– శామీర్‌పేట్, సోమశిలలో కొత్త గోల్ఫ్ కోర్సుల ఏర్పాటు
– పీపీపీ విధానంలో ప్రపంచస్థాయి వసతుల అభివృద్ధి
– 1 నుంచి తెలంగాణ గోల్కొండ మాస్టర్స్ టోర్నీ
– ప్రచారకర్తగా దిగ్గజ క్రికెటర్ కపిల్‌దేవ్ సేవలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 29 : తెలంగాణను అంతర్జాతీయ స్థాయి గోల్ఫ్ టూరిజం కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. గోల్కొండ గోల్ఫ్ క్లబ్‌లో ‘తెలంగాణ గోల్కొండ మాస్టర్స్’ 12వ ఎడిషన్ పోస్టర్‌ను శనివారం ఆవిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు శామీర్‌పేట సమీపంలోని జవహర్‌నగర్‌లో 130 ఎకరాల్లో ఒక గోల్ఫ్ కోర్సును, కృష్ణానది తీరంలోని సోమశిల (అమ్రాబాద్ టైగర్ రిజర్వ్) ప్రాంతంలో మరొక ప్రపంచస్థాయి గోల్ఫ్ కోర్సును పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) విధానంలో నిర్మించనున్నట్లు మంత్రి ప్రకటించారు. రాష్ట్ర పర్యాటక, క్రీడల ప్రచారం కోసం భారత క్రికెట్ దిగ్గజం కపిల్‌దేవ్ సేవలను ఉపయోగించుకోనున్నట్లు వెల్లడించారు. డీపీ వరల్డ్ ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా (డీపీ వరల్డ్ పీజీటీఐ), హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ టోర్నీకి ఈవెంట్ పార్ట్‌నర్‌గా తెలంగాణ టూరిజం వ్యవహరిస్తోంది. గోల్కొండ కోట సమీపంలోని గోల్ఫ్ కోర్సులో ఈ టోర్నీ నిర్వహించడం రాష్ట్ర చరిత్ర, వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం దక్కిందన్నారు. హైదరాబాద్ నగరానికే తెలంగాణ పర్యాటకం పరిమితం కాదని.. రాష్ట్రంలోని సరస్సులు, అడవులు, గోదావరి, కృష్ణా నదులు, రాజభవనాలు, కోటలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయని చెప్పారు.
సెప్టెంబరు 1 నుంచి టోర్నీ – రూ.కోటి ప్రైజ్‌మనీ
డీపీ వరల్డ్ పీజీటీఐ, హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ సంయుక్తంగా తెలంగాణ టూరిజం సహకారంతో ఈ టోర్నీని నిర్వహిస్తున్నాయి. సెప్టెంబరు 1 నుండి 4వ తేదీ వరకు నిర్వహిస్తారు. దేశవిదేశాల నుంచి 132 మంది ప్రముఖ గోల్ఫర్లు పాల్గొంటారు ప్రైజ్‌మనీ రూ. కోటి ఉంటుంది.
డీపీ వరల్డ్ పీజీటీఐ అధ్యక్షుడు కపిల్‌దేవ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ సహకారం అభినందనీయమని, ఈ పోటీల ద్వారా హైదరాబాద్ గోల్ఫ్ టూరిజంలో ప్రత్యేక గుర్తింపు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ కెప్టెన్ జస్విందర్ సింగ్ బిర్గి మాట్లాడుతూ 12వ తెలంగాణ గోల్కొండ మాస్టర్స్‌కు ఆతిథ్యమివ్వడం ఆనందంగా ఉందన్నారు. ప్రముఖ గోల్ఫర్ల ఆటను హెచ్‌జీఏ సభ్యులు వీక్షించే అవకాశం లభిస్తుందని తెలిపారు. లైవ్ టెలికాస్ట్ ద్వారా హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్ ప్రపంచ ప్రేక్షకులకు పరిచయం అవుతుందన్నారు. కార్యక్రమంలో డీపీ వరల్డ్ పీజీటీఐ సీఈఓ అమన్‌దీప్ జోల్, చెక్ రిపబ్లిక్‌కు చెందిన అంతర్జాతీయ గోల్ఫర్ స్టెపాన్ డానెక్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




