ఇథనాల్ ప్రధానంగా చెరకు, మొక్కజొన్న, ధాన్యాల నుండి ఉత్పత్తి అవుతుంది. భారతదేశంలో ప్రస్తుతం చెరకు ఆధారిత ఇథనాల్ ఉత్పత్తికే అధిక ప్రాధాన్యం ఉంది. అయితే చెరకు ప్రపంచంలో అత్యధిక నీరు అవసరమయ్యే పంటలలో ఒకటి. ఒక కిలో చెరకు ఉత్పత్తికి సగటున 1,500 నుంచి 2,500 లీటర్ల నీరు అవసరమవుతుంది. ఇప్పటికే మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలలో భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయిలో క్షీణిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఇథనాల్ డిమాండ్ పెరిగితే రైతులు మరింతగా చెరకు సాగు వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది.
దీని ఫలితంగా ఆహార పంటల విస్తీర్ణం తగ్గే ప్రమాదం ఉంది. బియ్యం, పప్పుధాన్యాలు, నూనెగింజల సాగు క్షీణిస్తే దేశ ఆహార భద్రత దెబ్బతినవొచ్చు. ఒకవైపు ప్రభుత్వం ఆహార ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు కష్టపడుతుంటే, మరోవైపు ఆహార పంటలను ఇంధన పంటలుగా మార్చడం ధరల పెరుగుదలకు దోహదం చేయవొచ్చు. అమెరికా, బ్రెజిల్ వంటి దేశాలలో కూడా ఫుడ్ వర్సెస్ ఫ్యూయల్ (Food versus Fuel) అనే చర్చ చాలాకాలంగా కొనసాగుతోంది. భారతదేశం కూడా అదే సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రమాదం లేకపోలేదు.
నీటి సమస్య మరింత తీవ్రమవడం మరో ప్రధాన ఆందోళన. ఇప్పటికే వాతావరణ మార్పుల ప్రభావంతో వర్షపాతం అస్థిరంగా మారుతోంది. భూగర్భ జలాలు క్షీణిస్తున్నాయి. చెరకు సాగు విస్తరించడం వల్ల వ్యవసాయ నీటి వినియోగం భారీగా పెరుగుతుంది. ఫలితంగా తాగునీటి అవసరాలు, పరిశ్రమల అవసరాలు, వ్యవసాయ అవసరాల మధ్య ఘర్షణలు పెరిగే అవకాశం ఉంది. తెలంగాణలోనే కొన్ని జిల్లాలలో ఇప్పటికే భూగర్భ జలాల మట్టాలు ఆందోళనకర స్థాయికి చేరుకున్నాయి. ఇలాంటి సమయంలో నీటిని అధికంగా వినియోగించే పంటలకు ప్రోత్సాహం ఇవ్వడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న తలెత్తుతోంది.
వాహన రంగంలో కూడా ఈ100 వినియోగం అంత సులభమైన విషయం కాదు. ప్రస్తుతం భారతదేశంలో నడుస్తున్న అధికశాతం వాహనాలు పెట్రోల్ లేదా ఈ20 మిశ్రమ ఇంధనాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించబడ్డాయి. 100 శాతం ఇథనాల్ కు అనుకూలమైన ప్రత్యేక ఇంజన్లు, ఇంధన సరఫరా వ్యవస్థలు అవసరం. ఇథనాల్ స్వభావతః తేమను ఆకర్షిస్తుంది. దీని వల్ల ఇంధన ట్యాంకులు, పైపులు, రబ్బరు సీల్స్, గ్యాస్కెట్లు త్వరగా దెబ్బతినే అవకాశం ఉంది.
పాత వాహనాల్లో ఈ100 వినియోగం వల్ల ఇంజిన్ భాగాల తుప్పు, ఇంధన పంపుల వైఫల్యం, ఫ్యూయల్ ఇంజెక్టర్ల సమస్యలు పెరిగే ప్రమాదం ఉందని ఆటోమొబైల్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫలితంగా వాహన యజమానులపై నిర్వహణ వ్యయాలు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే నిర్వహణ ఖర్చులతో ఇబ్బంది పడుతున్న రైతులు, చిన్న వ్యాపారులు మరింత భారాన్ని ఎదుర్కోవలసి రావొచ్చు.
అదేవిధంగా ఇథనాల్ లో ఇంధన సాంద్రత (Energy Density) పెట్రోల్ కంటే తక్కువ. అంటే ఒక లీటర్ ఇథనాల్ తో లభించే మైలేజ్ పెట్రోల్‌తో పోలిస్తే తక్కువగా ఉండవొచ్చు. ఇంధనం చౌకగా లభించినా, వినియోగం ఎక్కువైతే వినియోగదారుడికి లాభం ఎంతమేరకు ఉంటుందనే ప్రశ్న మిగులుతుంది.
ప్రభుత్వం చెబుతున్నట్లుగా ముడి చమురు దిగుమతులు తగ్గితే విదేశీ మారకద్రవ్య ఆదా అవుతుంది. రైతులకు కొత్త మార్కెట్ కూడా లభిస్తుంది. ఈ ప్రయోజనాలను పూర్తిగా తిరస్కరించడం సరికాదు. అయితే ఇథనాల్ విధానం విజయవంతం కావాలంటే ఆహార భద్రత, నీటి సంరక్షణ, పర్యావరణ సమతుల్యత, వాహన సాంకేతికత వంటి అంశాలను సమన్వయం చేయాలి.
చెరకు ఆధారిత ఇథనాల్ కంటే వ్యవసాయ వ్యర్థాలు, వరి గడ్డి, మొక్కజొన్న కాండాలు, జీవవ్యర్థాల నుండి తయారయ్యే రెండో తరం ఇథనాల్ కు ప్రాధాన్యత ఇవ్వాలి. నీటి వినియోగాన్ని కట్టడి చేసే విధానాలు తీసుకురావాలి. అలాగే ఈ100 వాహనాలపై పూర్తి స్థాయి సాంకేతిక అధ్యయనాలు చేసి, వినియోగదారులకు అదనపు భారం పడకుండా చూడాలి.
భారతదేశం ఇథనాల్ లో పూర్తిగా స్వయం సమృద్ధి సాధించలేదు. ముఖ్యంగా పారిశ్రామిక, రసాయన, పానీయాల తయారీ అవసరాల కోసం కొంత ఇథనాల్ ను దిగుమతి చేసుకుంటోంది.2024లో భారత్ సుమారు 600 మిలియన్ లీటర్ల (60 కోట్ల లీటర్లు) ఇథనాల్ ను దిగుమతి చేసుకుంది. ఇది 2023 తో పోలిస్తే దాదాపు 50 శాతం ఎక్కువ. పెట్రోలియం దిగుమతుల పై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ఇథనాల్ విధానాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నప్పటికీ, ఇథనాల్ ఉత్పత్తికి అవసరమైన చెరకు, మొక్కజొన్న, బియ్యం వంటి పంటలపై పెరుగుతున్న ఒత్తిడి, అలాగే పెరుగుతున్న ఇథనాల్ దిగుమతులు చూస్తే, ఇది దిగుమతి ఆధారిత సమస్యను ఒక రూపం నుంచి మరొక రూపానికి మార్చడమే తప్ప పూర్తిగా పరిష్కరించడం కాదనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
భారతదేశానికి ఇంధన స్వావలంబన అవసరమే. కానీ అది ఆహార భద్రతను, నీటి వనరులను, రైతుల భవిష్యత్తును పణంగా పెట్టి సాధించ కూడదు. ఇథనాల్ విధానం కేవలం ఇంధన ప్రత్యామ్నాయం మాత్రమే కాదు; అది వ్యవసాయం, పర్యావరణం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, వినియోగదారుల జీవితాలను ప్రభావితం చేసే సమగ్ర విధానం. అందుకే వేగం కంటే వివేకం, ప్రచారం కంటే శాస్త్రీయ పరిశీలన, లక్ష్యాల కంటే దీర్ఘకాలిక ప్రభావాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది.





