– రేపటినుంచి హకీంపేటలో మెగా రైతు మేలా
– లగచర్లలో ఎకో పామ్ ఆయిల్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీకి సీఎం శంకుస్థాపన
– వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 6 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసి, రైతుల ఆదాయాన్ని పెంచి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 7 నుంచి మూడు రోజులపాటు కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం హకీంపేటలో మెగా రైతు మేలా నిర్వహిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమయ్యే ఈ మేలా సందర్భంగా ఆయన రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, ప్రగతిశీల రైతులతో ముఖాముఖి చర్చలు జరపడమే కాక పారిశ్రామికవేత్తలతోనూ సమావేశమవుతారని వివరించారు. 8న ముఖ్యమంత్రి హకీంపేటలో స్వయం సహాయక సంఘాల మహిళలతో సమావేశమవుతారని, అనంతరం వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహిస్తారని, 9న పది జిల్లాల నుంచి సుమారు 50 వేల మంది రైతులు పాల్గొనే భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రైతులనుద్దేశించి ప్రసంగిస్తారని తెలిపారు. రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావడం, వ్యవసాయంలో వస్తున్న నూతన ఆవిష్కరణలను పరిచయం చేయడమే ఈ రైతు మేలా ప్రధాన ఉద్దేశమని చెప్పారు. కార్యక్రమంలో రైతులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ నిపుణులు, పరిశ్రమల ప్రతినిధులను ఒకే వేదికపైకి తీసుకొస్తున్నామని తెలిపారు. 150 ప్రదర్శన స్టాళ్ల ద్వారా రైతులకు ఆధునిక వ్యవసాయ యంత్రాలు, డ్రోన్లు, నూతన సాగు పద్ధతులు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలపై ప్రత్యక్ష అవగాహన కలుగుతుందని మంత్రి తెలిపారు. శాస్త్రవేత్తలతో ముఖాముఖి చర్చలు, ప్రగతిశీల రైతుల అనుభవాలు, విజయగాథలు ఇతర రైతులకు స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు. పప్పుధాన్యాలు, నూనెగింజలు, ఉద్యాన పంటలు, ఆయిల్‌పామ్ వంటి ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని కోరారు. ప్రభుత్వం వేరుశనగ, పెసళ్లు, పొద్దుతిరుగుడు, మినుములు, శనగ వంటి విత్తనాలను సబ్సిడీపై అందచేస్తున్నట్టు తెలిపారు. ఎల్‌నినో వాతావరణ పరిస్థితులు వ్యవసాయ రంగానికి సవాళ్లు విసురుతున్నాయని, వర్షపాతం, నీటి లభ్యతలో వచ్చే మార్పులను దృష్టిలో పెట్టుకుని రైతులు ముందస్తు ప్రణాళికతో సాగు చేయాలని మంత్రి సూచించారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవడం, సాగు విధానాల్లో మార్పులు చేసుకోవడం ద్వారా నష్టాలను తగ్గించుకోవచ్చని, శాస్త్రవేత్తలు, అధికారుల సూచనలు పాటించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. లగచర్ల పారిశ్రామిక కారిడార్‌లో ఎకో పామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయడం ఆయిల్‌పామ్ రైతుల అభివృద్ధికి, రాష్ట్రంలో ప్రాసెసింగ్ పరిశ్రమల విస్తరణకు దోహదపడుతుందని తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడించే పరిశ్రమలు గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటైతే రైతులకు మెరుగైన మార్కెట్ అవకాశాలు లభించడంతోపాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని వివరించారు. వ్యవసాయ రంగాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు తీసుకెళ్లి రైతులకు అధిక ఆదాయం అందించడమే ప్రభుత్వ సంకల్పమని మంత్రి స్పష్టం చేశారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది.. వ్యవసాయం బలోపేతమైతేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుందని అన్నారు. రాష్ట్రంలోని రైతులందరూ మెగా రైతు మేలాలో పాల్గొని ఆధునిక వ్యవసాయ పరిజ్ఞానాన్ని తెలుసుకుని వాటిని ఆచరణలో పెట్టాలని మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





