ప్రతి రోజూ సాహసించడం వారి వృత్తి రివాజు
పుడమి అంతరాళాలలోకి ఇరుకు ఇరుకు బిలాలలోకి
ధూళి క్రమ్మిన స్థలాలలోకి ముప్పుల మూలాలలోకి
తమ పనిముట్లతో ప్రవేశించి ఉద్యోగ ధర్మాన్ని పాలించడం
వారి అనివార్య దిన చర్య!
బ్రతుకును జీవింపచేసుకునే ఆవశ్యక పరిచర్య
కఠోర జీవన సంఘర్షణ వారిది కఠిన శ్రమార్పణ వారిది
పని వేళలలో దేహం, చిత్తం మొత్తం
విధి నిర్వహణకు ధారాదత్తం ప్రతికష్టం శిరోధార్యం
ప్రమాదాలతోనే సాగుతుంది వారి సాహచర్యం
దిన దిన క్షణ క్షణ విపత్తులు పొంచి వుండే
కాలుష్య కర్మ క్షేత్ర గహ్వరంగా
నిత్యం కాచుకొని ఉండే మృత్యు పాశాల స్థావరంగా
ఆరోగ్యాన్ని హరించే అభద్రతా కుహరంగా ఉండే
పాతాళ ప్రాంతంలో తమ కార్య క్షేత్రంలో
కాయ కష్టం చేసే ఆ కర్మచారులు
ఎంత ధీరులో ఎంతటి దీనులో..!
లోతుల్లో, గోతుల్లో ఒడలు గగరుపొడిచే రీతుల్లో
ఎన్నడే కప్పు కూలుతుందో అనే గుబులుతో
ఎన్నడే తావులో తమను ముంచేలా
భూగర్భ జలం పైకి తేలుతుందోననే దిగులుతో
శిర స్త్రాణ దీప ధారియై నల్లబంగారం త్రవ్వకాలను
నెరపుతూ ప్రేలుళ్లను జరుపుతూ
విద్యుత్ పరిశ్రమల కోసం ఇంధనాన్ని ఉత్పత్తి చేసేందుకు
కష్టించే ఆ అన్నదమ్ములు జాతి అభివృద్ధికి పట్టుగొమ్మలు!
వారు కార్య దీక్షాధారులు!
వారు శ్రమ ఫలితాన్ని మాత్రమే ఆశించే
సదాచారులు!
సహజంగా మండే స్వభావపు రాతిబొగ్గుబొర్రెలలో
చిన్న నిప్పురవ్వ వెలసినా
అది అక్కడి మిథేన్ వాయువుతో కలసినా
కీడు కలగవచ్చుననే నిజం తెలిసినా
రాక్షసి బొగ్గు బొరియలలో బొగ్గుపులుసు గాలి
పరిధిని దాటేలా చెలగినా అడ్డుకోలేని ఆపత్తి
సంభవించగలదనే సత్యం వారికి గుర్తున్నా
అన్ని గడ్డు పరిస్థితుల పద్మ వ్యూహాలను ఛేదిస్తూ
పనులను చేయవలసిన జీవన సమరం వారిది
చేయక తప్పని జీవన సంగరం వారిది!
వాయు కాలుష్య స్థితిని గుర్తించే
పరి రక్షణ పరికరాలు అత్యవసర వేళ
ఆదుకునే పథకాలు,
తగిన గాలి ప్రసారాలూ ఉన్నా భూగర్భ బొగ్గు గనులు
ఎన్నో అనూహ్య ప్రమాదాలకు
ప్రమాణాలైన ఠికానాలు!
శ్రమించి శ్రమించీ మసిబారి నిలువెత్తు నీల మణులైన
ఆ శ్రామికులు జాతికి ప్రగతి దాతలు!
ఎర్ర బారి పగడాలైన వారి కనులు
దేశానికి ప్రభలనందించే సూర్య జ్యోతుల దూతలు!
ఇంటింటా వెలిగే విద్యుత్ దీపం శ్రమకు ప్రతి రూపం!
గనుల గర్భాలలోకష్టించే ఆ ఘనులకు వందనం!
గుండె దిటవు గల ఆ గుణ ధనులకు వందనం!
వై. గోపీనాథ్





