నదుల్లో నీళ్లున్నా పంటలు ఎండిపోతున్నాయ్‌

– దేవాదులలో 60 టీఎంసీలకు 18 టీఎంసీలే ఎత్తారు
– 25 లక్షల ఎకరాలు ఎండిపోతే కేబినెట్లో మాట్లాడకపోవడమేంటి?
– పంటల బీమా ఏమైంది?
– గ్లోబల్ సమ్మిట్ పై వున్న ప్రేమ రైతులపై లేదు
– అసెంబ్లీని అబద్ధాల అడ్డాగా మార్చిన రేవంత్
– 30 శాతం వడ్లు వచ్చినా కొనుగోలు కేంద్రాలు తెరవలేదు
– సింగూరు ఖాళీ చేసి నాలుగు జిల్లాలను ఎండగట్టారు
– తాగునీరు ఆపి బీరు ఫ్యాక్టరీలకు నీళ్లు
– నిప్పులు చెరిగిన హరీష్ రావు

మెదక్, ప్రజాతంత్ర, నవంబర్ 6: సాధారణంగా మనం అతివృష్టి, అనావృష్టి చూస్తుంటాం, కానీ ఇవాళ తెలంగాణలో కనిపిస్తున్నది ప్రకృతి తెచ్చిన అనావృష్టి కాదు, ముమ్మాటికీ ‘రేవంత్ సృష్టే’నని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు విమర్శించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని చిలిపిచెడ్, హత్నూర మండలాల్లో కరెంటు కోతలు, సాగునీటి కొరతతో ఎండిపోయిన వరి పంట పొలాలను శుక్రవారం ఆయన పరిశీలించారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి గారు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గార్లతో కలిసి ఎండిన పొలాల్లో రైతులను పరామర్శించి, వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వర్షాలు కురిసి, నదుల్లో పుష్కలంగా నీళ్లు ఉన్నప్పటికీ.. సకాలంలో మోటార్లు ఆన్ చేసి నీళ్లను లిఫ్ట్ చేయకపోవడం వల్ల వచ్చిన ఈ కరువు ముమ్మాటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వచ్చిన కరువే. రాబోయే అసెంబ్లీలో ఆధారాలతో సహా దీనిని నిరూపిస్తామన్నారు. దేవాదుల ప్రాజెక్టులో కేసీఆర్ గారు సమ్మక్క బ్యారేజీ కట్టి, 2023లో థర్డ్ ఫేజ్ కూడా పూర్తి చేసి 24 గంటల పాటు నీళ్లు ఎత్తే అవకాశం కల్పించారు. దేవాదులలో 10 మోటార్లు 24 గంటలు నడిపితే 50 నుంచి 60 టీఎంసీల నీళ్లు ఎత్తవచ్చు. కానీ ఈ ప్రభుత్వం 10 మోటార్లకు గాను 8 మోటార్లే నడిపింది, అవి కూడా రోజుకు కేవలం 8 గంటలు మాత్రమే నడిపి 18 టీఎంసీలు కూడా ఎత్తలేదు. మూడో వంతు నీళ్లు మాత్రమే ఎత్తి, మిగతా రెండు వంతుల గోదావరి నీళ్లను కిందికి ఆంధ్రాకు వదిలిపెట్టారు. రేవంత్ రెడ్డి నీళ్లు విడిచిపెడితే.. కింద చంద్రబాబు నాయుడు పట్టిసీమలో 100 రోజుల పాటు 24 గంటలు మోటార్లు నడిపి నీళ్లను ఒడిసి పట్టుకున్నాడు.
దమ్ముంటే దేవాదులలో ఎన్ని మోటార్లు, ఎన్ని రోజులు, ఎన్ని గంటలు నడిపారో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రెండో ఉదాహరణ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం. మహబూబ్‌నగర్ జిల్లాను ఆనుకుని ప్రవహించే కృష్ణా నదిలో, శ్రీశైలం ప్రాజెక్టులో నిండుగా నీళ్లున్నా.. కల్వకుర్తిలో 5 మోటార్లను 24 గంటలు నడిపి 60 టీఎంసీలు ఎత్తుకునే అవకాశం ఉన్నా.. కేవలం 2-3 మోటార్లను 10-12 గంటలు మాత్రమే నడిపి 13-14 టీఎంసీలే ఎత్తారు. పక్కనే ఉన్న పాలమూరు పంటలు ఎండబెట్టి, 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రబాబు నాయుడి కుప్పం నియోజకవర్గానికి నీళ్లు పారించారు. మొన్న అఖిలపక్ష సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని ప్రభుత్వమే స్వయంగా ఒప్పుకుంది. కానీ నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్‌లో ఎండిపోయిన ఆ 25 లక్షల ఎకరాల రైతులను ఎలా ఆదుకోవాలనే దానిపై కనీసం ఒక్క ముక్క కూడా చర్చించలేదు. లక్ష, రెండు లక్షల రూపాయలు వడ్డీలకు తెచ్చి పెట్టుబడి పెట్టి పంట నష్టపోయిన రైతులకు భరోసా ఇవ్వని క్యాబినెట్ అసలు క్యాబినెట్టేనా అని ప్రశ్నించారు. గ్లోబల్ సమ్మిట్ కోసం వందల కోట్లు ఖర్చు పెట్టి దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా పేపర్లలో, టీవీల్లో యాడ్లు ఇవ్వడానికి, దానికి టైమ్‌లైన్లు, డెడ్‌లైన్లు పెట్టడానికి సమయం ఉంది గానీ.. రైతులను ఆదుకోవడానికి డెడ్‌లైన్లు ఎందుకు పెట్టరు? మూసీ సుందరీకరణకు లక్ష కోట్లు, ఫ్యూచర్ సిటీకి లక్ష కోట్లు, ఫుట్‌బాల్ షోకులు, అందాల పోటీలు, ఢిల్లీకి 85 సార్లు స్పెషల్ ఫ్లైట్లలో తిరగడానికి, ఢిల్లీకి మూటలు మోయడానికి డబ్బులు ఉన్నాయి, రేపు ఫ్యూచర్ సిటీ నుంచి కొడంగల్‌కు రూ. 9 వేల కోట్లతో సిక్స్ లైన్ రోడ్డు శంకుస్థాపన చేయడానికి డబ్బులు ఉన్నాయి గానీ.. కరువుతో అల్లాడుతున్న రైతులను ఆదుకోవడానికి పైసలు లేవా? పక్కనే ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు తక్షణ కరువు సాయం కింద ప్రతి రైతుకు ఎకరానికి రూ.5,000 విడుదల చేశాయి. ఇప్పటికైనా పక్క రాష్ట్రాలను చూసి బుద్ధి తెచ్చుకుని వెంటనే ఎకరానికి రూ. 5,000 ఇన్‌పుట్ సబ్సిడీ ప్రకటించాలి. ఎన్నికల మేనిఫెస్టోలో పంటల బీమా తెస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్నారు. అసెంబ్లీ బడ్జెట్‌లో పంటల బీమా కోసం రూ. 1,600 కోట్లు పెట్టామని భట్టి విక్రమార్క చదవడం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బల్లలు గుద్దడం తప్ప.. మూడేళ్లు గడిచి ఆరు పంటలు పూర్తయినా ఇప్పటివరకు పంటల బీమా అమలు చేయలేదు.మొదటి రెండేళ్లు బడ్జెట్‌లో పెట్టి చేతులు దులిపేసుకున్నారు, మూడో ఏడాది అసలుకే పీకేశారు. ఇవాళ పంటల బీమా ఉండి ఉంటే 25 లక్షల ఎకరాల్లో పంట ఎండిన రైతులకు ఇన్సూరెన్స్ వచ్చేది కదా. గ్లోబల్ సమ్మిట్లకు వందల కోట్లు తగలేస్తున్న రేవంత్ రెడ్డి.. చనిపోయిన రైతు కుటుంబాలకు రూ. 5 లక్షలు ఇచ్చే కేసీఆర్ తెచ్చిన రైతుబీమా పథకాన్ని ప్రీమియం కట్టకుండా ఆరు నెలల క్రితమే రద్దు చేశాడు. బడ్జెట్‌లో జూన్ 2 నుంచే రాష్ట్ర ప్రజలందరికీ ఇందిరమ్మ బీమా అమలు చేస్తామని అసెంబ్లీలో చెప్పారు. జూన్ 2 పోయి నవంబర్ వచ్చింది. ఆ తర్వాత ఇందిరా గాంధీ జయంతి నవంబర్ 19 నుంచి అమలు చేస్తామన్నారు తీరా నిన్న క్యాబినెట్ మీటింగ్ పెట్టి చావు కబురు చల్లగా చెప్తూ.. నవంబర్ 19 నుంచి బీమా అమలు కాదు, మళ్లీ దరఖాస్తులు తీసుకుంటామని వాయిదా వేశారు!ప్రజాపాలనలో పెన్షన్ కోసం ఇప్పటికి మూడుసార్లు దరఖాస్తులు ఇచ్చి జిరాక్స్‌లకే డబ్బులు ఖర్చయ్యాయి తప్ప మూడేళ్లలో ఒక్క పెన్షన్ రాలేదని వృద్ధులు వాపోతున్నారు. రేవంత్ రెడ్డి అసెంబ్లీని కూడా అబద్ధాలకు అడ్డాగా మార్చేశాడు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీల మీద ఆయనకు కోపం ఉందేమో గానీ.. అమలు చేయని పథకాలకు వారి పేర్లు పెట్టి వారి ఆత్మలు క్షోభించేలా చేస్తున్నాడు.రెండేళ్ల క్రితం బడ్జెట్‌లో ‘రాజీవ్ యువ వికాసం’ పెట్టి, బ్యాంకు ష్యూరిటీ లేకుండా 6 లక్షల మంది యువతకు రుణాలిస్తామని 30 లక్షల దరఖాస్తులు తీసుకున్నారు. ఆ దరఖాస్తులను పుట్నాల పేలాలు తిని పారేశారో ఏమో గానీ, ఇప్పటివరకు కనీసం ఆరుగురికి కూడా ఇవ్వలేదు, అలాగే వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ. 12,000 ఇస్తామని రెండేళ్ల క్రితం బడ్జెట్‌లో పెట్టిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా మోసం చేశారు. రాష్ట్రంలో లక్షలాది మంది రైతులకు సీఎం రేవంత్ రెడ్డి పేరు మీద మీ ఖాతాలో రైతుబంధు డబ్బులు పడ్డాయి అని మెసేజ్‌లు వస్తున్నాయి. ఆ మెసేజ్ చూసుకుని రైతులు ఆశతో బ్యాంకులకు వెళ్తే, ఒక్క రూపాయి కూడా రాలేదని బ్యాంకు వాళ్లు వెళ్లగొడుతున్నారు. నిన్నటిదాకా ఫేక్ మాటలు చెప్పిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు కేరాఫ్ ఫేక్ మెసేజ్‌లుగా మారిపోయాడు. మా బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలు ప్రభుత్వ వైఫల్యాలపై ఒక్క రీట్వీట్ చేస్తేనే రాత్రికి రాత్రే జైల్లో పెట్టే పోలీసు వ్యవస్థ.. సీఎం పేరుతో లక్షలాది మంది రైతులకు ఫేక్ మెసేజ్‌లు పంపి ఆగం చేస్తుంటే ఎందుకు నిద్రపోతోంది? ఇది రేవంత్ రెడ్డి ఆడుతున్న డ్రామా కాకపోతే, తక్షణమే దీనిపై కేసు పెట్టి ఆ ఫేక్ మెసేజ్‌లు పంపిన వారిని అరెస్ట్ చేయాలి. ఇప్పటికే రాష్ట్రంలో 30 శాతం వరి పంట కోతకు వచ్చి కళ్లాలలో ఉంది. సిద్దిపేట, దుబ్బాక, మెదక్, మహబూబాబాద్, వరంగల్, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో అకాల వర్షాలకు వడ్లు తడిసి కొట్టుకుపోయాయి. అయినా ఇప్పటివరకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు. లారీల ట్రాన్స్‌పోర్ట్ ఫైనల్ కాలేదు, గన్నీ బ్యాగులు రాలేదు, రైస్ మిల్లుల అలాట్‌మెంట్ కాలేదు. మరోవైపు మిల్లర్లపై కేసులు, దాడులతో వారు కొనడం ఆపేశారు.
ఇప్పటికే రెండు యాసంగి పంటలకు సన్నాల బోనస్ ఎగ్గొట్టి, 42 రకాల సన్నాలను 8 రకాలకే కుదించిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు ఆ 8 రకాలకు కూడా బోనస్ ఎగ్గొట్టడానికే కొనుగోలు కేంద్రాలు తెరవకుండా రైతులను దళారుల పాలు చేస్తున్నాడు.
కళ్లముందున్న కాళేశ్వరం ప్రాజెక్టును నడపరు గానీ తుమ్మిడిహట్టి అని డ్రామాలు ఆడుతున్నారు. మేము 40 రోజుల్లో మహారాష్ట్రతో మాట్లాడితే, ఈ ప్రభుత్వానికి మహారాష్ట్ర సీఎంతో అపాయింట్‌మెంట్ దొరకడానికే మూడేళ్లు పట్టింది.. ఇక వీళ్లు అనుమతులు తెచ్చి ప్రాజెక్టు కట్టేసరికి 30 ఏళ్లు పడుతుంది. వచ్చే యాసంగిలో నీళ్లకు సెలవు, కరెంటుకు సెలవు, పంటలకు సెలవు అని రేవంత్ రెడ్డి అంటున్నాడు ప్రజలు ఆయనకే సెలవు చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. పంటలకు సెలవు అంటే కేవలం రైతు మాత్రమే కాదు.. వ్యవసాయ కూలీలు, ట్రాక్టర్ డ్రైవర్లు, హార్వెస్టర్ కార్మికులు, రైస్ మిల్లులు, హమాలీలు అందరూ రోడ్డున పడతారు. కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఉపాధి హామీపనిదినాలు పెంచాలి, కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద రూ. 12,000 విడుదల చేయాలి, యాసంగి రైతు భరోసా వెంటనే వేయాలి. ఒక్క నర్సాపూర్ నియోజకవర్గంలోనే 15,910 మంది రైతులకు రుణమాఫీ కాలేదు. రుణమాఫీ కాక బ్యాంకులు కొత్త లోన్లు ఇవ్వకపోవడంతో.. భార్య మెడలోని పుస్తెలతాడు తాకట్టు పెట్టి గోల్డ్ లోన్ తెచ్చుకున్నానని బాషా నాయక్ అనే రైతు కన్నీళ్లు పెట్టుకున్నాడు.అంతేకాదు, క్రాప్ లోన్ కట్టలేదనే కారణంతో వృద్ధులకు వచ్చే రూ. 2 వేల పెన్షన్, వికలాంగుల రూ. 4 వేల పెన్షన్, చివరకు ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటే వచ్చిన లక్ష రూపాయల బిల్లును, వడ్లు అమ్మిన డబ్బులను కూడా బ్యాంకు మేనేజర్లు అప్పు కింద జమ చేసుకుంటున్నారు! తక్షణమే మిగిలిన రైతులందరికీ పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. మూడో రేవంత్ వృష్టి ఉమ్మడి మెదక్ జిల్లా జీవనాధారమైన సింగూరు ప్రాజెక్టు. సింగూరు డ్యామ్‌లో 20 టీఎంసీల నీళ్లు ఉంటే.. ఎండాకాలంలో రిపేర్లు చేస్తామని చెప్పి తెలివితక్కువతనంతో నీళ్లన్నీ ఖాళీ చేశారు.పది పైసల రిపేర్ పని కూడా చేయలేదు, మళ్లీ నీళ్లు నింపలేదు ఇవాళ సింగూరులో కేవలం 2 టీఎంసీల నీళ్లు మాత్రమే మిగిలాయి. ఆ 20 టీఎంసీల నీళ్లు ఉండి ఉంటే నర్సాపూర్, చిలిపిచెడ్, హత్నూర, సంగారెడ్డి, జోగిపేటలో ఒక్క ఎకరమైనా ఎండేదా?సింగూరు ఖాళీ కావడంతో సంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, కామారెడ్డి.. ఈ నాలుగు జిల్లాల్లోని వందలాది గ్రామాలకు తాగునీటి గండం ఏర్పడింది. నారాయణఖేడ్‌లో మూడు రోజులకోసారి, జహీరాబాద్‌లో దినం తప్పి దినం నల్లా వస్తోంది బీహెచ్ఈఎల్, బీడీఎల్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, ఐఐటీ హైదరాబాద్‌లకు నీళ్లు ఇవ్వలేమని ప్రభుత్వం చేతులెత్తేసింది. నాడు 2015లో కరువు వచ్చినప్పుడు నేను కేసీఆర్ గారిని కోరితే.. హైదరాబాద్‌కు కృష్ణా, గోదావరి, గండిపేట పంపింగ్ పెంచి, సింగూరు నీళ్లను మెదక్ జిల్లా తాగునీటి కోసమే ఉంచి ప్రజలను కాపాడారు. ఇవాళ ప్రజలు తాగునీటి కోసం ట్యాంకర్లు తెచ్చుకుంటే సీజ్ చేస్తున్నారు, పేద రైతు వాగులో బోరు వేస్తే క్రిమినల్ కేసులు పెడుతున్నారు. కానీ సంగారెడ్డి జిల్లాలోని యూబీ నిజాం బ్రూవరీస్, కార్ల్స్‌బర్గ్, క్రౌన్ బీర్, లయన్స్ ఆల్కహాల్, చార్మినార్ బ్రూవరీస్, గణపతి షుగర్స్ వంటి బీరు ఫ్యాక్టరీలకు మాత్రం పైపులైన్లు, ట్యాంకర్ల ద్వారా రోజుకు లక్షల లీటర్ల నీళ్లు సరఫరా చేస్తున్నారు. బీరు ఫ్యాక్టరీలు ఏకంగా మంజీరా నదిలోనే 20, 30 హెచ్‌పీ మోటార్లతో అక్రమ బోర్లు వేసి నదిని ఎడారిగా మారుస్తుంటే అధికారులు నిద్రపోతున్నారు. తక్షణమే బీరు కంపెనీలకు నీటి సరఫరా ఆపేసి, మంజీరాలో అక్రమ బోర్లను సీజ్ చేయాలి. సింగూరులో ఉన్న 2 టీఎంసీల నీటిని కాపాడి, ప్రత్యేక నిధులతో ఈ 4 జిల్లాల ప్రజలకు వచ్చే 8 నెలల పాటు తాగునీరు అందించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *