శాంతి ఒప్పందానికి ఇజ్రాయిల్ గండం!

అమెరికా-ఇరాన్‌ల మ‌ధ్య శాంతి ఒప్పందం కుదిరింద‌న్న ప్ర‌పంచ దేశాల ఆనందం లెబ‌నాన్‌పై ఇజ్రాయిల్ దాడుల‌తో ఒక్క‌సారిగా ఆవిరైపోయింది.  ఇజ్రాయిల్ వైఖ‌రితో తానీ ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపేస్తున్న‌ట్టు ఇరాన్ ప్ర‌క‌టించ‌డంతో మ‌ళ్లీ స‌మ‌స్య మొద‌టికొచ్చిన‌ట్ల‌యింది. ఇజ్రాయిల్‌ను క‌ట్ట‌డి చేయ‌డంలో ట్రంప్ యంత్రాంగం విఫ‌లం కావ‌డ‌మే తానీ నిర్ణ‌యం తీసుకోవ‌డానికి కార‌ణ‌మ‌ని ఇరాన్ స్ప‌ష్టం చేయ‌డంతో అమెరికా ప‌రిస్థితి రోట్లో త‌ల‌కాయ పెట్టిన చందంగా మారింది. ప్ర‌స్తుతం ట్రంప్ ఇజ్రాయిల్‌పై అసంతృప్తి వ్య‌క్తం చేయ‌డం త‌ప్ప మ‌రేం చేయ‌లేడు.  ఈ ఒప్పందంపై సొంత‌పార్టీ రిప‌బ్లిక‌న్ల‌లోనే వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది.

ఈ ఒప్పందం ఇజ్రాయెల్ భద్రతను ప్రమాదంలో పడేసిందని బిల్ కాసిడీ, రోజర్ విక్కర్ వంటి సెనేటర్లు బహిరంగంగానే ట్రంప్ నిర్ణయాన్ని విమర్శిస్తున్నారు.  రిపబ్లికన్ పార్టీకి ప్రధాన వోట్ బ్యాంక్ అయిన ‘ఇవాంజెలికల్ క్రిస్టియన్లు’ , సాంప్రదాయ ప్రొ-ఇజ్రాయెల్ వోటర్లు ట్రంప్ వైఖరిపై ఆగ్రహంగా ఉన్నారు. డెమోక్రాట్ల తరహాలోనే రిపబ్లికన్లు కూడా ఇజ్రాయెల్ కు వెన్నుపోటు పొడిచారనే భావన వోటర్లలో వోస్తే నవంబర్ ఎన్నికల్లో రిప‌బ్లిక‌న్ల‌కు భారీ న‌ష్టం వాటిల్ల‌క త‌ప్ప‌దు. అమెరికా రాజకీయాల్లో ఇజ్రాయెల్ అనుకూల లాబీ గ్రూపులు (ఏఐపీఏసీ వంటివి) రిపబ్లికన్ అభ్యర్థులకు పెద్ద ఎత్తున ఎన్నికల నిధులు సమకూరుస్తాయి. తాజా విభేదాల వల్ల ఈ నిధుల ప్రవాహం తగ్గే అవకాశం ఉంది.  “ఇరాన్ ఒప్పందానికి కట్టుబడి ఉండకపోతే ఇజ్రాయెల్ తన చివరి మిత్రుడిని (అమెరికా) కోల్పోతుంది” అని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన హెచ్చరిక, న‌వంబ‌ర్ ఎన్నిక‌ల్లో ట్రంప్‌కు కాస్తో కూస్తో ఉన్న  ఆశ‌ల‌ను పూర్తిగా ఆవిరిచేసింది.

అమెరికా-ఇరాన్ చర్చలు జరుగుతున్నప్పటికీ, లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగించడం వెనుక హిజ్బుల్లాను పూర్తిగా నిర్వీర్యం చేయడం, తన దేశ భద్రతను శాశ్వతంగా కాపాడుకోవడం ప్రధాన ల‌క్ష్యాలుగా ఉన్నాయి. కేవలం తాత్కాలిక కాల్పుల విరమణల వల్ల తమకు దీర్ఘకాలిక రక్షణ లభించదని ఇజ్రాయెల్ భావిస్తోంది. ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ సైనిక సామర్థ్యాన్ని, ఆయుధ సంపత్తిని, వారి నాయకత్వాన్ని పూర్తిగా దెబ్బతీయడం ఇజ్రాయెల్ ప్రాథమిక లక్ష్యం.  దక్షిణ లెబనాన్ లోని  ‘లిటాని నది’  వరకు హిజ్బుల్ దళాలను వెనక్కి నెట్టి, ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకుని ఒక బఫర్ జోన్ ను ఏర్పాటు చేసుకోవాలని ఇజ్రాయెల్ చూస్తోంది.

దక్షిణ లెబనాన్ లోని  నబతియే వంటి వ్యూహాత్మక ఎత్తైన ప్రాంతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలనన్న‌ది కూడా ఇజ్రాయెల్ సైన్యం ల‌క్ష్యం. శాంతి ఒప్పందం పూర్తిగా ఖరారు కానందువ‌ల్ల‌, తాము గాజా, సిరియా, లెబనాన్లలో స్వాధీనం చేసుకున్న ఏ ఒక్క ప్రాంతం నుంచి కూడా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి స్పష్టం చేయ‌డం ఆ దేశ ఉద్దేశాన్ని స్ప‌ష్టం చేస్తున్న‌ది. ఇరాన్ నుండి సిరియా మీదుగా లెబనాన్‌లోని హిజ్బుల్లాకు అందుతున్న ఆయుధ సరఫరా వ్యవస్థను పూర్తిగా నిలిపివేయడం ఇజ్రాయెల్ వ్యూహం.  హిజ్బుల్లా పదేపదే కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ తమ భూభాగాలపైకి రాకెట్లు, డ్రోన్లు ప్రయోగిస్తోందని, అందువల్లే తాము ప్రతి దాడులు చేస్తున్నామని ఇజ్రాయెల్ సైన్యం (ఐడీఎఫ్) వాదిస్తోంది. ఇజ్రాయెల్ చర్యల వల్ల అమెరికా-ఇరాన్ ఒప్పందానికి ముప్పు వాటిల్లుతున్నప్పటికీ, తమ దేశ భద్రత విషయంలో అంతర్జాతీయ ఒత్తిళ్లకు లొంగబోమని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేయ‌డం గ‌మ‌నార్హం.

ఏదోవిధంగా ఈ యుద్ధం ఊబి నుంచి బయటపడాలనుకున్న ట్రంప్ ప్రభుత్వానికి తాజా పరిణామం ఆశనిపాతం వంటిదే. ఈ సంక‌ట స్థితినుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ట్రంప్ యంత్రాంగం తక్షణం కొన్ని చర్యలకు ఉపక్రమించక తప్పదు. ముందుకుగా లెబనాన్ లో సైనిక చర్యలను పరిమితం చేయాలని లేదా తాత్కాలికంగా ఆపాలని ఇజ్రాయెల్ పై ఒత్తిడి తేవడం. చర్చలు పూర్తిగా విఫలం కాకుండా చూసేందుకు, స్విట్జర్లాండ్ వేదికగా ఇరాన్ ప్రతినిధులతో  తెరవెనుక రాయబారాలు నెరపడం. ఇరాన్ గనుక చర్చల నుండి పూర్తిగా వైదొలిగితే, హర్మూజ్ జలసంధిపై తిరిగి ఆంక్షలు, నౌకాదళ నిఘాను కఠినతరం చేస్తామని  హెచ్చరించడం. ఈ సంక్షోభాన్ని చల్లబరిచేందుకు సౌదీ అరేబియా, ఖతార్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వంటి అరబ్ దేశాల మధ్యవర్తిత్వాన్ని కోరడం. లెబనాన్ శరణార్థుల సంక్షోభం మరింత పెరగకుండా చూసేందుకు ఐక్యరాజ్యసమితి (ఐరాసా) ద్వారా తక్షణ సాయాన్ని ప్రకటించడం. మధ్యప్రాచ్యంలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలు, దౌత్య కార్యాలయాలపై ఇరాన్ మద్దతుదారుల నుండి దాడులు జరగకుండా రక్షణను కట్టుదిట్టం చేయడం వంటి చ‌ర్య‌లు తీసుకోవొచ్చు.

ఇక ఇరాన్ పరంగా ఆలోచిస్తే  లెబనాన్ , గాజాలలో ఇజ్రాయెల్ దాడులు పూర్తిగా ఆపితేనే అమెరికాతో శాంతి చర్చలు ముగింపు దశకు వొస్తాయని గట్టిగా డిమాండ్ చేయవొచ్చు. ఇజ్రాయెల్ దాడులను తిప్పికొట్టడానికి లెబనాన్‌లోని హిజ్బుల్లాకు మరియు యెమెన్లోని హౌతీలకు ఇరాన్ ఆయుధ, ఆర్థిక సహాయాన్ని మరింత పెంచవొచ్చు. చర్చలు పూర్తిగా విఫలమైతే, ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధిని  మళ్లీ మూసివేస్తామని ఇరాన్ బెదిరించవొచ్చు. అమెరికా పై ఒత్తిడి పెంచేందుకు ఇరాన్ చైనా, రష్యా మరియు యూరోపియన్ యూనియన్ దేశాలతో దౌత్యపరమైన సంప్రదింపులు త‌ప్ప‌క జ‌రుపుతుంది. ఒప్పందం కుదరని పక్షంలో, తమ అణు ఇంధన శుద్ధీకరణ  ప్రక్రియను తిరిగి వేగవంతం చేస్తామని ఇరాన్ బెదిరించే అవ‌కాశాలూ లేక‌పోలేదు.

అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న చర్చలు,  అంతర్జాతీయ ఒత్తిళ్లను పక్కన పెట్టి, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తన దేశ భద్రతే లక్ష్యంగా అత్యంత దూకుడుగా ముందుకు వెళ్లే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. అమెరికా-ఇరాన్ ఒప్పందం తాత్కాలికంగా ఆగిన సమయాన్ని అనుకూలంగా మార్చుకుని, లెబనాన్ లోని  హిజ్బుల్లా కమాండర్లు, ఆయుధ డిపోలపై ఇజ్రాయెల్ వైఖరిని మరింత కఠినతరం చేస్తుంది. దక్షిణ లెబనాన్, గాజా మరియు సిరియాలలో తాము స్వాధీనం చేసుకున్న ఏ ఒక్క వ్యూహాత్మక ప్రాంతం నుండి కూడా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. డోనాల్డ్ ట్రంప్ యంత్రాంగంతో నేరుగా చర్చలు జరిపి, ఇరాన్ కు ఎలాంటి ఆర్థిక సడలింపులు లేదా ఆంక్షల తొలగింపులు ఇవ్వకుండా అడ్డుకోవడం, అంతర్జాతీయ న్యాయస్థానాలు లేదా ఐక్యరాజ్యసమితి విధించే కాల్పుల విరమణ ఒత్తిళ్లను భద్రతా కారణాల రీత్యా తోసిపుచ్చడం వంటి చ‌ర్య‌ల‌తో పాటు ఇజ్రాయెల్లో తన రాజకీయ పట్టును, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి శత్రువులను పూర్తిగా లొంగదీసుకునే వరకు యుద్ధం కొనసాగుతుందని బెంజ‌మిన్ నెత‌న్యాహు ప్రకటించక మాన‌రు.  అమెరికా ఇరాన్ పై నౌకాదళ దిగ్బంధనాన్ని ఎత్తివేయడం హర్మూజ్లో  నేవీ దిగ్బంధాన్ని అమెరికా ఎత్తేయడాన్ని,  ఆర్థిక ఆంక్షలను సడలించేందుకు సిద్ధమవ్వడం ఇజ్రాయెల్ కు సుత‌రామూ ఇష్టంలేదు. ఇరాన్‌ను ఆర్థికంగా బలోపేతం చేయడం తమ భద్రతకు ముప్పని భావిస్తున్న ఇజ్రాయిల్ సైన్యం, లెబనాన్ సరిహద్దుల్లో కాల్పుల విరమణపై అమెరికా చేస్తున్న ప్రతిపాదనలను పక్కనబెట్టి దక్షిణ లెబనాన్ లో 10 కిలోమీటర్ల మేర బఫర్ జోన్ ఏర్పాటు కోసం ఏకపక్షంగా దాడులు కొనసాగిస్తోంది. ఈ వ్యూహాత్మక విభేదాల వల్ల దశాబ్దాలుగా ఉన్న అమెరికా-ఇజ్రాయెల్ మిత్రబంధంలో మునుపెన్నడూ లేని విధంగా అపనమ్మకాలు చోటుచేసుకున్నాయి.

అమెరికా-ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న విభేదాలు ఇరాన్ కు అంతర్జాతీయ వేదికపై పెద్ద ఎత్తున దౌత్యపరమైన, వ్యూహాత్మక ప్రయోజనాలను చేకూరుస్తున్నాయి. తమను ఒంటరిని చేయాలని చూసిన శత్రువుల మధ్యే విభేదాలు రావడం ఇరాన్ కు రాజకీయంగా కలిసి వొస్తోంది. అమెరికాతో అవగాహన ఒప్పందం  పై సంతకం చేయడం ద్వారా తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని, ఇజ్రాయెల్ దూకుడు వల్లే శాంతి ప్రక్రియ ఆగిపోయిందని ప్రపంచ దేశాల ముందు ఇరాన్ నిరూపించగలిగింది. లెబనాన్, గాజాలపై ఇజ్రాయెల్ జరుపుతున్న ఏకపక్ష దాడుల వల్ల ఐరోపా స‌మాజం, ఐక్యరాజ్యసమితిలో ఇజ్రాయెల్ ఒంటరి అవుతుండగా, ఇరాన్ పట్ల దౌత్యపరమైన సానుభూతి పెరుగుతోంది. అమెరికా-ఇజ్రాయెల్ కూటమి బలహీనపడటాన్ని వాడుకుని చైనా, రష్యాలతో ఇరాన్ తన ఆర్థిక, సైనిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం ఇజ్రాయెల్ వైఖరిపై అసంతృప్తితో ఉండటం వల్ల  భవిష్యత్తు చర్చల్లో అమెరికా నుండి మరిన్ని ఆర్థిక సడలింపులు సాధించడానికి ఇరాన్ కు బలం చేకూరింది. ఇజ్రాయెల్ చర్యలపై సౌదీ అరేబియా, యూఏఈ వంటి అరబ్ దేశాలు కూడా అసంతృప్తిగా ఉండటంతో, ఆయా దేశాలతో ఇరాన్ తన దౌత్య సంబంధాలను మెరుగుపరుచుకునే అవకాశం దక్కింది. ఈ విభేదాల వల్ల ఇరాన్ ఒకవైపు తన “యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్” (హిజ్బుల్లా, హౌతీలు) నెట్ వ‌ర్క్ ను కాపాడుకుంటూనే, మరోవైపు అమెరికాతో చర్చల్లో పైచేయి సాధించే వ్యూహాన్ని అమలు చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *