జర్నలిస్టుల సంక్షేమ నిధిపై వాస్తవాల వక్రీకరణ

– మీడియా అకాడమీ 

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 15 : తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమ నిధి అమలుపై ప్రచురితమైన కథనం వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించకుండా, ప్రజల్లో అపోహలు కలిగించే విధంగా ఉండటం విచారకరం అని తెలంగాణ మీడియా అకాడమీ ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్య అంశంగా పరిగణిస్తూ సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత, జవాబుదారీతనం, వేగం అనే మూడు ప్రధాన లక్ష్యాలతో పనిచేస్తోందన్నది.. ప్రత్యేకించి 2023 డిసెంబర్‌లో ప్రజా ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన అనంతరం వర్కింగ్ జర్నలిస్టుల వెల్ఫేర్ ఫండ్ కార్యకలాపాలను మరింత క్రమబద్ధీకరించి జర్నలిస్టులకు సంక్షేమ ప్రయోజనాలు సకాలంలో అందేలా పలు సంస్కరణలు అమలు చేసిందని వివరించారు. గతంలో సంక్షేమ నిధి కమిటీ సమావేశాలు ఎక్కువ విరామంతో నిర్వహించƒగా ప్రస్తుతం ప్రతి మూడు నెలలకొకసారి క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహిస్తూ అందిన ప్రతి దరఖాస్తును నిబంధనల మేరకు పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలిపింది. ఈ విధానంతో దరఖాస్తుల పరిష్కారంలో వేగం పెరగడమే కాక మరణించిన కుటుంబాలకు సహాయానికి సంబంధించిన అర్హత గల ఒక్క దరఖాస్తు కూడా ప్రస్తుతం పెండింగ్‌లో లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థిక సహాయం, అంగవైకల్యం/ప్రమాదాలకు గురైన జర్నలిస్టులకు ఆర్థిక సహాయం, విద్యా సహాయం తదితర సంక్షేమ కార్యక్రమాలను నిరంతరాయంగా అమలు చేస్తూ సకాలంలో ఆర్థిక సహాయం అందిస్తోంది. జర్నలిస్టుల సంక్షేమాన్ని మరింత బలోపేతం చేసే ఉద్దేశంతో గవర్నింగ్ కౌన్సిల్ పలు కీలక నిర్ణయాలు తీసుకుందని, గతంలో తీవ్రమైన అనారోగ్యం లేదా శాశ్వత అంగవైకల్యానికి గురైన జర్నలిస్టులకు కేవలం రూ.50 వేల ఆర్థిక సహాయం అందిస్తే ప్రస్తుత గవర్నింగ్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయంతో ఆ సహాయాన్ని రెట్టింపు చేసి రూ. లక్షకు పెంచినట్లు తెలిపింది. ఈ నిర్ణయం అమలులోకి వచ్చాక ఇప్పటికే గణనీయమైన సంఖ్యలో అర్హులైన జర్నలిస్టులు రూ.లక్ష చొప్పున ఆర్థిక సహాయం పొందారని, ఈ నిర్ణయాన్ని లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు, వివిధ జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు హర్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నింగ్ కౌన్సిల్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. జర్నలిస్టుల పిల్లలకు విద్యా సహాయం, అనారోగ్యంతో బాధపడుతున్న జర్నలిస్టులకు ఆర్థిక తోడ్పాటు, మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు అత్యవసర సమయంలో ఆర్థిక భరోసా కల్పించడం వంటి సంక్షేమ కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. సంక్షేమ నిధి ద్వారా అర్హులైన ప్రతి జర్నలిస్టు కుటుంబానికి సహాయం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, జర్నలిస్టుల శిక్షణ కార్యక్రమాల్లో కూడా ప్రభుత్వం నాణ్యతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని మీడియా అకాడమీ తెలిపింది. ఇవేకాక గిరిజన జర్నలిస్టులకు, ఉర్దూ జర్నలిస్టులకు, మహిళా జర్నలిస్టులకు, సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులకు ప్రత్యేక సదస్సులను, శిక్షణా కార్యక్రమాలను అకాడమి నిర్వహించింది. ఇటీవల ‘సర’పై గోష్టిని కూడా నిర్వహించింది. ఈ విధానం వల్ల ప్రతి జర్నలిస్టుకు సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం, ప్రాక్టికల్ అవగాహన, నైపుణ్యాల పెంపు వంటి ప్రయోజనాలు కలుగుతున్నాయి. వాస్తవాలను తెలుసుకోకుండా, అసంపూర్ణ సమాచారంతో ప్రచురితమయ్యే కథనాలు జర్నలిస్టులలో అనవసరమైన అపోహలు, ఆందోళనలు కలిగించే అవకాశం ఉందని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన మీడియా విలువలను దృష్టిలో ఉంచుకుని సంబంధిత అంశాలపై పూర్తి సమాచారాన్ని తెలుసుకున్న అనంతరం వార్తను ప్రచురిస్తే దాని విశ్వసనీయ పెరుగుతుందని సూచించింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *