గాసిప్‌ల‌కూ ఒక హ‌ద్దుండాలి!

 “నిప్పు లేనిదే పొగ రాదు” అనే సామెత ఉన్నప్పటికీ, ప్రస్తుత డిజిటల్ యుగంలో “పొగ సృష్టించి, నిప్పు అంటుకునేలా చేయడం” ఒక పెద్ద వ్యాపారంగా, రాజకీయ వ్యూహంగా మారింది. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో  బీఆర్‌ఎస్ సీనియర్ నేత టి. హరీశ్ రావు లేదా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని  బిజెపి తమవైపు ఆకర్షిస్తోందని, వారికి ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేసిందని వొస్తున్న కథనాలలో ఎలాంటి అధికారిక లేదా వాస్తవిక ఆధారం లేదు. ఇవన్నీ కేవలం సోషల్ మీడియాలో, కొన్ని మీడియా వర్గాలలో చక్కర్లు కొడుతున్న “రాజకీయ ఊహాగానాలు” మాత్రమే. వివిధ రాజకీయ పార్టీలు ప్రత్యర్థి పార్టీలను బలహీన పరిచేందుకు, అంతర్గత కలహాలను సృష్టించేందుకు ఇలాంటి ప్రచారాలను వాడుకోవడం సహజం. గతంలో బిజెపి లో  బీఆర్‌ఎస్ పార్టీ విలీనం అవుతుందని కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మ‌రది ఇప్ప‌టివ‌ర‌కు నిజం కాలేదు! ప్ర‌స్తుత‌ వార్త‌ల‌ను హ‌రీష్‌రావు తీవ్రంగా ఖండిస్తూ, బీజేపీలో చేరే ప్ర‌సక్తే లేద‌ని గతంలో పలుసార్లు  స్ప‌ష్టం చేసారు. ఇదే స‌మ‌యంలో ఆయా రాజ‌కీయ పార్టీల నేత‌లు ఈ క‌థనాల‌పై తీవ్రంగా స్పందించ‌డం గ‌మ‌నార్హం.

నిజం చెప్పాలంటే హరీశ్ రావు తరచుగా ముఖ్యంగా రేవంత్ రెడ్డి పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ రాజకీయ పోరాటం కొన‌సాగిస్తున్నారు. ప‌దునైన విమ‌ర్శ‌ల‌తో, గ‌ణాంకాల‌తో స‌హా రేవంత్ ప్ర‌భుత్వాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు తూర్పార‌ప‌డుతూ వొస్తున్నారు. బీఆర్ ఎస్ అంత‌ర్గ‌త స‌ర్వేల్లో కూడా త‌మ‌కు ప్ర‌జ‌ల్లో సానుకూల‌త ఉన్న‌ద‌న్న అంశం వెల్ల‌డికావ‌డంతో, కేటీఆర్‌, హ‌రీష్‌రావులు అధికార కాంగ్రెస్‌పై త‌మ దాడుల‌ను మ‌రింత ఉధృతం చేశారు. ఇక రేవంత్ విష‌యానికి వొస్తే ముఖ్య‌మంత్రిగా కాంగ్రెస్‌లో ఏక‌ఛ‌త్రాధిప‌త్యంగా అధికారాన్ని చ‌లాయిస్తున్నారు.  ప్రస్తుత రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఆయనకు ఎదురు  లేక‌పోవ‌డంతో, అధిష్టానం రేవంత్‌కు పూర్తి మ‌ద్ద‌తుగా నిలుస్తోంది. తెలంగాణ‌లో ఎటువంటి రాజ‌కీయ అస్థిర‌త లేకుండా స‌జావుగా పాల‌న సాగుతున్న స‌మ‌యంలో ప్ర‌చురిత‌మైన ఈ వార్తలను ప్రామాణికమైన రాజకీయ పరిణామాలుగా కాకుండా, కేవలం అంచనాలు మరియు ఊహాజనిత ప్రచారాలుగా ప‌రిగ‌ణించ‌క త‌ప్ప‌దు.

    ప్రజాస్వామ్యంలో సమాచారాన్ని, ప్రజల ఆలోచనలను శాసించడానికి వివిధ వర్గాలు వీటిని ఆయుధాలుగా వాడుకుంటుండ‌టం స‌హ‌జం. వీటి వెనుక కొన్ని ప్ర‌ధాన ల‌క్ష్యాలుంటాయి. ప్రత్యర్థి పార్టీ మద్దతుదారులలో లేదా సాధారణ ప్రజలలో గందరగోళాన్ని సృష్టించడం ఇందులో అనుస‌రించే వ్యూహం. ఒక బలమైన నాయకుడు (ఉదాహరణకు హరీశ్ రావు ) పార్టీ మారుతున్నారనే వార్త రాగానే, క్యాడర్‌లో మరియు వోటర్లలో నమ్మకం సడలుతుంది. ఇది ప్రత్యర్థి పార్టీని మానసికంగా దెబ్బతీస్తుంది. ఒక ముఖ్యమంత్రి లేదా కీలక నాయకుడు బిజెపితో టచ్‌లో ఉన్నారని ప్రచారం చేయడం ద్వారా, వారి సొంత పార్టీ హైకమాండ్ లేదా సహచరులు వారిని అనుమానించేలా చేయవొచ్చు. ఇది సదరు నాయకుడి పట్టును బలహీనపరుస్తుంది.
నిజమైన వార్తల కంటే సంచలన వార్తలకు ఆదరణ ఎక్కువ. కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు, సోషల్ మీడియా అకౌంట్లు మరియు వెబ్‌సైట్లు కేవలం వ్యూస్, లైక్స్ మరియు టీఆర్‌పీ రేటింగ్‌ల కోసమే ఇలాంటి థంబ్‌నెయిల్స్‌తో కథనాలను వండుతుంటాయి. ఇటువంటి క‌థ‌నాల వ‌ల్ల క‌లిగే మ‌రో ముఖ్య ప్ర‌యోజ‌న‌మేంటంటే పాఠకులలో, ప్రేక్షకులలో విపరీతమైన క్యూరియాసిటీ (ఆసక్తి) పెంచడం. రాజకీయాల్లో సంచలన కథనాలకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఇటువంటి “ఇన్‌సైడ్ స్టోరీస్” లేదా ఊహాగానాలు రాయడం ద్వారా  ఏదైనా ఒక‌ పత్రిక సర్క్యులేషన్, వెబ్‌సైట్ ట్రాఫిక్,  టీవీ ఛానెల్ రేటింగ్స్ పెరుగుతాయి. రాజ‌కీయాల్లో స‌రికొత్త చ‌ర్చ‌కు తెర‌లేప‌వొచ్చు.  అంతేకాదు అసెంబ్లీ సమావేశాల్లో లేదా ప్రెస్ మీట్లలో ఇతర పార్టీల నాయకులు దీనిపై మాట్లాడేలా చేయడం ద్వారా, రాజకీయ ఎజెండాను తామే నిర్దేశిస్తున్నామనే బలాన్ని వారు ప్రదర్శిస్తారు.
హ‌రీశ్‌రావు లేదా రేవంత్‌రెడ్డి వంటి బలమైన నాయకులు బీజేపీ వైపు చూస్తున్నారనే పుకారు సృష్టించ‌డంవ‌ల్ల బీఆర్‌ఎస్‌లో కేసీఆర్ మరియు కుటుంబ సభ్యులకు హరీశ్ రావుపై అనుమానాలు రేకెత్తించవొచ్చు. కాంగ్రెస్‌లో రేవంత్ రెడ్డి ప్రత్యర్థులు హైకమాండ్‌కు ఫిర్యాదు చేసే అవకాశం దొరుకుతుంది. ఈ రకమైన అభద్రతా భావం సృష్టించడం ద్వారా సదరు పార్టీలను స్వీయ ర‌క్ష‌ణ‌లోకి నెట్ట‌వొచ్చు. ఇదే స‌మ‌యంలో తెలంగాణలో బీజేపీని ఒకే ఒక్క ప్రత్యామ్నాయ శక్తిగా ప్రొజెక్ట్ చేయడం మ‌రో ల‌క్ష్యం. అధికారంలో ఉన్న సీఎంను లేదా ప్రధాన ప్రతిపక్ష నేతను ఆకర్షించే స్థాయిలో బీజేపీ హైకమాండ్ ఉందనే కలరింగ్ ఇవ్వడం ద్వారా, క్షేత్రస్థాయిలో బీజేపీ గ్రాఫ్ పెరుగుతోందనే అంచనాను  ప్రజల్లో కల్పించే వ్యూహం . కొన్నిసార్లు మీడియా సంస్థలు ఇటువంటి వార్తలను ఒక ‘ఎర’  లాగా వొదులుతాయి. ఈ వార్త బయటకు వొచ్చినప్పుడు సదరు నాయకులు  ఇచ్చే స్పందన, ఖండనల ఆధారంగా అసలు వారి అంతర్గత వ్యూహాలు ఏంటో గ్రహించడానికి మీడియాకు వీలవుతుంది. మొత్తంగా చూస్తే, ఇటువంటి కథనాల ద్వారా మీడియా పరంగా రేటింగ్స్, రాజకీయ పరంగా కింగ్ మేకర్ లేదా ఇన్‌ఫ్లుయెన్సర్ హోదా లభిస్తాయి.అంత‌కుమించి ఈ వార్త‌ల‌కు ప్రాధాన్య‌త‌లేదు.
నిజం చెప్పాలంటే తెలంగాణా జనబాహుళ్యంలో బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావు తరువాత అత్యంత ఆదరణ కలిగిన తన్నీరు హరీశ్ రావు  పార్టీకే అంకితమైన   నమ్మకమైన, నిబద్ధత గల “ట్రబుల్ షూటర్” (సమస్యలను పరిష్కరించే నాయకుడు) మరియు అంకితభావం కలిగిన కార్యకర్త అనడంలో ఎలాంటి సందేహం లేదు. పార్టీ ఆవిర్భావం నుండి నేటి వరకు కేసీఆర్ వెన్నంటి ఉంటూ ఆయన పోషించిన పాత్ర అద్వితీయమైంది. 2001లో టీఆర్‌ఎస్ పార్టీ స్థాపించినప్పటి నుండి కేసీఆర్ అడుగుజాడల్లో నడిచారు. పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు జరిగిన ఉప ఎన్నికలలో (ఉదాహరణకు నారాయణ్‌ఖేడ్, పాలేరు, దుబ్బాక, మునుగోడు) పార్టీ బాధ్యతలను భుజాన వేసుకుని వ్యూహాలు రచించారు. సాధారణ కార్యకర్త నుండి రాష్ట్ర స్థాయి నాయకుడి వరకు అందరికీ అందుబాటులో ఉంటూ, పార్టీలో ఎలాంటి అసంతృప్తి రాకుండా చూసుకోవడంలో ఆయన సిద్ధహస్తుడు. రాజకీయ ప్రత్యర్థులు కేసీఆర్ కుటుంబంలో విభేదాలు ఉన్నాయని, హరీశ్ రావుకు అన్యాయం జరుగుతోందని ఎన్నిసార్లు ప్రచారం చేసినా, ఆయన ఎప్పుడూ లక్ష్మణ రేఖ దాటలేదు. కేసీఆర్ తీసుకున్న ప్రతి నిర్ణయానికి కట్టుబడి, పార్టీ ఆదేశించిన ఏ బాధ్యతనైనా (మంత్రి పదవి అయినా, సాధారణ ప్రచార బాధ్యత అయినా) నమ్మకంగా నిర్వహించారు. గ‌తంలో ఎన్ని గాసిప్స్ లేదా పార్టీ మార్పు ప్రచారాలు (బీజేపీ లేదా ఇతర పార్టీల నుండి ఆఫర్లు) వొచ్చినా, హరీశ్ రావు బీఆర్‌ఎస్ పార్టీకి, కేసీఆర్ నాయకత్వానికి బ్రాండ్ అంబాసిడర్‌లా నిలిచారు.
హరీశ్ రావు బీజేపీలోకి వెళ్తున్నారని లేదా వారికి సీఎం ఆఫర్ వొచ్చిందని రాయడం ద్వారా హరీశ్ రావును రాజకీయంగా ఇరుకున పెట్టే వ్యూహం కావొచ్చు. తెలుగు దేశం పార్టీ కీ .. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీ అత్యంత సన్నిహితుడైన ఆ మీడియా సంస్థ యజమాని బీఆర్ఎస్ ను నిర్వీర్యం చేయడానికీ  ..ఆ పార్టీ అధినేత కె చంద్రశేఖర్ రావు ను బద్నామ్ చేయడానికి గతంలో అనేక సార్లు ఇటువంటి వార్తలు వండి వార్చారు. మాజీ మంత్రి హరీష్ రావు బిజెపి లోకి మారుతున్నారన్న ప్రస్తుత ఉహాగానాన్ని కూడా ఆ కోవలో చూడాల్సిందే ..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *