11.56 లక్షల ఇళ్లు కేటాయించండి

– కేంద్ర మంత్రి చౌహాన్‌కు మంత్రి పొంగులేటి వినతి
– తెలంగాణలో పర్యటించాల్సిందిగా ఆహ్వానం
– సానుకూలంగా స్పందించిన శివరాజ్ సింగ్

న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఆగస్టు 12 : ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ (పీఎంఏవై- జి 2.0) కింద రాష్ట్రానికి సమగ్ర ప్రాతిపదికన ఒకేసారి 11,56,915 ఇళ్లను కేటాయించాలని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దిల్లీలో కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను పొంగులేటి బుధవారం కలిసి ఈమేరకు వినతిపత్రాన్ని అందజేశారు. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాసిన లేఖను ఈ సందర్భంగా గుర్తు చేసిన ఆయన రాష్ట్రంలో ఇళ్ల కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఏడాది క్రితమే సర్వే పూర్తి.. మంజూరులోనే జాప్యం

రాష్ట్రవ్యాప్తంగా ‘ఆవాస్ ప్లస్-2024’ యాప్ ద్వారా అత్యంత పారదర్శకంగా ఇంటింటి సర్వే నిర్వహించామని మంత్రి పొంగులేటి వివరించారు. ఈ సర్వేలో 11.56 లక్షలకుపైగా గ్రామీణ పేద కుటుంబాలు ఇళ్లకు అర్హులుగా తేలాయని తెలిపారు. వీటికి సంబంధించి సూపర్ చెక్, అనర్హుల తొలగింపు ప్రక్రియలన్నీ ఏడాది క్రితమే పూర్తయినప్పటికీ కేంద్రం నుంచి లక్ష్యాల ప్రకటనలో జాప్యం జరుగుతోందన్నారు. తెలంగాణలో పన్నెండేళ్లుగా పేదలకు ఇళ్ల నిర్మాణం నిలిచిపోయి తీవ్రమైన డిమాండ్ పేరుకుపోయినందున ఒకేసారి ఈ ఇళ్లన్నింటినీ మంజూరు చేయాలని కోరారు.

ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం

పీఎంఏవై-జి కింద ఇచ్చే కేంద్ర వాటా, సాధారణ రాష్ట్ర వాటాతో సంబంధం లేకుండా ప్రతి పేద కుటుంబం ఇల్లు నిర్మించుకునేందుకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని పొంగులేటి వెల్లడించారు. ఇందుకు అవసరమైన నిధులను ఇప్పటికే రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయించినట్లు స్పష్టం చేశారు.

తెలంగాణ పర్యటనకు రావలసిందిగా ఆహ్వానం

శివరాజ్ సింగ్ చౌహాన్‌ను తెలంగాణలో పర్యటించాల్సిందిగా పొంగులేటి ఆహ్వానించారు. రాష్ట్రానికి వచ్చి పీఎంఏవై-జి 2.0 కింద ఇళ్ల కేటాయింపును స్వయంగా ప్రకటిస్తే గ్రామీణ పేదలకు కొండంత అండగా నిలుస్తుందని, అది చరిత్రాత్మక ఘట్టంగా మారుతుందని అన్నారు. మంత్రి పొంగులేటి విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందిస్తూ రాష్ట్రంలో పర్యటించేందుకు అంగీకరించారు. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో ఎంపీలు మల్లు రవి, వేం నరేందర్ రెడ్డి, చామల కిరణ్‌కుమార్ రెడ్డి, సురేష్ షెట్కార్, రామసహాయం రఘురాం రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్‌తోపాటు తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వి,పి.గౌతమ్ తదితరులు ఉన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *