“అధికారంలో ఏ పార్టీ ఉన్నప్పటికీ, విధి నిర్వహణలో ఉండే పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులు రాజ్యాంగ నిబంధనలు, ఉన్నతాధికారుల ఉత్తర్వుల ప్రకారం పనిచేయాల్సి వస్తుంది. రాజధాని నగరంలో శాంతిభద్రతలను కాపాడటం, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడం పోలీసుల బాధ్యత అయినప్పటికీ, ప్రతిపక్షాల రాజకీయ ఆందోళనలు, అధికార పక్ష వ్యూహాల నడుమ క్షేత్రస్థాయిలో ఉన్న ఉద్యోగులే తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులను బలి చేయడం నిత్యకృత్యంగా మారింది. నిరసనల సమయంలో ప్రజాప్రతినిధులతో, ముఖ్యంగా మహిళా ప్రజాప్రతినిధులతో పోలీసు బలగాలు పరిమితులు దాటి ప్రవర్తించారన్న ఆరోపణలు ఎంత తీవ్రంగా పరిగణించాల్సిన అంశమో, చట్టసభ లోపలా వెలుపలా ప్రజాప్రతినిధులు హుందాతనాన్ని విస్మరించి ప్రవర్తించడం, అధికారులను బెదిరించేలా మాట్లాడటం కూడా అంతే తీవ్రమైన తప్పు..”
వెంక గారి భూమయ్య సీనియర్ జర్నలిస్ట్
తెలంగాణ శాసనసభ వేదికగా ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు, అసెంబ్లీ గేటు వద్ద ప్రతిపక్షాల నిరసనలు, పోలీసుల జోక్యం, ప్రజాప్రతినిధుల ప్రవర్తన రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా రాజ్యాంగ వ్యవస్థల పరిధిపై సరికొత్త చర్చకు తెరలేపాయి. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల తమ నిరసనను వ్యక్తం చేసేందుకు నల్లటి టీషర్టులు ధరించి అసెంబ్లీకి చేరుకున్న ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు మెయిన్ గేటు వద్దే అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ క్రమంలో జరిగిన నెట్టివేతలు, తోపులాటలు, ప్రజాప్రతినిధుల బలవంతపు అరెస్టులు, మహిళా ప్రజాప్రతినిధుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు ఒకవైపు తీవ్ర వివాదాస్పదమవ్వగా, మరోవైపు అసెంబ్లీ సాక్షిగా స్పీకర్ వ్యవస్థను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్య సంస్కారాన్ని తీవ్రంగా ప్రశ్నిస్తున్నాయి.
ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టసభలకు హాజరయ్యే ప్రజాప్రతినిధులను అడ్డుకునే అధికారం పోలీసులకు ఉందా అనే కోణంలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా సమస్యల పరిష్కారం కోసం, శాసనసభ విధుల నిర్వహణ కోసం వచ్చే ఎమ్మెల్యేలను ఎట్టి పరిస్థితుల్లోనూ అసెంబ్లీ గేటు వద్ద పోలీసులు నిలిపివేయడం శ్రేయస్కరం కాదు. రాజ్యాంగబద్ధమైన శాసన వ్యవస్థ వ్యవహారాల్లో కార్యనిర్వాహక వ్యవస్థ లేదా పోలీసుల అతి జోక్యం ప్రజాస్వామ్య సూత్రాలకే విరుద్ధం. శాసనసభ్యులు సభ నిబంధనలు లేదా డ్రెస్ కోడ్ వంటి ఉల్లంఘనలకు పాల్పడితే, వారిపై చర్యలు తీసుకునే సంపూర్ణ అధికారం కేవలం శాసనసభాపతికి మాత్రమే ఉంటుంది. చట్టసభ సభ్యుల ప్రవర్తనపై స్వయంగా నిర్ణయం తీసుకునే చట్టపరమైన అధికారం పోలీసులకు లేదు. స్పీకర్ పరిధిలోని అధికారాల్లో పోలీసు యంత్రాంగం జోక్యం చేసుకోవడం సమంజసం కాదని రాజ్యాంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
అయితే, ఈ రాజకీయ రగడ మరియు ఘర్షణల నడుమ అత్యంత ఆందోళనకరమైన అంశం ఏమిటంటే—అసెంబ్లీ సాక్షిగా ఒక దళిత స్పీకర్‌ను అవమానపరచడం, శాసనసభ స్పీకరిని గౌరవం లేకుండా ఈ రకమైన పదజాలంతో నిందించడం. అత్యున్నత రాజ్యాంగ పీఠంపై ఉన్న వ్యక్తిని, అందునా ఒక దళిత వర్గానికి చెందిన నాయకుడిని ఏకవచనంతో సంబోధిస్తూ, అసభ్యకరమైన పదజాలం వాడటం ఎంతమాత్రం సమంజసం కానేకాదు. రాజకీయ వ్యూహాలు, ఆందోళనలు, విమర్శలు ఎంత తీవ్రస్థాయికి చేరినా మాట్లాడే భాషా సంప్రదాయాలు, సభా సంస్కారం దిగజారకూడదు. చట్టసభకు అత్యున్నత స్థానంలో ఉన్న స్పీకర్ పదవిని, ఆ స్థానంలో ఉన్న వ్యక్తులను ఉద్దేశించి గౌరవం లేని వక్ర భాషను ఉపయోగించడం ఏ రకమైన రాజ రాజకీయ సంస్కృతికి నిదర్శనమో ప్రతిపక్షాలు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ప్రజాప్రతినిధులు సభా మర్యాదలు, సభ్య సమాజం మెచ్చే సంస్కారాన్ని ప్రదర్శించాల్సిన బాధ్యత వారిపైనే ఉంది. రాజ్యాంగబద్ధమైన స్థానాలను కించపరిచేలా ప్రవర్తిస్తే అది రాజకీయ లబ్ధిని అందించకపోగా, ప్రజల్లో వారి పట్ల ఉన్న విశ్వసనీయతను పూర్తిగా దెబ్బతీస్తుంది.
అధికారంలో ఏ పార్టీ ఉన్నప్పటికీ, విధి నిర్వహణలో ఉండే పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులు రాజ్యాంగ నిబంధనలు, ఉన్నతాధికారుల ఉత్తర్వుల ప్రకారం పనిచేయాల్సి వస్తుంది. రాజధాని నగరంలో శాంతిభద్రతలను కాపాడటం, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడం పోలీసుల బాధ్యత అయినప్పటికీ, ప్రతిపక్షాల రాజకీయ ఆందోళనలు, అధికార పక్ష వ్యూహాల నడుమ క్షేత్రస్థాయిలో ఉన్న ఉద్యోగులే తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులను బలి చేయడం నిత్యకృత్యంగా మారింది. నిరసనల సమయంలో ప్రజాప్రతినిధులతో, ముఖ్యంగా మహిళా ప్రజాప్రతినిధులతో పోలీసు బలగాలు పరిమితులు దాటి ప్రవర్తించారన్న ఆరోపణలు ఎంత తీవ్రంగా పరిగణించాల్సిన అంశమో, చట్టసభ లోపలా వెలుపలా ప్రజాప్రతినిధులు హుందాతనాన్ని విస్మరించి ప్రవర్తించడం, అధికారులను బెదిరించేలా మాట్లాడటం కూడా అంతే తీవ్రమైన తప్పు.
మరోవైపు ప్రతిపక్ష పార్టీలు తమ నిరసన పద్ధతులను, సభా మర్యాదలను, ప్రజాస్వామ్య విధులను ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కు అయినప్పటికీ, ఆ నిరసనలు ప్రజా సమస్యలను ఎండగట్టేలా ఉండాలే తప్ప, చట్టసభల కార్యకలాపాలను పూర్తిగా స్తంభింపజేసేలా లేదా స్పీకర్ వ్యవస్థనే కించపరిచేలా ఉండకూడదు. ప్రభుత్వం గతంలో చేసిన హామీలను, సంక్షేమ కార్యక్రమాలను నెరవేర్చడంలో విఫలమైందని భావిస్తే, ప్రతిపక్షాలు స్పష్టమైన ఆధారాలు, నిర్ణాత్మకమైన వాదనలతో ప్రభుత్వాన్ని సభ లోపల నిలదీయాలి. నగరంలో ఆందోళనలు చేస్తూ అశాంతి వాతావరణం సృష్టించడం లేదా కేవలం ప్రచార ఆర్బాటాల కోసం వీధి పోరాటాల బాట పట్టడం ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మేలు చేయదు. అదే సమయంలో ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి, వారి విమర్శలను అణచివేయడానికి పోలీసు వ్యవస్థను సాధనంగా వాడుకోవడం అధికార పక్షానికి కూడా తగదు.
ఈ మొత్తం పరిణామాలలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత కేవలం వ్యవస్థలు లేదా న్యాయస్థానాల పైనే లేదు. న్యాయస్థానాలు రాజ్యాంగ పరిమితులకు లోబడి తీర్పులు ఇస్తాయి తప్ప, రోజువారీ రాజకీయ వివాదాలను పరిష్కరించలేవు. అధికార పక్షం సభలో చర్చలకు తగినంత సమయం ఇచ్చి, ప్రతిపక్షాల విమర్శలను స్వీకరించే సహనం ప్రదర్శించాలి. ప్రభుత్వం గత ప్రభుత్వాల అప్పులను తీరుస్తూ, పాలన సాగిస్తున్న వేళ పారదర్శకతకు ప్రాధాన్యమివ్వాలి. ప్రతిపక్షం స్పీకర్ వ్యవస్థను, ఒక దళిత నేత ఉన్న సభాధ్యక్ష స్థానాన్ని మరియు సభా సంప్రదాయాలను గౌరవిస్తూ అర్థవంతమైన వాదనలతో ముందుకు సాగాలి. రక్షణ వ్యవస్థలు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా, రాజ్యాంగ పరిమితులకు లోబడి మాత్రమే తమ విధులను నిర్వహించాలి. చట్టసభలు ప్రజల సమస్యల పరిష్కారానికి, సమగ్ర వికాసానికి వేదికలు కావాలి తప్ప, రాజకీయ ప్రతిష్టంభనలకు, పోలీసు దౌర్జన్యాలకు, స్పీకర్‌ను అవమానించే అనుచిత వ్యాఖ్యలకు నిలయాలు కాకూడదు. రాజ్యాంగంలోని మూడు ప్రధానాంగాలు తమ పరిధులను గుర్తిస్తూ మెలగినప్పుడే ప్రజాస్వామ్యానికి అసలైన శోభ చేకూరుతుంది.