తెల్లరాయి మైనింగ్ పై గ్రామస్తుల తిరుగుబాటు

– మైనింగ్ పనులు ఆపేంతవరకు ధర్నా విరమించేది లేదు
– నవభారత్ కంపెనీపై గ్రామ ప్రజల ఆగ్రహం
– సీఎం జోక్యం చేసుకోవాలని డిమాండ్

దేవరకొండ, ప్రజాతంత్ర, అక్టోబర్ 12: తెల్ల రాయి మైనింగ్ పనులను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం దేవరకొండ మండలం కాచారం గుట్టపై గ్రామ ప్రజలు ధర్నాకు దిగారు. మైనింగ్ కార్యకలాపాల వల్ల గ్రామ పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి, మూగజీవాలకు నష్టం వాటిల్లుతోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అనుమతుల విషయంలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, అధికారులు వెంటనే స్పందించి మైనింగ్ పనులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. మైనింగ్ కారణంగా దుమ్ము, కాలుష్యం పెరిగి ప్రజలు, మూగజీవాలు అనారోగ్యానికి గురవుతున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై ప్రశ్నిస్తే నవభారత్ కంపెనీ ప్రతినిధులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ, దౌర్జన్యంగా పనులు కొనసాగిస్తున్నారని వారు ఆరోపించారు. గ్రామ ప్రజల అభ్యంతరాలను పట్టించుకోకుండా మైనింగ్ కార్యకలాపాలు కొనసాగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

మైనింగ్ ఆపేంతవరకు పోరాటం ఆగదు

గ్రామ ప్రజల సమస్యలను అధికారులు పరిష్కరించే వరకు, మైనింగ్ పనులు పూర్తిగా నిలిపివేసే వరకు ధర్నాను కొనసాగిస్తామని గ్రామస్తులుస్పష్టం చేశారు. తమ ఆవేదనను పట్టించుకోకపోతే వెనక్కి తగ్గకుండా మరింత ఉధృతంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే ఈ సమస్యపై సబ్ కలెక్టర్, తహసీల్దార్ కు వినతిపత్రాలు అందజేసినట్లు తెలిపారు.

ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలి

గ్రామ ప్రజల ఆందోళనను గౌరవ ముఖ్యమంత్రి వెంటనే పరిగణనలోకి తీసుకొని, తెల్లరాయి మైనింగ్ కార్యకలాపాలపై సమగ్ర విచారణ జరిపించాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. మైనింగ్ కు సంబంధించిన అనుమతులు, పర్యావరణ ప్రభావాలు, ప్రజల ఆరోగ్యంపై పడుతున్న ప్రభావాలను పరిశీలించి, నిబంధనలకు విరుద్ధంగా పనులు జరుగుతున్నట్లు తేలితే తక్షణమే నిలిపివేయాలని కోరారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *