– ఎన్నికల ప్రధాన అధికారికి ముఖ్యమంత్రి లేఖ
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 29 : తెలంగాణలో 2026 ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ కారణంగా అర్హత ఉన్న ఏ ఒక్క ఓటరు పేరు తొలగిపోకూడదని, అలాగే అనర్హులైన ఓటరు ఎవరూ జాబితాలో చేరకూడదని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ కు ఆయన లేఖ రాశారు. అభ్యంతరాలు, ఫిర్యాదులు సమర్పించే గడువును పొడిగించడంతోపాటు ఓటర్లకు తగిన సమయం, అవసరమైన సహాయం అందించేలా విధానపరమైన భద్రతా చర్యలు తీసుకోవాలని కోరారు. 2026 జూన్ 10 నాటికి రాష్ట్రంలో 3.38 కోట్ల మంది ఓటర్లు ఉండగా వారిలో 73.39 లక్షల మందిని (21.7 శాతం) గైర్హాజరైన, నివాసం మారిన, మరణించిన, ఒకటికి మించి నమోదైన ఓటర్లుగా (ఏఎస్ డీడీ) గుర్తించినట్లు ముఖ్యమంత్రి ఈసీ గణాంకాలను ఉటంకించారు. ఈ వర్గంలో దాదాపు 62 శాతం మంది అంటే 45.19 లక్షల మందిని శాశ్వతంగా నివాసం మారిన వారిగా గుర్తించడం ఆందోళనకర మని పేర్కొన్నారు. మరోవైపు డిజిటలైజ్ చేసిన 2.65 కోట్ల గణన పత్రాల్లో 60.50 లక్షల పత్రాల్లో లోపాలు ఉండగా, 32.36 లక్షల పత్రాలకు గత ఓటర్ల జాబితాతో అనుసంధానించలేదని తెలిపారు. దీంతో సుమారు 92.86 లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఇది రాష్ట్రంలోని దాదాపు మూడో వంతు ఓటర్లను ప్రభావితం చేసే అంశమని ఎన్నికల సంఘానికి వివరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





