుద్యోగ యువత అగ్నికి ఆజ్యం లా ఇప్పుడు తోడైంది.కాక్రోచ్ జనతా పార్టీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలి అనే ఏకైక నినాదంతో భౌతిక ఉద్యమానికి సైతం సన్నద్ధం అయ్యారు.ఇప్పటికే దేశ రాజధాని దిల్లీ తో పాటు దేశంలోని ప్రదాన నగరాలన్నింట కాక్రోచ్ పార్టీ నిరసన రూపం తీసుకుంది.భావజాలపరమైన సోషల్ మీడియా ఐక్యత నుండి ,భౌతిక పరమైన ఉద్యమం నిర్మాణం వైపు జెన్ జెడ్ యువత ఉద్యమం మార్పు చెందింది. కేంద్రంలో అధికారంలో ఉండి వైఫల్యం చెందిన బీజేపీ,ప్రధాన ప్రతిపక్షం గా రాణించ లేకపోతున్న కాంగ్రెస్ ను విభేదించే రాజకీయ శక్తులు కాక్రోచ్ ఉద్యమం వైపు చూస్తున్నారు.
     ప్రజలు కూడా రాజకీయ నాయకుల అవినీతిని చూస్తూ భరించడం తప్ప బెదిరించే శక్తులకు ఎదురు నిలబడ లేని స్తబ్థత లో కూరుకుపోయారు.అక్రమాలు,అన్యాయాలు కళ్ళముందు కనపడుతున్నా నిస్సహాయంగా మారిన యువత ఇన్నాళ్ళు దిక్కు మోక్కులేక మౌనంగా ఉన్నారు.అట్లాంటి వారి కదలికకు ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ వేదికగా మారింది.వాంగ్ చుంగ్ లాంటి పర్యావరణ వేత్తల మద్దతు లభించింది.విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా డిమాండ్ నూటికి నూరు శాతం ఆమోదయోగ్యం అయ్యింది.ఒకవేళ ఆ డిమాండ్ సాధించలేకపోతే భవిష్యత్తు పరీక్షలు,ఉద్యోగాలు కల్పన అపహాస్యం అవుతుంది.ప్రధాని నరేంద్ర మోదీ  ఈ విషయం లో తనదైన నిర్ణయం తీసుకొనక పోతే,అది లొంగుబాటు అని భావించినా,మోండిపట్టుదలకుపోయినా కేంద్ర క్యాబినెట్ పై ప్రజల విశ్వాసం సన్నగిల్లే అవకాశం ఉంది.నగ్నంగా బయటపడిన కేంద్ర విద్యా శాఖ వైఫల్యం పైన చర్యలు తీసుకోవాల్సిన అనివార్య పరిస్థితికి ప్రధాని నెట్టబడ్డాడు.
     ఒక వేళ కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా కోరినా,లేక తొలగించినా కొంతలో కొంత జెన్ జెడ్ యువత ఉద్యమం నిమ్మళించే  అవకాశం ఉంది.ఇంకా మేము చేసేది నూటికి నూరు పాళ్ళు కరెక్ట్ అనే పద్దతిలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తే గనుక ఈ యువత కాక్రోచ్ ఉద్యమం కాస్తా రాజకీయ మలుపు తీసుకొని బలపడే అవకాశం లేకపోలేదు.1977లో ఇందిరాగాంధీ ఎమర్జేన్సీ చీకటి రోజులను వ్యతిరేకంగా జనతాపార్టీ పుట్టి ప్రతిపక్ష రాజకీయ ఐక్యత ఎలా జరిగిందో,అదే తరహా ప్రయోగం మళ్ళీ”కాక్రోచ్”జనతా పార్టీ గా మరోమారు దేశ రాజకీయ ముఖచిత్రం పై కనపడే అవకాశం ఉంది.
     ఇక తెలంగాణా లో కూడా విజయ్ మాలంగి లాంటి చురుకైన విద్యార్థి ఉద్యమ నాయకులు చేసిన ప్రయత్నం సఫలం అయినట్లే! కాక్రోచ్ జనతా పార్టీ సభలో ప్రొ.నాగేశ్వర్,మాజీ ఐఏయస్ ఆకునూరి మురళి లాంటి వారు మద్దతుగా సందేశం ఇవ్వడం లో తప్పులేదు.కాకుంటే కాస్తా వరవడి తగ్గించి మాట్లాడి ఉంటే బాగుండేది. ఇన్నాళ్ళకు దేశవ్యాప్తంగా సార్వత్రిక, సార్వజనీన నిరసన తెలపడానికి “కాక్రోచ్ జనతాపార్టీ”వేదిక లభించడం యువత,విద్యార్థుల ఆసక్తిని వ్యక్తం చేయడానికి సదావకాశమే  కాదు.రాజకీయాల్లో పేరుకుపోయిన అవినీతి, ఆశ్రిత పక్షపాతం,అబద్ధాలు,అన్యాయాలను తుడిచి పారేసే పారదర్శకమైన మరో తరం,యువత రాజకీయాల్లోకి రావడానికి “కాక్రోచ్ జనతాపార్టీ”వేదిక కావాలని కోరుకుందాం.రేపు జరగబోయే పరిణామాలు ఎలా ఉన్నా జెన్ జెడ్ యువత కదలికకు పునాదులు మాత్రం పడ్డాయని నూటికి నూరు శాతం చెప్పవచ్చును.దేశ రాజకీయ ముఖచిత్రం పై వినూత్న రాజకీయ మార్పులు ఆశించే ప్రజలకు ఇదో మంచి పరిణామం.మూలమలుపు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *