– మరింత సౌకర్యవంతంగా స్టేషన్లకు రూపకల్పన
– అదనపు మేనేజింగ్ డైరెక్టర్ అజిత్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 27: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు మరింత మెరుగైన, సౌకర్యవంతమైన సేవలు అందించడమే లక్ష్యంగా హైదరాబాద్ మెట్రో రైల్ అదనపు మేనేజింగ్ డైరెక్టర్ బి. అజిత్ రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. స్టేషన్లను అన్ని విధాలా తీర్చిదిద్దేందుకు వెంటనే ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆయన సూచించారు. ఈ మేరకు బేగంపేట్ నుంచి రాయదుర్గ్ వరకు మెట్రోలో స్వయంగా ప్రయాణించి, పలు కీలక స్టేషన్లను, అక్కడి వీధి స్థాయి వసతులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పర్యటనలో భాగంగా బేగంపేట్, అర్ పేట్, రాయదుర్గ్ మెట్రో స్టేషన్లలోని ప్లాట్‌ఫామ్‌లు, కాంకోర్స్ ప్రాంతాలను అజిత్ రెడ్డి సందర్శించారు. అక్కడ ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లపై మెట్రో ఇంజనీర్లు, ఆపరేషన్ల నిర్వాహక సంస్థ కియోలిస్ అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాయదుర్గ్ వద్ద ఉన్న స్కైవాక్, ఐటీ కంపెనీలకు ఉన్న కనెక్టివిటీ మార్గాలు, మైండ్‌స్పేస్ జంక్షన్ వద్ద ప్రయాణికుల రాకపోకలను ఆయన ప్రత్యేకంగా పరిశీలించారు. ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మరింత పక్కా ప్రణాళికతో ఏర్పాట్లు చేయాలని, అలాగే స్టేషన్ల కింద ఉన్న వాణిజ్య సముదాయాల నిర్వహణ సరిగ్గా ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మెట్రో స్టేషన్ల కింద ఉన్న పార్కింగ్ స్థలాల వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని, బేగంపేట్, అర్ పేట్, రాయదుర్గ్ పార్కింగ్ ఏరియాలను పరిశీలించి అభివృద్ధికి తగిన సూచనలు చేశారు. అలాగే, పిల్లర్ల మధ్య ఉన్న సెంట్రల్ మెరిడియన్ నిర్వహణ , పారిశుధ్య స్థితిగతులపై ఆయన సక్షించారు. ప్రయాణికులకు ఇచ్చే సేవలలో స్వచ్ఛత, పనుల నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని స్పష్టం చేశారు. నిర్వహణ చూసే ఏజెన్సీల పనితీరును ఇంకా మెరుగుపరచాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మెట్రో స్టేషన్లను మరింత మోడల్‌గా తీర్చిదిద్దేందుకు స్థానిక అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని అజిత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఇందులో భాగంగా ప్రయోగాత్మకంగా మొదటి విడతలో 10 మెట్రో స్టేషన్లను ఎంపిక చేసి, వాటిని అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేయడానికి వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. రాబోయే రోజుల్లో మిగిలిన అన్ని మెట్రో స్టేషన్లను కూడా స్వయంగా సందర్శించి, ప్రయాణికులకు అందే సౌకర్యాలు, పార్కింగ్, పారిశుధ్యం , భద్రతను క్రమం తప్పకుండా సమీక్షిస్తానని తెలిపారు. నగరవాసులకు అత్యంత సురక్షితమైన, ప్రశాంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించడమే తమ మొదటి ప్రాధాన్యత అని ఆయన పునరుద్ఘాటించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




