మెరుపు తీగెలు
“దేవుడి ప్రసాదం తింటే?” చిన్ను అడిగాడు, చదవాల్సిన పుస్తకం ముందు పెట్టుకొని.
‘అదేం ప్రశ్న?’ అని వాళ్ళ అక్క అనలేదు. “పుణ్యం వస్తుంది” అని చెప్పింది, హోమ్ వర్క్ పూర్తిచేసినట్టు బుక్స్ బేగులో సర్దుతూ.
“పుణ్యం అంటే?” మళ్ళీ అడిగాడు చిన్ను.
“అంటే… ప్రసాదం తిన్నవారికి మంచి జరుగుతుంది” చెప్పింది అక్క.
“ఎవరికైనా మంచి జరుగుతుందా?” చిన్ను మళ్ళీ అడిగాడు.
“ఊ…” అంది అక్క.
“ఎవరికైనా?” అని మళ్ళీ అడిగాడు.
“ఎవరికైనా!” అంది అక్క.
“ప్రాణులన్నీ దేవుడి ముందు సమానమే, ప్రసాదం పంచుకు తినేది అందుకే” అంది పూజకోసం దూదితో వొత్తులు చేస్తూ పక్కనున్న అమ్మమ్మ.
“ఊహూ…” కాదన్నట్టు తలను అడ్డంగా వూపాడు చిన్ను.
అర్థంకానట్టు అక్కా అమ్మమ్మా చూశారు.
“మరి అమ్మేమో, తిరుపతిలడ్డుకు పట్టాయని చీమల్ని దులిపి నలిపేసిందా?” చిన్నుగాడు చూసిన చూపుకు అక్క అయోమయంగా చూసినా, అమ్మమ్మ మాత్రం నవ్వింది.
“ప్రసాదం తింటే మంచి జరుగుతుంది- అన్నావ్” అక్కని అడిగాడు చిన్ను.
“అవి చీమలు” తీసిపడేస్తూ అమ్మమ్మ.
“చీమలమీద ప్రసాదం పనిచేయదా?” అనుమానంగా చూశాడు చిన్ను.
“ఎందుకు పని చేయదూ?” వొప్పుకోబుద్ధి కాలేదు అమ్మమ్మకి.
“ఆ విధముగా చీమలు ప్రసాదము తిని పరలోకమునకు పయనము అయినవి, కదా?” అమ్మమ్మని
సమర్ధిస్తున్నట్టు చూస్తూ, చిన్నూకి చెప్పింది అక్క. చిన్నూలాగే వాళ్ళ అమ్మమ్మా నోరు వెళ్ళబెట్టింది.
“ప్రసాదం కూడా అందరికీ వొకేలా పనిచెయ్యదు.” తలూపుతూ తనకు తనే బోధపరచుకున్నాడు చిన్నూ.





