వైభవంగా యోగా 1డే కౌంట్ డౌన్ ఈవెంట్

– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో విశేష స్పందన
– హాజరైన గవర్నర్ శివప్రతాప్ శుక్లా, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 20 : అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర బొగ్గు, గనుల మంత్రిత్వ శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పŸరేడ్ గ్రౌండ్‌లో 1డే కౌంట్ డౌన్ ఈవెంట్ శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా, మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొని యోగాసనాలు వేశారు. సరిగ్గా 24 గంటల ముందు 1డే కౌంట్‌డౌన్ పేరుతో హైదరాబాద్‌లో గత ఏడు సంవత్సరాలుగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా 20వ తేదీ ఉదయం గ్రౌండ్స్‌లో పెద్ద ఎత్తున యోగా మహోత్సవాన్ని అద్భుతంగా నిర్వహించామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర నలుమూలల నుండి చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అందరూ ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా, సంతోషంగా కలిసికట్టుగా వేలాదిమంది పాల్గొన్నారున్నారు. ప్రాంగణమంతా యోగా సాధకులతో కిక్కిరిసిపోయింది.

యోగా ఒక మతానికి పరిమితం కాదు : వెంకయ్య నాయుడు 

యోగాను ఏదో ఒక మతానికి పరిమితం చేసి చూడటం మÖర్ఖత్వమే అవుతుందని, అది సర్వమానవ సౌభ్రాతృత్వానికి, విశ్వశాంతికి దోహదపడే అద్భుత సాధనమని మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు చెప్పారు. మన పూర్వీకులు ఎంతో పరిశోధించి, రంగరించి మానవాళికి అందించిన ఒక పరిపూర్ణ జీవన విధానం ఇది అని అన్నారు. భారత దేశం విశ్వగురువుగా నిలవడానికి మన సంస్కృతి, సంప్రదాయాలే కారణమంటూ ప్రపంచానికి మన దేశం అందించిన అత్యంత గొప్ప, అపురూపమైన కానుక యోగా అని పేర్కొన్నారు. నేడు ప్రపంచం మొత్తం పాశ్చాత్య సంస్కృతి వ్యామోహంలో పడి కొట్టుమిట్టాడుతోన్న సమయంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి యోగా ఒక్కటే శరణ్యమని ఆయన చెప్పారు. యోగా అనేది కొన్ని శారీరక ఆసనాలు మాత్రమే కాదు.. అది మనిషిని సమగ్రమైన, సంపూర్ణమైన వ్యక్తిగా తీర్చిదిద్దుతుందన్నారు. మానవ చైతన్యానికి నిదర్శనమైన యోగా ద్వారా సర్వతోముఖాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. నేటి ఆధునిక కాలంలో మనుషులను పీడిస్తున్న మానసిక ఒత్తిడిని దూరం చేసి గుండె నిండా స్థైర్యాన్ని, ఆధ్యాత్మిక భావనను పెంపొందించే శక్తి యోగాకు ఉందని, ఆరోగ్యమే మహాభాగ్యం అనే నానుడిని నిజం చేయాలంటే ప్రతి ఒక్కరూ ప్రకృతి ఒడిలో జీవించడం అలవాటు చేసుకోవాలని, నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని వెంకయ్య సూచించారు.

యోగా ఒక దివ్య ఔషధం : బండారు దత్తాత్రేయ   

యోగా సాధన ద్వారా మానసిక దృఢత్వానికి సామాజిక ఆవశ్యకత గురించి వివరించారు యోగా అనేది అందరినీ ఏకం చేసే ఒక అద్భుత సాధనం. ఇందులో ఎలాంటి సామాజిక భేదభావాలు, కులమతాల పట్టింపులు ఉండవు. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవన విధానంలో ఒక భాగంగా చేసుకోవాలి. ఇది సమాజంలో సమరసతను పెంపొందిస్తుంది. యోగా అంటే శారీరక వ్యాయామం మాత్రమే కాదు.. అది మనసును, బుద్ధిని ప్రశాంతంగా, ధృఢంగా ఉంచే ఒక గొప్ప మార్గం. మారుతున్న కాలంలో ఒత్తిడిని అధిగమించి, సరైన నిర్ణయాలు తీసుకునే మానసిక స్థైర్యాన్ని యోగా మనకు ప్రసాదిస్తుంది. యోగా అనేది జీవితాన్ని సంపూర్ణంగా జీవించేలా నేర్పే ఒక విశిష్టమైన కళ. అదే సమయంలో నిత్యం ఎదురయ్యే అనారోగ్య సమస్యల నుండి మనల్ని కాపాడే ఒక దివ్యమైన మందు (ఔషధం) లాంటిది. శారీరక దృఢత్వానికి, మానసిక ప్రశాంతతకు యోగాను మించిన ప్రత్యామ్నాయం లేదు.

ప్రపంచ యోగా వేదికపై భారత్ – ఐక్యరాజ్య సమితి గుర్తింపు   

భారత దేశానికి చెందిన అత్యంత ప్రాచీనమైన, విశిష్టమైన యోగాను ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ వేదికపై పరిచయం చేసి అంతర్జాతీయ స్థాయిలో విశేష ప్రచూర్యం కల్పించారని కిషన్‌రెడ్డి అన్నారు. ఆయన చొరవతోనే ఐక్య రాజ్యసమితి అధికారికంగా జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. ఇది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆదివారం కోల్‌కతాలో కేంద్ర ప్రభుత్వం ఘనంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక యోగా వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా పాల్గొనబోతున్నారు. గత 12 ఏళ్లుగా పశ్చిమ బెంగాల్‌లో ఇంతటి భారీస్థాయిలో అధికారిక యోగా వేడుకలు జరగలేదు. ఈసారి అక్కడ నిర్వహించడం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. యోగా పట్ల ప్రజల్లో అవగాహన పెంచేందుకు గత కొన్నేళ్లుగా‘24 గంటల ముందస్తు కౌంట్‌డౌన్ కార్యక్రమాలను మనం విజయవంతంగా నిర్వహిస్తున్నాం. యోగా అనేది కేవలం ఒక్కరోజు వేడుక కాదు.. నిరంతర ఆరోగ్య సాధన. దేశ ప్రజలందరూ సంపూర్ణ ఆరోగ్యంతో, ఆనందంగా ఉండాలనేదే కేంద్ర ప్రభుత్వ సంకల్పం. ప్రతి ఒక్కరూ యోగాను కేవలం ఒక వ్యాయామంగా కాక తమ దైనందిన జీవన విధానంలో ఒక భాగంగా చేసుకోవాలి. అప్పుడే ఆరోగ్యకరమైన, దృఢమైన భారతదేశ నిర్మాణం సాధ్యమవుతుంది.

విద్యార్థులకు యోగ అవశ్యం : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు   

భారతదేశ ప్రాచీన జీవన విధానంలో ఒక భాగమైన యోగా విశిష్టతను, దాని ప్రాధాన్యతను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ దేశాలన్నింటికీ పరిచయం చేసి విశ్వవ్యాప్త గుర్తింపు తెచ్చారు. శారీరక దృఢత్వానికి, మానసిక ప్రశాంతతకు, ఆధ్యాత్మిక ఉన్నతికి యోగా ఒక నిలయం వంటిది. మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండటానికి యోగ సాధన ఎంతో అవసరం. విద్యార్థులకు అత్యంత ఆవశ్యకం నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు తీవ్రమైన శారీరక, మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. విద్యార్థులు తమ ఒత్తిడిని నియంత్రణలో ఉంచుకుని, ఏకాగ్రతను పెంపొందించుకోవడానికి యోగాసనాలు అత్యంత కీలకమైన సాధనంగా ఉపయోగపడతాయి.

ప్రాచీన సంస్కృతికి ప్రతీక యోగా : ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ 

యోగ అనేది భారత దేశం ప్రపంచానికి అందించిన అత్యంత విలువైపన సంపద. మన దేశ గొప్పదనాన్ని, ప్రాచీన సంస్కృతిని విశ్వవ్యాప్తం చేయడంలో యోగా కీలక పాత్ర పోషించింది. ప్రాచీన సంస్కృతిలో భాగం యోగా అనేది కేవలం ఈనాటి వ్యాయామం కాదు, అది మన పూర్వీకులు జీవన విధానంలో భాగంగా ఆచరించిన అత్యంత ప్రాచీన సంస్కృతి, సాంప్రదాయం. నేటి ఆధునిక కాలంలో ప్రతి ఒక్కరికీ శారీరక ఆరోగ్యంతోపాటు ఆధ్యాత్మిక చింతన కూడా ఎంతో అవసరం. మానసిక ప్రశాంతతను అందిస్తూ, మనిషిని అంతర్గతంగా దృఢపరిచే శక్తి ఒక్క యోగాకే ఉంది. దీనిని ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో భాగం చేసుకోవాలి.

యోగాసనాలు అత్యంత అవసరం: మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్

భారత దేశ ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలలో యోగా ఒక భాగం. నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాతే మన దేశ సంపదైన యోగాను ప్రపంచ దేశాలన్నింటికీ పరిచయం చేశారు. నేడు ప్రపంచవ్యాప్తంగా యోగా వేడుకలను ఘనంగా జరుపుకోవడం ప్రతి భారతీయుడికి ఎంతో సంతోషాన్నిచ్చే విషయం. యువతకు శారీరక, మానసిక దృఢత్వానికి యోగ అవసరం. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంది. నేటి యువత మానసికంగా ప్రశాంతంగా, శారీరకంగా దృఢంగా ఉండాలంటే నిత్యం యోగాసనాలు వేయడం ఎంతో అవసరం. యువత ఒత్తిడిని అధిగమించి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారేందుకు యోగా ఒక అద్భుత సాధనంగా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరూ యోగాను అలవాటు చేసుకుని ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించాలి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *