
రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు
సెల్ నెంబర్:
9949937745
ప్రభుత్వ పాలనలో ఉద్యోగులు భాగం. ప్రభుత్వ పాలన సక్రమ నిర్వహణకు ఉద్యోగుల కృషి ఎంతగానో దోహదపడుతుంది. ప్రభుత్వ పథకాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, విద్యా, వైద్యం కానీ, రాష్ట్రంలోని వివిధ శాఖలకు చెందిన పథకాలు ప్రజలకు సక్రమంగా అందాలంటే ఉద్యోగులు నిజాయితీగా, మంచిగా పనిచేయాల్సి ఉంటుంది. ఉద్యోగులు సక్రమంగా పనిచేసినప్పుడు మాత్రమే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. తదనుగుణంగా ఉద్యోగులకు సకాలంలో చెల్లించాల్సినటువంటి జీతభత్యాలు కానీ, ఉద్యోగుల జీవన ప్రమాణాలకు అనుగుణంగా, సామాజిక జీవన విధానాలకు అనుగుణంగా, ద్రవ్యోల్బణం కారణంగా నిత్యావసరాల ధరల పెరుగుదల సూచీకనుగుణంగా ఉద్యోగులకు ప్రభుత్వం ప్రతి ఆరు నెలలకు ఒక డి. ఎ. కరువు భత్యం చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి పే రివిజన్ కమిషన్ (పి.ఆర్.సి.) ఏర్పాటుచేసి సిఫార్సు లను అమలు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం తెలంగాణలో పి. శివశంకర్ చైర్మన్‌గా రెండవ పే రివిజన్ కమిషన్ ను 2 అక్టోబర్ 2023న ఏర్పాటైంది . తెలంగాణ రాష్ట్రంలో 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇచ్చిన రెండు ముఖ్యమైన హామీలను ముఖ్యమంత్రి ఒక్కసారి పరిశీలించాలి.
1. ప్రభుత్వ ఉద్యోగులందరికీ 2023 లో పెండింగ్ లో ఉన్న మూడు డి. ఏ.లను తక్షణం చెల్లిస్తాం.
2. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయిన వెంటనే కొత్త పీఆర్సి ని ప్రకటించి, ఆరు నెలల లోపు సిఫారసులను అమలు చేస్తాం. ఈ రెండూ మీరు ఎన్నికల సందర్భంగా ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇచ్చిన హామీలు. మీరిచ్చిన హామీల పట్ల విశ్వాసంతో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేది కాంగ్రెస్ ప్రభుత్వం అని ప్రజలు, ఉద్యోగ, ఉపాధ్యాయులు,పెన్షనర్లు, నిరుద్యోగులు మీ పార్టీకి సానుకూలంగా ఉండడం వల్లనే మీరు అధికారంలోకి రాగలిగారు. మీరు అధికారంలోకి వచ్చి 32 నెలలు అవుతున్నది. మిమ్ములను కొత్తగా మేము కోరికలు కోరడం లేదు. మీరు ఇచ్చిన హామీలను మరియు మాకు న్యాయంగా రావలసిన వాటిని ఇవ్వాలని కోరుతున్నాం.
2023 పిఆర్సి గడువు కూడా అయిపోయి మూడు సంవత్సరాలు కావస్తున్నది. టీజీఇజెఎసి గత సంవత్సరం మే 5వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో నిరాహార దీక్షలు చేపట్టే ఉద్యమాన్నిప్రకటించగా ఆ ఉద్యమం తీవ్రతరం కాకుండా మీరు ఈ సంవత్సరం మే రెండవ తేదీన టిజిఇజేఏసి కి ఇచ్చిన హామీలు కూడా అమలు పరచలేకపోయారు. ఇప్పటికీ శివ శంకర్ గారు చైర్మన్గా ఉన్న పి.ఆర్.సి. రిపోర్టు సబ్మిట్ చేయలేదు, దాన్ని అమలు పరిచే దిశగా ఏమాత్రం మీరు చొరవ చూపడం లేదు. టిజిఇజేఏసీ రాష్ట్ర నాయకులు స్వార్థంతో మీకు అండగా ఉండడం వల్లనే మీరు ఇచ్చిన హామీలు నెరవేరుస్తలేరు అనేది నగ్న సత్యం. టీజీఇజెఎసి రాష్ట్ర నాయకులు తమ స్వార్థం కొరకు, వ్యక్తిగత పనులు చేయించుకోవడం కొరకు లక్షలాది మంది ఉద్యోగ, పెన్షనర్లను మోసం చేయడం సమర్థవంత మైన నాయకత్వం అనిపించుకోదు.
ఎనిమిదినె నెలలుగా పెన్షనర్ల జెఎసి, మరియు బాధిత పెన్షనర్ల సంఘాలు ఉద్యమాలు చేస్తున్న కారణంగా పెన్షనర్లకు బకాయిలు దాదాపుగా 10000 కోట్లు ఉన్నప్పటికీ వంద రోజులలో ఆరు వేల కోట్లు విడుదల చేస్తామని, పి.ఆర్.సి.రిపోర్టు త్వరగా తెప్పించి అమలుపరుస్తామని నాయకులను శాంతపరిచారు. జూన్ 2వ తేదీ నుండి ఈ.హెచ్.ఎస్. నగదు రహిత వైద్యము ఉద్యోగుల 1.5% కాంట్రిబ్యూషన్ తో అమలు చేస్తామని చెప్పి, మూడు నెలలు కాలయాపన చేసి జూలై 17న లాంచనంగా నగదు రహిత వైద్యం అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో చెల్లుబాటు అయ్యే విధంగా ప్రారంభించారు. కానీ 15 రోజులు గడచినా కార్డులు విడుదల కావడం లేదు. నగదురహిత వైద్యం అందించడం లేదు. చాలామంది ఉద్యోగ, పెన్షనర్లు ఆరోగ్య సమస్యలతో లక్షలాది రూపాయలు ఆసుపత్రులల్లో చెల్లించలేక బాధపడుతున్నారు.
కానీ సామాన్య ప్రజలకు ఉచితంగా వైద్యం అందించే ఆరోగ్య శ్రీ పథకంలో పది లక్షల వరకు పరిమితి పెట్టారు. కానీ 1.5 శాతం కాంట్రిబ్యూషన్ చేసే ఉద్యోగులకు, పెన్షనర్ల వైద్యానికి మాత్రం 2 లక్షలకు పరిమితి విధించారు. తర్వాత 5 లక్షలకు పరిమితి పెంచుతామని, ఐదు లక్షల దాటినట్లయితే ఈ.హెచ్.సి.టి. ఆమోదంతో పెంచుతామనడం అనడం ఎంతవరకు సమంజసం? ఇది న్యాయమేనా? ట్రస్టు బోర్డు సభ్యులు మరియు ప్రభుత్వం ఆలోచించాల్సిందిగా కోరుతున్నాం. సిపిఎస్ రద్దు చేసి ఓ.పి.ఎస్. అమలు చేస్తామన్నారు అది అమలు పర్చలేదు. మీరు ఇచ్చిన హామీలు ఈ విధంగా ఉన్నప్పటికీ ఏవి కూడా అమలు చేయలేకపోయారు.
మార్చి 2024 నుండి ఇప్పటివరకు రిటైర్డ్ అయిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన బకాయిలన్నింటిని వంద రోజులలో 6000 కోట్లు చెల్లించామని ప్రకటించుకున్నారు. కానీ ఇప్పటివరకు పూర్తి స్థాయిలో ఏ ఒక్కరికి చెల్లింపులు జరగలేదు. కమ్యుటేషన్, జిపిఎఫ్ 100 శాతం చెల్లించామని పేపర్లలో ప్రకటించారు. కానీ అది అవాస్తవం. ఏప్రిల్ 2026 వరకు జిపిఎఫ్ సబ్మిట్ చేసిన వారికి కొంతమందికి మరియు కమ్యుటేషన్ కూడా కొంత మందికి రాలేదు. వారి టోకెన్ నెంబర్లు పరిశీలించి రాని వారికి చెల్లించగలరు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మీరు ఇచ్చిన హామీలను హామీల వరకే పరిమితం కాకుండా వాటిని అమలుపరిచే దిశగా అడుగులు వేసి లక్షలాది మంది ఉద్యోగ, ఉపాధ్యాయుల, పెన్షనర్ల విశ్వాసాన్ని చూరగొనాలి. అదేవిధంగా టీజీఇ జెఎసి రాష్ట్ర నాయకులు, పెన్షనర్ సంఘాల రాష్ట్ర నాయకులు ఉద్యోగులకు, పెన్షనర్లకు న్యాయంగా రావలసిన పి.ఆర్.సి. మరియు ఆరు డి.ఎ.ల విషయంలో ఉద్యమ కార్యాచరణ తక్షణమే రూపొందించి, తక్షణమే పిఆర్సి రిపోర్టు సబ్మిట్ చేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, పి.ఆర్.సి. 50% ఫిట్మెంట్తో వెంటనే అమలుపరిచి, ఆరు డీ.ఏ.లను విడుదల చేయాలని అందుకు టీజీఇజెఏసి రాష్ట్ర నాయకులు స్వార్ధాన్ని వీడి ఉద్యోగుల, ఉపాధ్యాయుల, పెన్షనర్ల పక్షాన ఉండాలని లక్షలాదిమంది ఎదురుచూస్తున్నారు.





