బీఆర్‌ఎస్ నిలదీస్తే గానీ సోయి రాదా

– ఏపీ ప్రభుత్వ అజెండాపై ఎందుకు నోరు మెదపలేదు?
– బీఆబీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 12 : తెలంగాణ ప్రాజెక్టులపై సమీక్షించాలని ఏపీ ప్రభుత్వం జీఆర్ఎంబీ సమావేశంలో ప్రస్తావించనుండడంపై బీఆరఎస్ ప్రశ్నించిన తర్వాత హడావుడిగా లేఖలు రాయడం తప్ప రాష్ట్ర ప్రయోజనాల పట్ల మీకు చిత్తశుద్ధి లేదా అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని అసెంబ్లీలో బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్‌రావు నిలదీశారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు మీ నామమాత్రపు లేఖలు రాష్ట్ర ప్రాజెక్టులను కాపాడతాయా అని ఒక ప్రకటనలో ప్రశ్నించారు. లేఖలతో పనులు కావు.. తెలంగాణ నీటి ప్రయోజనాల కోసం రాజీ లేని పోరాటం చేయాలి అని హితవు పలికారు. ఏపీ ప్రభుత్వం జీఆర్‌ఎంబీ అజెండాలో పెట్టిన అంశాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వాటిని అజెండా నుంచి తొలగించే వరకు తెలంగాణ ప్రభుత్వం పట్టుబట్టాలని, ఆ అంశాలను వెనక్కి తీసుకోకపోతే అవసరమైతే జీఆరఎంబీ సమావేశానికి హాజరు కాబోమని కరాఖండిగా తేల్చి చెప్పాలి అని అన్నారు. అలాకాకుండా మీ రాజకీయ అవసరాల కోసం సమావేశానికి వెళ్లి అక్కడ తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ పెట్టిన అభ్యంతరాలకు బలం చేకూర్చేలా వ్యవహరిస్తే మాత్రం బీఆర్‌ఎస్ చూస్తూ ఊరుకోదు అని హరీష్‌రావు హెచ్చరించారు. రేవంత్ రెడ్డీ.. ఇది రాజకీయాలకు సంబంధించిన విషయం కాదు.. తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించిన విషయం.. తెలంగాణ నీటి హక్కులకు సంబంధించిన విషయం అని చెప్పారు. ప్రతిపక్షాలపై పిచ్చి ప్రేలాపనలు చేసే రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రాజెక్టులపై ఏపీ అభ్యంతరాలు చెబితే ఎందుకు నోరు మెదపడం లేదన్నారు. ఈ నెల 18న హైదరాబాద్‌లో జరిగే జీఆర్‌ఎంబీ సమావేశం అజెండాను ఉపసంహరించుకోకుండా నిర్వహిస్తే తెలంగాణ ప్రాజెక్టులను కాపాడుకునేందుకు బీఆరఎస్ పార్టీ వేలాదిమందితో జీఆరఎంబీ కార్యాలయాన్ని ముట్టడిస్తుందని హెచ్చరించారు. కేంద్రం చేతిలోని జీఆర్‌ఎంబీ, చంద్రబాబు, రేవంత్ కలిసి తెలంగాణకు చేస్తున్న జల ద్రోహాన్ని అడ్డుకుంటామన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *