– ప్రభుత్వం, గూగుల్ సహకారం అందిస్తాయి
– స్టార్టప్‌ల కోసం రూ.1000 కోట్ల ఫండ్ ఏర్పాటు చేస్తాం
– టీ-హబ్‌లో గూగుల్ స్టార్టప్ ప్రారంభెత్సవంలో సీఎం రేవంత్
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 10: ప్రొడక్ట్ బేస్డ్ స్టార్టప్స్, ఇన్నోవేటివ్ స్టార్టప్స్, ఐపీ ఇంటెన్సివ్ స్టార్టప్స్ పౖౖెనే హైదరాబాద్ దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. టీ హబ్‌లో బుధవారం జరిగిన గూగుల్ స్టార్టప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. హైదరాబాద్ కేవలం స్టార్టప్ హబ్‌గా ఎదగడమే కాదు.. ఆ కంపెనీలు యూనికార్న్ కంపెనీలుగా ఎదగాలని కోరుకుంటున్నానన్నారు. హైదరాబాద్ నుంచి కనీసం వంద స్టార్టప్‌లు యూనికార్న్ కంపెనీలుగా ఎదగాలి.. అంటే కనీసం బిలియన్ డాలర్ల విలువ కలిగిన కంపెనీలుగా ఎదగాలి.. 2034 నాటికి వాటిల్లో కనీసం 10 సూపర్ యూనికార్న్ కంపెనీలుగా ఎదగాలి అని ఆకాంక్షిస్తున్నానన్నారు. అందుకోసం రాష్ట్రంలో ఒక మంచి ఎకోసిస్టమ్‌ను సృష్టించాలనుకుంటున్నామని చెప్పారు. హైదరాబాద్‌లో ఉన్న అగ్రస్థాయి స్టార్టప్స్‌లో గూగుల్ ఒకటి. మీరు యువకులు, శక్తివంతులు.. సాధారణంగా మీరు మీ కలలను సాకారం చేసుకోవాలనుకుంటారు. ఈ సందర్భంగా మీకు స్పూర్తిని కలిగించే ఒక విషయం చెబుతా.. ఉన్నత ఆశయాలతో 1998లో ఇద్దరు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ మిత్రులు కలిసి కాలిఫోర్నియాలో ఒక గ్యారేజీలో ఓ స్టార్టప్‌ను ప్రారంభించారు. అదే నేటి ప్రఖ్యాత గూగుల్ కంపెనీగా అవతరించిందన్నారు. తెలంగాణ భవిష్యత్ అభివృద్దిని ఆకాంక్షించి ప్రపంచానికి తెలంగాణ బ్రాండ్‌ను పరిచయం చేయాలని రెండు రోజులపాటు తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్‌ను నిర్వహించామని తెలిపారు. 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్లు ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. 20 ఏళ్ల క్రితం ప్రారంభించిన అనేక స్టార్ట్ అప్స్ నేడు బిలియన్ల డాలర్ల కంపెనీలుగా ఎదిగాయంటూ గూగుల్, ఆపిల్, అమెజాన్, టెస్లా, ఫేస్బుక్ ఇలాంటివి గొప్ప ఉదాహరణలు ఎన్నో ఉన్నాయని సీఎం అన్నారు. గత పాతికేళ్లల్లో సాఫ్ట్వేర్ సర్వీసెస్, ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో హైదరాబాద్‌లో చాలా స్టార్టప్స్ పెద్ద కంపెనీలుగా ఎదిగాయన్నారు. తెలంగాణ రైజింగ్ విజన్ స్టార్టప్స్ కోసం మీ ప్రణాళికలు ఏంటని అడిగితే స్టార్ట్ అప్ని ఫుట్‌బాల్ ఆటతో పోల్చుతా.. తాను ఆ ఆట ఆడతాను. ఫుట్‌బాల్‌లో సమష్టి కృషి అవసరం. పట్టుదలతో సాధన చేయాలి. ఇది టీమ్ వర్క్. కానీ చివరకు గెలుపు చాలా ముఖ్యం. స్టార్టప్స్ కూడా అదేవిధంగా ఉండాలి అని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం, గూగుల్ మీకు అవసరమైన సహకారం అందించడానికి సిద్దంగా ఉన్నాయన్నారు. స్టార్టప్‌ల కోసం తమ ప్రభుత్వం రూ.1000 కోట్లతో ఫండ్ ఏర్పాటు చేస్తుందని, దాని వినియోగించుకుని తద్వారా స్టార్టప్‌లు గూగుల్ స్థాయిలో లేదా 1 బిలియన్ డాలర్ల కంపెనీగా ఎదగాలని కోరుకుంటున్నామన్నారు.
యూనివర్సిటీల్లో ‘ఇంక్యూబేషన్’ సెంటర్లు :మంత్రి శ్రీధర్‌బాబు
కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ యూనివర్సిటీల్లో ఇంక్యూబేషన్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడిరచారు. తెలంగాణను ‘గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్’గా మార్చాలనే లక్ష్య సాధనలో తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్, లైఫ్ సైన్సెస్ హబ్ ‘వన్ హబ్’కు దీటుగా ఈ కేంద్రాలను తీర్చిదిద్దుతామన్నారు. టీ హబ్‌లో గూగుల్ ఫర్ స్టార్టప్స్ హబ్‌ను సీఎం రేవంత్‌తో కలిసి ఆయన లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ తాము స్టార్టప్‌లను కేవలం చిన్న కంపెనీలుగా మాత్రమే చూడటం లేదని, సమాజం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు వినూత్న పరిష్కారాలు అందిస్తూ కొత్త ఉద్యోగాలను సృష్టించే ‘ఎకనామిక్ ఇంజిన్స్’గా చూస్తున్నామన్నారు. 2024లో ఇక్కడి స్టార్టప్‌లు 571 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించాయన్నారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 160 శాతం అధికమని వివరించారు. ముఖ్యంగా హెల్త్ టెక్ రంగంలో 2,139 శాతం వృద్ధి నమోదైందన్నారు. మహిళా నేతృత్వంలోని స్టార్టప్‌లలో హైదరాబాద్ దేశంలోనే ఆరో స్థానంలో ఉందన్నారు. 531 వుమెన్ లెడ్ స్టార్టప్ లు 417 మిలియన్ డాలర్లను సమీకరించాయన్నారు. ఇవి గణాంకాలు మాత్రమే కాదని.. తమ ప్రభుత్వ పనితీరుకు, ప్రగతిశీల విధానాలకు నిలువెత్తు నిదర్శనమన్నారు. తమ ప్రభుత్వం టెక్నాలజీని టూల్‌గా మాత్రమే చూడటం లేదని, ఒక సమానత్వ సాధనంగా చూస్తోందని చెప్పారు. కొత్త ఆలోచనలకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని యువ ఆవిష్కర్తలకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్పెషల్ సీఎస్ సంజయ్ కుమార్, భవేశ్ మిశ్రా, గూగుల్ ఇండియా కంట్రీ మేనేజర్ ప్రీతీ లోబనా, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





