– లెక్కకు మిక్కిలిగా జయరాజ్ ఆస్తులు
– రిమాండుకు ఆదేశించిన ఏసీబీ కోర్టు
– వరంగల్ జైలుకు తరలింపు
వరంగల్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 28: గనుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జయరాజ్ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ నిర్ధారణకు రావడంతో ఆయనను అరెస్ట్ చేశారు. అనంతరం వరంగల్‌లోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఏసీబీ అధికారులు జయరాజ్ను వరంగల్ జైలుకు తరలించారు. ప్రస్తుతం వరంగల్ జిల్లా గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ గా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న జయరాజ్ పై అవినీతి ఆరోపణలు రావడంతో దాడులు చేపట్టినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. హైదరాబాద్, వరంగల్ తోపాటు మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వ హించారు. బోడుప్పల్ లోని జయరాజ్ నివాసంతోపాటు ఆయన స్నేహితులు, బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు చేపట్టారు. సోదాల్లో భారీగా ఆస్తులు, నగదు, బంగారు ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్లు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. ఏసీబీ లెక్కల ప్రకారం జయరాజ్ కి సంబంధించి సుమారు రూ.65 కోట్లకు పైగా విలువైన ఆస్తులను గుర్తించినట్లు సమాచారం. బోడుప్పల్లో రెండంతస్తుల భవనం, తూప్రాన్, తుంగతుర్తి, సూర్యాపేటలో ఒక్కో ప్లాట్, కీసరలో రెండు ఇంటి స్థలాలు, 3.21 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు గుర్తించారు. కేపీహెచ్బీలో విలువైన మరో ప్లాట్ ను కూడా అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. అలాగే సుమారు రూ.20 లక్షల విలువైన ఎల్బీసీ బాండ్లు, రూ.20 లక్షలకు పైగా పోస్టాఫీస్ సేవింగ్స్, మూడు బ్యాంకు ఖాతాల్లో రూ.71 లక్షల నగదు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. వీటితోపాటు సుమారు రూ.40 లక్షల విలువైన మూడు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలు, 629 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక జయరాజ్ తన ఇంటి డ్రైవర్ బ్యాంకు ఖాతా నుంచి తన కుమార్తె ఖాతాలోకి రూ.24 లక్షలు బదిలీ చేయించినట్లు కూడా ఏసీబీ దర్యాప్తులో తేలింది. ఈ లావాదేవీలపై కూడా అధికారులు విచారణ చేపట్టారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





