కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా గుర్తించిన అత్యంత ప్రమాదకరమైన జిల్లాల జాబితా ఆధారంగా, ఉత్తర తెలంగాణకు చెందిన ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఈ ఎండాకాలం ఉష్ణోగ్రతలు 44° నుండి 45° సెల్సియస్‌కి పైగా నమోదయ్యాయి. వీటికి ఎల్ నినో ప్రభావం తోడుకావడం ఈ జిల్లాల్లో వర్షాలు బాగా తగ్గి, వడగాల్పుల తీవ్రత మరింత పెరిగే ప్రమాదముంది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల పరిధిలోని మహబూబ్‌నగర్, నారాయణపేట్, వనపర్తి, నాగర్‌కర్నూల్, జోగులాంబ గద్వాల్ ప్రాంతాలు, ఉమ్మడి నల్గొండ జిల్లాల పరిధిలోని నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి ప్రాంతాల్లో సాధారణంగా నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తుంటాయి. ఎల్ నినో కారణంగా ఈ ఉమ్మడి జిల్లాల పరిధిలో ఈసారి వర్షపాతం గణనీయంగా పడిపోయే ప్రమాదం నెలకొంది. ఇక్కడ భూగర్భ జలాలు ఎండిపోయి, సాగు మరియు తాగునీటి ఎద్దడి ఏర్పడే అవకాశాలున్నాయి కనుక, ప్రభుత్వ యంత్రాంగం తగిన చర్యలు చేపట్టాలి.
వర్షాలు సకాలంలో పడకపోవడం వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను వరికి బదులు తక్కువ నీటితో పండే పత్తి, పప్పు ధాన్యాల వైపు మళ్లాలని సూచిస్తున్నాయి. వర్షం కురిసినా స్థిరంగా ఉండదు. కొన్ని రోజులు అకస్మాత్తుగా తీవ్రమైన పిడుగులతో కూడిన భారీ వర్షం పడి, ఆ తర్వాత కొన్ని వారాల పాటు అసలు వర్షమే లేని తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడుతుంటాయి. కృష్ణా, గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో వర్షాలు తగ్గడం వల్ల ప్రాజెక్టుల్లోకి నీటి రాక తగ్గిపోనుంది. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించి, కరువు ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేశారు. అయితే వీటిని అమలు చేయడంలో వివిధ శాఖల అధికార్ల సమన్వయం చాలా ముఖ్యం. అయితే మధ్య తెలంగాణకు చెందిన హైదరాబాద్ మరియు చుట్టుపక్కల ప్రాంతాలపై దీని ప్రభావం కాస్త సాధారణంగా ఉండే అవకాశం ఉందన్న సమాచారం కొద్దిగా ఊరట కలిగిస్తోంది.
ఎల్ నినో ప్రభావం కేవలం గ్రామాలు లేదా వ్యవసాయ రంగానికే పరిమితం కాదు. హైదరాబాద్, వరంగల్ వంటి పెద్ద నగరాలలో నివసించే పట్టణ ప్రజల జీవనంపై కూడా ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది.హైదరాబాద్‌కు మధ్య తెలంగాణ భౌగోళిక అనుకూలత వల్ల వర్షాలు మరీ ఘోరంగా పడిపోకపోయినా, కొన్ని తీవ్రమైన సమస్యలు ఎదురవుతాయి. నగరానికి తాగునీరు అందించే కృష్ణా, గోదావరి ప్రాజెక్టుల (నాగార్జున సాగర్, ఎల్లంపల్లి, సింగూరు) పరివాహక ప్రాంతాల్లో వర్షాలు తగ్గడం వల్ల జలశయాలలో నీటి మట్టాలు పడిపోతాయి. దీనివల్ల నీటి సరఫరాలో కోతలు, వాటర్ ట్యాంకర్లపై ఆధారపడటం పెరుగుతుంది. గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్లలో బోర్‌వెల్స్ ఎండిపోవడం వల్ల నివాసితులకు అదనపు ఖర్చులు పెరుగుతాయి.
ఎల్ నినో వల్ల పంటలు దెబ్బతింటే, వ్యాపార లావాదేవీలు తగ్గి నగర ఆర్థిక వ్యవస్థ మందగిస్తుంది. ఇక విద్యా సాంస్కృతిక కేంద్రమైన వరంగల్ చుట్టూ ఉన్న చారిత్రక భద్రకాళి, ధర్మసాగర్ వంటి తాగునీటి సరస్సులు, చెరువులలో నీరు వేగంగా ఆవిరైపోతుంది. దీనివల్ల మున్సిపల్ నీటి సరఫరాపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ నేపథ్యంలో పాలనా యంత్రాంగం ప్రాంతాలవారీగా, నగరాల వారీగా ఎక్కడి పరిస్థితులకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోక తప్పదు.





