కొల్లేటికి వచ్చినట్టు పక్షులు వస్తుంటయి
కడుపు నిండు కలలు మోసుకొస్తుంటయి
నువ్వు పచ్చగున్నవని మీసం తిప్పకు
పిట్ట వాలితేనే చెట్టుకు అందమొస్తది.
కూతురు మీద ప్రేమ ఉంటది
కొడుకు మీదా ప్రేమ ఉంటది
కన్నపేగు కడుపుగట్టుకుంటది
కూడబెట్టడానికే కాలమంతా గడిచి పోతది.
పాఠం చెవికెక్కని కోతులుంటయి
కొడితే కరిచే పిల్ల చేష్టలుంటయి
బడి అంటే వజ్రాల కార్ఖానా
ముల్లు దాటి గులాబీలు కొయ్యాలి.
మెరిసే నక్షత్రాలుంటయి
ఏడు రంగుల ఇంద్రధనుస్సులుంటయి
ముఖం చూడగానే ప్రేమ కారిపోతది
పిల్లల నవ్వులో పెద్దల ఆయుష్షు ఉంటది.
– గజ్జెల రామకృష్ణ





