కాంగ్రెస్ పాలనలో కాల్వల్లో నీళ్లు పార‌ట్లే

– ఉమ్మడి మెదక్ జిల్లాపై సీఎం రేవంత్ పగ
– కేసీఆర్ హయాంలో 85% పూర్తయిన టన్నెల్
– మిగిలిన 300 మీటర్లు తవ్వలేని చేతకాని ప్రభుత్వం
– ఆగిపోయిన నర్సాపూర్ కాళేశ్వరం కాల్వ పనులు ప్రారంభించాలి
– నర్సాపూర్ కాల్వ వద్ద రేవంత్‌కు హరీష్‌రావు సెల్ఫీ ఛాలెంజ్

నర్సాపూర్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 3 : తెలంగాణను సస్యశ్యామలం చేసిన కేసీఆర్ పాలన ఎక్కడ.. కాల్వల్లో నీళ్లు పారక తుమ్మ చెట్లు మొలుస్తున్న కాంగ్రెస్ పాలన ఎక్కడ అని బీఆరఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నిలిచిపోయిన మల్లన్న సాగర్, కాళేశ్వరం కాల్వ పనులను నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డితో కలిసి క్షేత్రస్థాయిలో ఆయన గురువారం పరిశీలించారు. నర్సాపూర్ నియోజకవర్గం రెడ్డిపల్లి వద్ద ఆగిపోయిన కాల్వల్లో మొలిచిన తుమ్మ చెట్ల వద్ద నిలబడి ప్రభుత్వ చేతకానితనాన్ని ఎండగడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. ఉమ్మడి మెదక్ జిల్లా ప్రాజెక్టులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. మల్లన్న సాగర్ నుంచి నర్సాపూర్, ఆందోల్, సంగారెడ్డి నియోజకవర్గాలకు సాగునీరు అందించాలని ప్యాకేజీ 18, 19 కింద కేసీఆర్ అద్భుతమైన ప్రణాళిక చేశారని, ఇక్కడినుంచి చిన్న లిఫ్ట్ ద్వారా సింగూరులో గోదావరి నీళ్లు నింపి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలన్నది ఆయన సంకల్పమని చెప్పారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక పనులన్నీ పడావు పెట్టారని విమర్శించారు. బీఆరఎస్ హయాంలోనే మల్లన్న సాగర్ నుంచి నర్సాపూర్ వచ్చే 18 కి.మీ టన్నెల్ పనుల్లో 85 శాతం పూర్తయ్యాయని, మిగిలిన కేవలం 300 మీటర్ల పని చేస్తే ఈ కెనాల్ ద్వారా నీళ్లు హల్దీ వాగులో పడి నిజాంసాగర్ వరకు గోదావరి జలాలు పరుగులు పెట్టేవని చెప్పారు. అటు నిజామాబాద్, ఇటు మెదక్ జిల్లాల రైతులకు మేలు జరిగేదని, కానీ అలా చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తోందని విమర్శించారు. మొన్న సంగారెడ్డికి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉచిత సలహాలు ఇచ్చారే తప్ప ఆగిపోయిన సాగునీటి ప్రాజెక్టుల ఊసెత్తలేదని మండిపడ్డారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ దుకాణం బంద్ చేయాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు. మెదక్ జిల్లా అంటే మీకు ఎందుకంత చిన్నచూపు.. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్ కింద ఉన్న పిల్ల కాల్వలు తవ్వడానికి కేవలం రూ.50 కోట్లు ఇస్తే చాలు.. 50 వేల ఎకరాలకు నీళ్లు వస్తాయి.. ఆ మాత్రం నిధులు ఇవ్వడానికి కూడా ముఖ్యమంత్రికి మనసు రావడం లేదు అని వ్యాఖ్యానించారు. నారాయణఖేడ్, జహీరాబాద్, ఆందోల్, సంగారెడ్డి, పటాన్ చెరు నియోజకవర్గాల్లో ఐదు లక్షల ఎకరాలకు నీరందించే బసవేశ్వర, సంగమేశ్వర ప్రాజెక్టులను గాలికి వదిలేశారన్నారు. కేసీఆర్ నిధులు మంజూరు చేసిన ఘనపురం ఆనకట్ట ఎత్తు పెంపు పనులను ఆపేశారు.. దుబ్బాకలో 80 శాతం పూర్తయిన లిఫ్ట్ ఇరిగేషన్ పనులు నిలిపివేసి రైతులను గోస పెడుతున్నారు.. ఎల్‌నినో ప్రభావంతో కరవు పరిస్థితులు వస్తాయని చెబుతున్నా మల్లన్న సాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్లను నీళ్లతో నింపుకోవాలన్న కనీస సోయి ఈ ప్రభుత్వానికి లేదు అని అన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎండాకాలంలోనూ హల్దీ, మంజీరా వాగుల మీద పదుల సంఖ్యలో చెక్ డ్యామ్‌లు మత్తడి దుంకాయి.. ఇప్పుడు చుక్క నీరు లేక వెలవెలబోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అందంగా తీర్చిదిద్ది ఇచ్చిన రాష్ట్రాన్ని నడపడం కూడా రేవంత్ రెడ్డికి చేతకావడం లేదని ఎద్దేవా చేశారు. వెయ్యి రోజుల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒక్క గజం కాల్వ కూడా తవ్వలేదని, కనీసం రూపాయి నిధులైనా విడుదల చేయలేదని అన్నారు.

ప్రాజెక్టుల పనులు తక్షణం ప్రారంభించాలి

సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టుల పనులు తక్షణమే ప్రారంభించాలని, ఘనపురం ఆనకట్ట ఎత్తు పెంపు పనులను వెంటనే పూర్తి చేయాలని హరీష్‌రావు డిమాండ్ చేశారు. మల్లన్న సాగర్ నుంచి నర్సాపూర్, ఆందోల్‌కు నీళ్లు తీసుకొచ్చే కాళేశ్వరం కాల్వ పనులు పూర్తి చేయాలి.. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణకు వెంటనే నిధులు విడుదల చేయాలి అని కోరారు. ఆగిపోయిన కాల్వ పనులకు, వాటిలో మొలిచిన తుమ్మ చెట్లకు సజీవ సాక్ష్యంగా ఇక్కడినుంచే సెల్ఫీ తీసి రేవంత్ రెడ్డికి ట్యాగ్ చేస్తున్నానన్నారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి తక్షణమే ఆగిపోయిన టన్నెల్, కాల్వ పనులను, ప్రాజెక్టులను ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *