– పేదల ముంగిటకే ‘ప్రజాపాలన’
– అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
– ఈ నెలాఖరుకు రెండో విడత మంజూరు
– 35 రోజుల్లోనే సాదా బైనామా సమస్యల పరిష్కారం
– గువ్వలగూడెం ‘ప్రజాదర్బార్’లో మంత్రి పొంగులేటి
నేలకొండపల్లి, ప్రజాతంత్ర, మే 6 : రాష్ట్రంలో పేదల సంక్షేమం, రైతుల అభ్యున్నతే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తోందని, ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవస్థలు లేకుండా పాలనను నేరుగా వారి గడప వద్దకే తీసుకొచ్చాం అని రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం గువ్వలగూడెం గ్రామంలో బుధవారంనిర్వహించిన ప్రజాపాలన – ప్రజాదర్బార్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎంపీ రఘురాంరెడ్డి, కలెక్టర్ దివాకరతో కలిసి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.
రైతు పక్షపాతి మన ప్రభుత్వం
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం వల్ల రైతాంగం అనేక ఇబ్బందులు ఎదుర్కొందని విమర్శించారు. నాడు వరి వేస్తే ఉరి అన్న పరిస్థితి ఉండేది.. కానీ నేడు ప్రతి గింజనూ మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నాం.. సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 అదనపు బోనస్ ఇస్తున్నాం అని వివరించారు. ఇప్పటికే రూ.21 వేల కోట్ల రుణ మాఫీతో 25 లక్షల మంది రైతులకు విముక్తి కల్పించామని, రైతు భరోసా కింద ఎకరానికి రూ.12 వేల సాయం అందిస్తున్నామని చెప్పారు.
సొంతింటి కల సాకారం
ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఇళ్లు లేని నిరుపేదలకు గృహ కల్పన చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పునరుద్ఘాటించారు. ఇప్పటికే పెద్ద ఎత్తున ఇళ్లు మంజూరు చేశాం. ఈ నెలాఖరుకు రెండో విడత ఇళ్లను మంజూరు చేస్తాం అని ప్రకటించారు. భూ సమస్యలను ‘భూ భారతి’ ద్వారా ప్రక్షాళన చేస్తున్నామని, పెండింగ్‌లో ఉన్న సాదా బైనామా దరఖాస్తులను రాబోయే 35 రోజుల్లో ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
మహిళా సాధికారతే లక్ష్యం
రాష్ట్రంలోని కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్నదే ప్రభుత్వ సంకల్పమని మంత్రి తెలిపారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం, సన్న బియ్యం సరఫరా వంటి పథకాలు పేద కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నాయని అన్నారు. ప్రజాదర్బార్‌లో అందిన ప్రతి న్యాయబద్ధమైన దరఖాస్తును గరిష్టంగా మూడు నెలల వ్యవధిలో పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీవో శ్రీనివాస్, తహసీల్దార్ రాంప్రసాద్, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





