– ప్రభుత్వ ఉద్యోగాలు అంగడి సరకు కాదు
– కరూరు బాధితులకు ఉద్యోగాల కల్పనపై ఆక్షేపణ
చెన్నై, జూలై 27: తమిళనాడు సీఎం విజయ్ ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కరూర్ తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఇచ్చిన ఉద్యోగాలు చెల్లవని ఉన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. రాజ్యాంగ పరిమితులకు లోబడి ప్రభుత్వం వ్యవహరించాలని సూచించింది. ప్రభుత్వ చర్యలపై నియంత్రణ లేకపోతే.. అరాచకం, అశాంతి రాజ్యమేలుతాయని పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగం అనేది ఉచితంగా పంచిపెట్టేది కాదు. దాన్ని కష్టపడి సాధించాలి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎంతోమంది ఎదురుచూస్తున్నారని వ్యాఖ్యానించింది. గతేడాది సెప్టెంబర్‌లో జరిగిన టీవీకే ర్యాలీలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో 41 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాధితుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని విజయ్ హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మరోసారి కరూర్ వెళ్లి అర్హతలున్న 32 మందికి వివిధ ప్రభుత్వ శాఖల్లో తాత్కాలిక నియామక పత్రాలను అందజేశారు. దీనిపై అన్నాడీఎంకే నేత ఆర్.బి. ఉదయ్‌కుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చట్టపరమైన విధానాలను పక్కనపెట్టి తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగాలు ఇచ్చారంటూ హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎంతో మంది యువత తీవ్రంగా శ్రమిస్తున్నారని, ప్రభుత్వం ఏ ఉద్యోగ నియమాక పక్రియ చేపట్టినా తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారానే చేపట్టాలని కోరారు. దీనిపై తాజాగా విచారణ చేపట్టి న్యాయస్థానం సీఎం విజయ్ చేపట్టిన ఈ నియామకాలు చెల్లబోవని తీర్పునిచ్చింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




