మహిళ మెదడులో 4.5 సెం.మీ కణితి

– క్లిష్టమైన శస్త్రచికిత్సతో తొలగించిన మలక్‌పేట్ కేర్ వైద్యులు
హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూలై 15: రెండు నెలలుగా తీవ్రమవుతున్న తలనొప్పి.. ఆ తర్వాత ఒక్కసారిగా మూర్ఛ. వైద్య పరీక్షలు చేయించగా మెదడులో 4.5 సెం.మీ. పరిమాణంలో భారీ కణితి ఉన్నట్లు బయటపడింది. మెదడులోని కీలక భాగాలు, ప్రధాన రక్తనాళాలకు అత్యంత సమీపంలో ఉన్న ఈ కణితిని కేర్ హాస్పిటల్స్, మలక్‌పేట్ వైద్యులు అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్స ద్వారా పూర్తిగా తొలగించారు. సకాలంలో చికిత్స అందించడంతో 42 ఏళ్ల హైదరాబాద్ మహిళకు చూపు కోల్పోవడం, పక్షవాతం వంటి తీవ్రమైన సమస్యలను నివారించగలిగారు. హైదరాబాద్‌కు చెందిన 42 ఏళ్ల గృహిణి దాదాపు రెండు నెలలుగా తలకు కుడివైపు తలనొప్పితో బాధపడుతున్నారు. రోజులు గడిచేకొద్దీ నొప్పి తీవ్రమైంది. ఈ క్రమంలో ఒక్కసారిగా మూర్ఛ రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఎంఆర్ఐ పరీక్షలో మెదడులోని కుడివైపు స్ఫినాయిడ్ వింగ్ ప్రాంతంలో 4.5 సెం.మీ. × 3.5 సెం.మీ. × 3.5 సెం.మీ. పరిమాణంలో కణితి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. పరీక్షల అనంతరం దీనిని మెనింజియోమాగా అనుమానించిన వైద్యులు శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. అయితే కణితి మెదడులోని అత్యంత కీలక భాగాలు, ప్రధాన రక్తనాళాలకు అతి సమీపంలో ఉండటంతో శస్త్రచికిత్స క్లిష్టంగా మారింది. చికిత్సలో మరింత ఆలస్యం జరిగితే రోగి శాశ్వతంగా చూపు కోల్పోవడంతో పాటు పక్షవాతం, ఇతర తీవ్రమైన నాడీ సంబంధిత సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉందని వైద్యులు తెలిపారు. కేర్ హాస్పిటల్స్, మలక్‌పేట్ కన్సల్టెంట్ న్యూరోసర్జన్ డాక్టర్ భవానీ ప్రసాద్ గంజి నేతృత్వంలోని వైద్య బృందం రైట్ ఫ్రంటోటెంపోరల్ క్రానియోటమీ శస్త్రచికిత్స నిర్వహించింది. మెదడులోని చుట్టుపక్కల కీలక నిర్మాణాలు, రక్తనాళాలకు ఎలాంటి నష్టం కలగకుండా అత్యంత జాగ్రత్తగా కణితిని వేరు చేసి పూర్తిగా తొలగించారు. అనంతరం నిర్వహించిన హిస్టోపాథాలజీ పరీక్షలో అది మెనింజియోమా అని నిర్ధారణ అయింది.ఈ సందర్భంగా డాక్టర్ భవానీ ప్రసాద్ గంజి మాట్లాడుతూ, “కణితి మెదడులోని కీలక నిర్మాణాలు, ప్రధాన రక్తనాళాలకు అత్యంత సమీపంలో ఉండటంతో శస్త్రచికిత్స సవాలుగా మారింది. చుట్టుపక్కల భాగాలకు నష్టం కలగకుండా కణితిని పూర్తిగా తొలగించేందుకు అత్యంత సూక్ష్మంగా శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. చికిత్సలో మరింత ఆలస్యం జరిగి ఉంటే చూపు కోల్పోవడం లేదా పక్షవాతం వచ్చే ప్రమాదం పెరిగేది” అని తెలిపారు. శస్త్రచికిత్స అనంతరం రోగి కేవలం ఒక్కరోజు మాత్రమే ఐసీయూలో ఉన్నారు. శస్త్రచికిత్స జరిగిన నాలుగో రోజున ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం ఆమె ఇంటికి చేరుకుని సాధారణ జీవితం గడుపుతున్నారు. మూర్ఛ పూర్తిగా అదుపులోకి రావడంతోపాటు తలనొప్పి కూడా పూర్తిగా తగ్గిపోయిందని వైద్యులు తెలిపారు.
రోజురోజుకూ తీవ్రమవుతున్న తలనొప్పిని నిర్లక్ష్యం చేయొద్దు 
కేర్ హాస్పిటల్స్, మలక్‌పేట్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ ఎడ్ల మాట్లాడుతూ క్లిష్టమైన నాడీ సంబంధిత వ్యాధుల చికిత్సలో సకాలంలో వ్యాధి నిర్ధారణ, శస్త్రచికిత్సలో ఖచ్చితత్వం, వివిధ విభాగాల సమన్వయం ఎంతో కీలకం. కేర్ హాస్పిటల్స్, మలక్‌పేట్‌లో అందుబాటులో ఉన్న వైద్య నైపుణ్యం, సమన్వయంతో కూడిన చికిత్సకు ఈ కేసు నిదర్శనం. శస్త్రచికిత్స అనంతరం రోగి వేగంగా కోలుకుని స్వల్ప వ్యవధిలోనే ఇంటికి చేరడం సంతోషంగా ఉంది” అని అన్నారు. తరచూ వచ్చే లేదా రోజురోజుకూ తీవ్రమవుతున్న తలనొప్పిని నిర్లక్ష్యం చేయరాదని డాక్టర్ భవానీ ప్రసాద్ సూచించారు. ముఖ్యంగా తలనొప్పితో పాటు మూర్ఛ, చూపులో మార్పులు, శరీరంలో బలహీనత లేదా ఇతర నాడీ సంబంధిత లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. తలనొప్పి చాలా సాధారణ సమస్య. చాలా సందర్భాల్లో అది మెదడు కణితికి సంబంధించినది కాదు. అయితే తలనొప్పి వచ్చే తీరు లేదా తీవ్రతలో మార్పు కనిపించి, దానికి మూర్ఛ వంటి లక్షణం తోడైతే మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు అని డాక్టర్ భవానీ ప్రసాద్ పేర్కొన్నారు. మెదడు చుట్టూ ఉండే పొరల నుంచి మెనింజియోమా కణితులు ఏర్పడతాయి. సాధారణంగా ఇవి నెమ్మదిగా పెరుగుతాయి. కణితి పరిమాణం, అది ఉన్న ప్రాంతాన్ని బట్టి చాలా కాలం ఎలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. అయితే సమీపంలోని మెదడు భాగాలపై ఒత్తిడి పెరిగినప్పుడు లక్షణాలు బయటపడతాయి. తలనొప్పి ఎంత తీవ్రంగా ఉందన్నదానికంటే అది వచ్చే తీరు, రోజురోజుకూ ఎలా మారుతోందన్నది కూడా ముఖ్యమేనని ఈ కేసు గుర్తుచేస్తోందని వైద్యులు తెలిపారు. సకాలంలో ఎంఆర్ఐ పరీక్ష, నిపుణుల వైద్య సలహాతో కణితిని గుర్తించి చికిత్స చేయడం వల్ల శాశ్వత నాడీ సంబంధిత సమస్యలు తలెత్తకముందే రోగిని కాపాడగలిగామని పేర్కొన్నారు.
—————————————————————————————————————————————————————

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *