మైనారిటీలను ఓటు బ్యాంకుగా చూసింది కాంగ్రెస్సే

– మోదీ సంక్షేమంతోనే నిజమైన సాధికారత
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు 

మహబూబ్‌నగర్, ప్రజాతంత్ర, ఆగ‌స్టు 29 : స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ మైనారిటీలను కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకుంటూ దేశంలో విభజన రాజకీయాలు చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు ధ్వజమెత్తారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో శనివారం నిర్వహించిన బీజేపీ రాష్ట్ర మైనారిటీ మోర్చా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజర‌య్యారు. కార్యక్రమంలో ఎంపీ డి.కె.అరుణతోపాటు పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామచందర్ రావు మాట్లాడుతూ… దేశంలో అత్యధిక మత ఘర్షణలు కాంగ్రెస్ హయాంలోనే జరిగాయని ఆరోపించారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ‘సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్’ నినాదంతో సమన్యాయ పాలన అందిస్తోందన్నారు. కేంద్ర పథకాలు ముద్రా, జన్ ధన్, ఉజ్వల, ఉడాన్ వంటి కేంద్ర సంక్షేమ పథకాల ఫలాల్లో 22 శాతం నుండి 37 శాతం వరకు లబ్ధిదారులు మైనారిటీ వర్గాల వారే ఉన్నారని స్పష్టం చేశారు. విద్యార్థులకు భారీగా స్కాలర్‌షిప్‌లు, సివిల్ సర్వీసెస్ పరీక్షలకు ప్రత్యేక ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. పొరుగు దేశాల్లో మతపరమైన వేధింపులు ఎదుర్కొని వచ్చిన శరణార్థులకు పౌరసత్వం కల్పించే చట్టమే సీఏఏ అని, అయితే కాంగ్రెస్ పార్టీ దీనిపై తప్పుడు ప్రచారం చేస్తూ అంతర్జాతీయంగా దేశ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్ర పన్నిందని మండిపడ్డారు. వందేమాతరం’ ఏ మతానికీ వ్యతిరేకం కాదని, పవిత్రమైన భరతమాతను గౌరవించే జాతీయ గేయమని పేర్కొన్నారు. నిజాం నిరంకుశ పాలనపై హైదరాబాద్ సంస్థాన విముక్తి పోరాటంలో జర్నలిస్ట్ షోయబుల్లా ఖాన్ వంటి దేశ భక్తులు సైతం వందేమాతరం నినదిస్తూ ప్రాణాలర్పించారని గుర్తుచేశారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం జాతీయ గేయాన్ని కించపరచవద్దని హితవు పలికారు. రాష్ట్రంలో కాంగ్రెస్, గత బీఆర్ ఎస్‌ ప్రభుత్వాలు మైనారిటీల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించాయని, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ కార్లు, గన్‌మెన్లకే పరిమితమైందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా మరియు స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాల ద్వారా మైనారిటీ యువతకు వేలాదిగా ఉపాధి అవకాశాలు కల్పిస్తుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ మాత్రం ఓట్ల కోసమే మైనారిటీల పేరును వాడుకుంటోందని స్పష్టం చేశారు. అధికారంలో ఎవరున్నా వారికి వత్తాసు పలికే మజ్లిస్ పార్టీ నాడు బీఆఎస్‌తో, నేడు కాంగ్రెస్‌తో చీకటి ఒప్పందాలు చేసుకుంటూ పాతబస్తీ అభివృద్ధిని అడ్డుకుందని, బీజేపీ పోరాటం వల్లే పాతబస్తీకి మెట్రో మంజూరైందని గుర్తుచేశారు.హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని ఓడించేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కై మజ్లిస్ అభ్యర్థిని గెలిపించాయని ఆయన గుర్తుచేశారు. నేడు అదే మజ్లిస్ ఎమ్మెల్సీ ఒక మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటుంటే బీఆర్ఎస్, కాంగ్రెస్లు ఎందుకు నోరు మెదపడం లేదని రామచందర్ రావు సూటిగా ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోదీకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ , ఈజిప్ట్, బహ్రెయిన్, జోర్డాన్ వంటి ప్రముఖ ఇస్లామిక్ దేశాలు తమ అత్యున్నత పౌర పురస్కారాలు అందించి గౌరవిస్తుంటే విపక్షాలు మాత్రం రాజకీయ లబ్ధి కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నాయని దుయ్యబట్టారు. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని స్పష్టం చేస్తూ మోదీ సంక్షేమ ఫలాలను గ్రామాలు, మండలాల వారీగా ఇంటింటికీ చేరవేసి రానున్న ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని మైనారిటీ మోర్చా శ్రేణులకు పిలుపునిచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *