– కేంద్రానికి మంత్రి సీతక్క నిరసన లేఖ
– అట్టడుగు వర్గాల ప్రయోజనాలకు విఘాతం.. నిబంధనలు సవరించాలి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 20 : వీబీజీ రామ్‌జీ చట్టం గ్రామీణ పేదల ఉపాధి హక్కును బలహీనపరుస్తోందని, ఈ చట్టాన్ని ఉపసంహరించుకుని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం(ఎంజీఎనఆరఈజీఎస్)ను యథాతథంగా కొనసాగించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈమేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు మూడు వేర్వేరు లేఖలు రాసి రాష్ట్ర ప్రభుత్వ అభ్యంతరాలు, సూచనలను తెలియజేశారు. వీబీజీ రామ్‌జీ అమలుకు సంబంధించి కేంద్రం రూపొందించిన నిబంధనల్లో అనేక అంశాలు పేదలు, దళితులు, ఆదివాసీ గిరిజనులు, భూమి లేని గ్రామీణ కుటుంబాల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయన్నారు. ముఖ్యంగా నిధుల కేటాయింపును రాష్ట్రస్థాయిలో నిర్ణయించడం వల్ల గ్రామ పంచాయతీ స్థాయిలో ఉన్న వాస్తవ ఉపాధి అవసరాలు విస్మరణకు గురవుతున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, ములుగు, నాగర్‌కర్నూల్ వంటి వెనుకబడిన జిల్లాల్లో అధిక ఉపాధి అవసరాలు ఉన్నప్పటికీ రాష్ట్రాన్ని ఒకే యూనిట్‌గా పరిగణించడం వల్ల ఆ ప్రాంతాలకు అన్యాయం జరుగుతుందన్నారు. గ్రామ పంచాయతీల్లో గత ఐదేళ్లలో నమోదైన వాస్తవ పని దినాల ఆధారంగా నిధుల కేటాయింపునకు 80 శాతం ప్రాధాన్యం ఇవ్వాలని, ఆర్థిక సంఘం ప్రమాణాలకు 20 శాతం మాత్రమే వెయిటేజీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. నిధుల పంపిణీ, పనితీరు ప్రమాణాల విషయంలో కేంద్రానికి అపరిమిత అధికారాలు ఇవ్వడం చట్టం ఉద్దేశానికి విరుద్ధమని, రాష్ట్రాలతో సంప్రదింపుల అనంతరమే నిర్ణయాలు తీసుకోవాలని సూచించింది. ఇందిరమ్మ ఇండ్ల వంటి రాష్ట్ర పథకాలను వీబీజీ రామ్ జీ పరిధిలో చేర్చాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. ఎంజీఎనఆరఈజీఎస్‌లో గృహ నిర్మాణ లబ్ధిదారులకు 90 రోజుల ఉపాధి లభించేదని, కొత్త చట్టంలో ఆ అవకాశం తొలగిపోవడం వల్ల పేద కుటుంబాలు నష్టపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే వ్యవసాయానికి అనుసంధానంగా, వ్యక్తిగత భూ అభివృద్ధి పనులు, చిన్న రైతులు, ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉపయోగపడే జీవనోపాధి పనులను కూడా అనుమతించాలని కోరారు. వరదల వల్ల దెబ్బతిన్న భూముల పునరుద్ధరణ, కూరగాయల పందిళ్లు, పశుగ్రాస అభివృద్ధి, వెదురు తోటలు, న్యూట్రి గార్డెన్లు, వాతావరణ మార్పులను తట్టుకునే జీవనోపాధి పనులను అనుమతించాల్సిన అవసరం ఉందన్నారు. వీబీజీ రామ్ జీలో ప్రతిపాదించిన 60 రోజుల తప్పనిసరి ఉపాధి విరామాన్ని కూడా మంత్రి సీతక్క తీవ్రంగా వ్యతిరేకించారు. ఆదివాసీ గిరిజన ప్రాంతాలు, నీటి ఎద్దడి ప్రాంతాల్లో నివసించే కుటుంబాలకు ఉపాధి ప్రధాన జీవనాధారమని, 60 రోజులపాటు పనులు నిలిపివేయడం గ్రామీణ పేదల ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు. రాష్ట్రంలో పంటల వైవిధ్యీకరణ, ఏడాది పొడవునా సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో వ్యవసాయ అనుబంధ పనులకు నిరంతరంగా ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అడవులు, మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు వర్షాకాలంలోనే చేపట్టాల్సి ఉంటుందని, ఈ సమయంలో నిషేధం వల్ల వాటి అమలు దెబ్బతింటుందని పేర్కొన్నారు. ఆదివాసీ, నీటి ఎద్దడి మండలాలు, మొక్కల పెంపకం కార్యక్రమాలు, గృహ నిర్మాణ పనులకు 60 రోజుల ఉపాధి విరామం నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. గ్రామీణ పేదల ఉపాధి హక్కును కాపాడటం, గ్రామ పంచాయతీల అధికారాలను బలోపేతం చేయడం, దళితులు, గిరిజనులు, భూమిలేని కుటుంబాల జీవనోపాధిని రక్షించడం లక్ష్యంగా తమ ప్రభుత్వం ఈ సూచనలు చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం వీటిని సానుకూలంగా పరిశీలించి చట్టం, నిబంధనల్లో తగిన మార్పులు చేయాలని మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





