నిమిషాల్లో డిజిపి చిత్రపటం గీసిన గురుకుల పాఠశాల 9వ తరగతి విద్యార్థి

*నాగర్ కర్నూల్ కు చెందిన విద్యార్థి ప్రతిభకు డిజిపి ప్రశంసలు*

గ్లోబల్ సమ్మిట్ ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లను మంగళవారం నాడు రాష్ట్ర డిజిపి  బి. శివధర్ రెడ్డి పర్యవేక్షిస్తుండగా ఆసక్తికరమైన సంఘటన జరిగింది. భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తున్న క్రమంలో అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పర్యవేక్షిస్తున్నప్పుడు, ఓ గురుకుల పాఠశాల విద్యార్థి తన ప్రతిభను ప్రదర్శించి డిజిపి ప్రశంసలు పొందాడు.వివిధ ప్రాంతాల్లోని బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న డిజిపి స్టాల్స్ ఏర్పాటు చేసిన ప్రాంతంలోకి వొచ్చారు. ఈ సందర్భంగా, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థులు ఏర్పాటు చేసిన ఫైన్ ఆర్ట్స్ స్టాల్ ఆయన దృష్టిని ఆకర్షించింది. ఆ స్టాల్ వద్ద ఉన్న ఓ తొమ్మిదో తరగతి విద్యార్థి డిజిపి  బి. శివధర్ రెడ్డిని చూసి వెంటనే స్పందించాడు. ఆ విద్యార్థి పేరు ఎ. భగవేందర్. డిజిపి మాట్లాడిన తర్వాత అతడు ఉత్సాహంగా ముందుకు వొచ్చి, “సార్, మీ చిత్రపటాన్ని ఇప్పుడే గీసి ఇస్తాను,” అని వినయంగా కోరాడు.బాలుడి ఉత్సాహాన్ని గమనించిన డిజిపి వెంటనే అంగీకరించారు.అనంతరం కొన్ని నిమిషాల పాటు భగవేందర్‌ ఎదురుగా డిజిపి కూర్చున్నారు. పోలీసు ఉన్నతాధికారి తన ముందు కూర్చుండగా, బాలుడు భగవేందర్ ఏ మాత్రం బెరుకు లేకుండా తన చిత్రకళా నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. అత్యంత ఏకాగ్రతతో డిజిపి ముఖ కవళికలను, రూపాన్ని పరిశీలిస్తూ కేవలం నిమిషాల వ్యవధిలోనే ఆయన చిత్రపటాన్ని అద్భుతంగా గీసి పూర్తి చేశాడు. ఆ పోర్ట్రెయిట్‌లో డిజిపి  శివధర్ రెడ్డి రూపం ఉన్నట్లుగా రూపుదిద్దుకోవడం అక్కడ ఉన్న వారందరినీ అబ్బురపరిచింది. నాగర్ కర్నూల్ జిల్లా, ఎతం గ్రామానికి చెందిన రాజు, అనితల కుమారుడైన ఎ. భగవేందర్, ప్రస్తుతం ఘట్కేసర్‌లో ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల ఫైన్ ఆర్ట్స్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. నిమిషాల్లో బాలుడు గీసిన తన చిత్రపటాన్ని పరిశీలించిన డీజీపీ  బి. శివధర్ రెడ్డి, ఆ బాలుడి ప్రతిభకు సంతోషం వ్యక్తం చేశారు. తొమ్మిదో తరగతి చదువుతూ, ఇంతటి కళా నైపుణ్యాన్ని ప్రదర్శించడం పట్ల ఆయన భగవేందర్‌ను అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధించాలని ఆ బాలుడిని డిజిపి  శివధర్ రెడ్డి దీవించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page