– సత్వార్ సమీపంలో ఐదుగురు కూలీల దుర్మరణం
– వెంకటాపూర్ వద్ద మరో ప్రమాదం.. ఇద్దరి మృతి
– సీఎం రేవంత్, హరీశ్ రావు దిగ్భ్రాంతి
సంగారెడ్డి, ప్రజాతంత్ర, ఆగస్టు 11: సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం సత్వార్ గ్రామం సమీపంలో యూటర్న్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. కూలీలను తీసుకెళ్తున్న ఆటోను ట్యాంకర్ ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు దుర్మరణం చెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయని సమాచారం. కర్ణాటక రాష్ట్రం హుమనాబాద్ నుంచి జహీరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రోజూ కూలి పని కోసం జహీరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకు కూలీలు వస్తూ ఉంటారు. ఆటోలో మొత్తం 14మంది ఉన్నట్లు సమాచారం. ఆయిల్ ట్యాంకర్ హైదరాబాద్ వైపు నుంచి కర్ణాటకకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లాలోని రాజగిరికి చెందినవారిగా గుర్తించారు. పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక హాస్పిటల్‌కు తరలించి వైద్యం అందిస్తున్నారు.
కోహీర్ మండలంలో మరో ఇద్దరి మృతి 
సంగారెడ్డి జిల్లాలోని కోహీర్ మండలం 65వ నంబర్ జాతీయ రహదారిపై మరో ప్రమాదం జరిగింది. డివైడర్‌పై నుంచి కారు అవతలవైపు ఎగిరిపడటంతో ఎదురుగా వస్తున్న నాలుగు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు దుర్మరణంచెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి
సంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
హరీశ్ రావు తీవ్ర దిగ్భ్రాంతి
సత్వార్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు కూలీలు మృతిచెందడం పట్ల మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన అత్యంత బాధాకరమన్నారు. ప్రాణాలు కోల్పోయిన కర్ణాటక కూలీల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి ప్రభుత్వం తక్షణమే మెరుగైన వైద్య సేవలందించాలని కోరారు. నిరుపేద కూలీల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆదుకోవాలని, తక్షణమే ఎక్స్‌గ్రేషియా ప్రకటించి అండగా నిలవాలని హరీశ్ రావు కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





