యూరియా కొరత: కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న యూరియా కొరత రైతాంగాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఖరీఫ్‌ సాగు ప్రారంభమైన ఈ సమయంలో పంటలకు అత్యంత కీలకమైన యూరియా అందుబాటులో లేక రైతులు ఎరువుల దుకాణాల వద్ద క్యూలలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పంటల పెరుగుదల దశలో సరైన సమయంలో యూరియా అందకపోతే దిగుబడులు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితికి కేవలం ఒక ప్రభుత్వాన్ని మాత్రమే బాధ్యులుగా చూపించడం సరైంది కాదు. కేంద్రం, రాష్ట్రం రెండూ తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించడంలో విఫలమయ్యాయని చెప్పక తప్పదు.

వ్యవసాయం అనేది ప్రణాళికాబద్ధమైన రంగం. ఏ జిల్లాలో ఎంత విస్తీర్ణంలో ఏ పంట సాగవుతోంది, దానికి ఎంత ఎరువు అవసరమవుతుందో వ్యవసాయ శాఖల వద్ద స్పష్టమైన సమాచారం ఉంటుంది. ఈ సమాచారాన్ని ఆధారంగా చేసుకొని కేంద్ర ప్రభుత్వం ముందుగానే యూరియా కేటాయింపులు చేయాలి. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అవసరాలను అంచనా వేసి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంతో పాటు అందిన నిల్వలను సమర్థవంతంగా పంపిణీ చేయాలి. కానీ ఈ రెండు స్థాయిల్లోనూ సమన్వయ లోపం కనిపిస్తోంది.

తెలంగాణలో వరి, మొక్కజొన్న, పత్తి వంటి ప్రధాన పంటలకు ఖరీఫ్‌ కాలంలో భారీ స్థాయిలో యూరియా అవసరం ఉంటుంది. పంటల పెరుగుదల దశలో రైతులు యూరియా కోసం తిరగాల్సి వొస్తే అది కేవలం పరిపాలనా వైఫల్యమే కాదు, రైతుల పట్ల నిర్లక్ష్యానికి నిదర్శనం కూడా. రైతు విత్తనం వేయడానికి ముందు ఎరువులు అందుబాటులో ఉంటాయనే నమ్మకంతో అప్పులు చేసి సాగు ప్రారంభిస్తాడు. కానీ అవసరమైన సమయంలో ఎరువు దొరకకపోతే పెట్టుబడి మొత్తం ప్రమాదంలో పడుతుంది.

యూరియా పంపిణీలో పారదర్శకత తీసుకురావడం, అక్రమ నిల్వలు మరియు బ్లాక్‌ మార్కెటింగ్‌ను అరికట్టడం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక యూరియా యాప్‌ను ప్రవేశపెట్టింది. అయితే క్షేత్రస్థాయిలో రైతుల అనుభవాలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. యాప్‌లో నమోదు చేసినప్పటికీ సరైన సమయంలో యూరియా అందడం లేదని, స్టాక్‌ వివరాలు వాస్తవ పరిస్థితులకు సరిపోవడం లేదని, గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సమస్యల కారణంగా నమోదు ప్రక్రియ క్లిష్టంగా మారుతోందని రైతులు వాపోతున్నారు. ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులు డిజిటల్‌ విధానాలకు పూర్తిగా అలవాటు పడకపోవడంతో మధ్యవర్తులపై ఆధారపడాల్సి వొస్తోంది. ఫలితంగా యాప్‌ రైతుల సమస్యలను పరిష్కరించాల్సింది పోయి, కొన్నిచోట్ల అదనపు ఇబ్బందులను సృష్టిస్తున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సాంకేతిక పరిజ్ఞానం రైతుకు సహాయకారిగా మారాలే గానీ, అడ్డంకిగా మారకూడదు. యాప్‌ పనితీరును ప్రభుత్వం సమీక్షించి లోపాలను వెంటనే సరిదిద్దాల్సిన అవసరం ఉంది.

ఇక్కడ మరో ముఖ్యమైన అంశం వివక్ష. దేశంలోని కొన్ని రాష్ట్రాలకు అవసరాలకు మించి యూరియా కేటాయింపులు జరుగుతుండగా, తెలంగాణ వంటి వ్యవసాయాధారిత రాష్ట్రాలకు మాత్రం తగినంత సరఫరా జరగడం లేదనే ఆరోపణలు తరచూ వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కంటే వ్యవసాయ అవసరాలను ప్రామాణికంగా తీసుకోవాలి. రైతు ఏ రాష్ట్రానికి చెందినవాడైనా దేశ ఆహార భద్రతలో భాగస్వామే. కాబట్టి ఎరువుల కేటాయింపులో సమానత్వం, పారదర్శకత ఉండాలి.

అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యత నుంచి తప్పించుకోలేదు. కేంద్రం తగినంత కేటాయింపులు చేయకపోతే రైతుల తరఫున గట్టిగా పోరాడాల్సిన బాధ్యత రాష్ట్రానిదే. అవసరాలను ముందుగానే గుర్తించి కేంద్రాన్ని అప్రమత్తం చేయడం, ప్రత్యామ్నాయ నిల్వలు ఏర్పాటు చేయడం, బ్లాక్‌ మార్కెటింగ్‌ను అరికట్టడం వంటి చర్యలు సమర్థవంతంగా చేపట్టాల్సి ఉంది. అనేక ప్రాంతాల్లో రైతులు అధిక ధరలకు యూరియా కొనుగోలు చేస్తున్నారనే ఫిర్యాదులు రావడం అధికార యంత్రాంగం వైఫల్యాన్ని సూచిస్తోంది.

యూరియా కొరత వల్ల కేవలం రైతులకే కాదు, మొత్తం ఆర్థిక వ్యవస్థకు నష్టం జరుగుతుంది. దిగుబడులు తగ్గితే ధాన్యం ఉత్పత్తి తగ్గుతుంది. మార్కెట్లో ఆహార ధాన్యాల కొరత ఏర్పడి ధరలు పెరుగుతాయి. ద్రవ్యోల్బణం పెరుగుతుంది. చివరికి వినియోగదారుడే అదనపు భారం భరించాల్సి వొస్తుంది. అంటే యూరియా కొరత అనేది కేవలం వ్యవసాయ సమస్య కాదు; అది ఆర్థిక, సామాజిక సమస్య కూడా.

ఇప్పటికైనా కేంద్రం అత్యవసర ప్రాతిపదికన తెలంగాణకు అదనపు యూరియా కేటాయించాలి. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల వారీగా అవసరాలను అంచనా వేసి సరఫరాను పర్యవేక్షించాలి. ఎక్కడైనా నిల్వలు దాచిపెట్టడం, అక్రమ విక్రయాలు జరగడం వంటి అంశాలపై కఠిన చర్యలు తీసుకోవాలి. రైతు దుకాణాల చుట్టూ తిరగకుండా గ్రామ స్థాయిలోనే సరఫరా వ్యవస్థను బలోపేతం చేయాలి.

దేశ ఆహార భద్రతకు రైతు వెన్నెముక. అలాంటి రైతును యూరియా కోసం క్యూలో నిలబెట్టడం ఏ ప్రభుత్వానికీ గర్వకారణం కాదు. వ్యవసాయాన్ని దేశ అభివృద్ధికి మూలస్తంభమని చెప్పే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాటలకే పరిమితం కాకుండా రైతు అవసరాలను సమయానికి తీర్చే విధానాలను అమలు చేయాలి. లేకపోతే యూరియా కొరత అనే సమస్య కేవలం ఎరువుల కొరతగానే కాకుండా, రైతులపై జరుగుతున్న వ్యవస్థాగత వివక్షకు ప్రతీకగా మిగిలిపోతుంది. రైతు సంక్షేమం నిజంగా ప్రభుత్వాల ప్రాధాన్యమైతే, యూరియా కొరతకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన సమయం ఇదే.

రైతు అవసరాలను ముందుగానే అంచనా వేసి తగినంత యూరియాను అందించడంలో కేంద్రం విఫలమైతే, పంపిణీ వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. యూరియా యాప్‌ పట్ల రైతుల్లో పెరుగుతున్న అసంతృప్తి కూడా దీనికి నిదర్శనం. రైతును డిజిటల్‌ క్యూలలోనూ, ఎరువుల దుకాణాల క్యూలలోనూ నిలబెట్టే విధానాలు కాకుండా, అవసరమైన సమయంలో అవసరమైన ఎరువును అందించే వ్యవస్థనే ప్రభుత్వాలు నిర్మించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *