– సీఈసీ రాజీనామా డిమాండ్‌తో రాజధానిలో తీవ్ర ఉద్రిక్తత
– విమానంలోనే కాక్రోచ్ జనతా పార్టీ నేతల నిర్బంధం
– వేలాదిమంది కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
– మమతా బెనర్జీ, కేజ్రీవాల్ సహా ప్రతిపక్ష నేతలపై చర్యలు
– ధ్రువ్ రాఠీ, విద్యార్థులు, జర్నలిస్టుల నిర్బంధం
– 45 మెట్రో స్టేషన్లపై ఆంక్షలు, వందలాది రైళ్లకు అంతరాయం
– పోలీసు చర్యలపై దేశవ్యాప్త విమర్శలు
– ఎస్ఐఆర్‌పై ఎన్నికల సంఘాన్ని నిలదీస్తున్న ప్రతిపక్షాలుప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి, దిల్లీ, అక్టోబర్ 10: ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ), విద్యార్థి, యువజన సంఘాలు శనివారం దేశ రాజధాని దిల్లీలో చేపట్టిన నిరసన కార్యక్రమం తీవ్ర రాజకీయ ఉద్రిక్తతలకు దారితీసింది. జంతర్‌మంతర్ వద్ద భారీ ప్రదర్శన నిర్వహించాలని నిరసనకారులు పిలుపునివ్వగా, కార్యక్రమం ప్రారంభానికి ముందే పోలీసులు నగరాన్ని విస్తృత భద్రతా వలయంలోకి తీసుకున్నారు. ప్రధాన రహదారులపై బారికేడ్లు, మెట్రో స్టేషన్లలో ఆంక్షలు, రైళ్ల రద్దు, మొబైల్ ఇంటర్నెట్ నిలిపివేతతో దిల్లీలో సాధారణ జనజీవనానికి అంతరాయం ఏర్పడింది. నిరసనకారులు జంతర్‌మంతర్‌కు చేరుకోకుండా అడ్డుకోవడమే కాకుండా పలువురు రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేశవ్యాప్తంగా వోటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయని, అర్హులైన పౌరుల వోటు హక్కుకు భంగం కలుగుతోందని ప్రతిపక్షాలు, సీజేపీ ఆరోపిస్తున్నాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ అధికార బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నాయి. ఎన్నికల సంఘం ఈ ఆరోపణలను తిరస్కరిస్తూ వోటర్ల జాబితాల ప్రక్షాళన చట్టబద్ధమైన ప్రక్రియేనని వివరిస్తోంది. ఈ వివాదమే శనివారం నిరసనలకు ప్రధాన కారణమైంది.

విమానం దిగకముందే సీజేపీ నాయకుల నిర్బంధం   

శనివారం ఉదయం చోటుచేసుకున్న అత్యంత ముఖ్యమైన పరిణామం కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, సహనేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను దిల్లీ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకోవడం. ముంబయి నుంచి వచ్చిన విమానం దిగిన వెంటనే అధికారులు వారిని నిర్బంధించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వెలుగులోకి వొచ్చాయి. ముగ్గురు నాయకులను అనంతరం వేర్వేరు ప్రాంతాలకు తరలించారు. దీప్కేను గురుగ్రామ్‌కు, రాంకాను ద్వారకాకు, సౌరవ్ దాస్‌ను మరో ప్రాంతానికి తీసుకెళ్లినట్లు వార్తలు వెల్లడించాయి. నాయకత్వాన్ని నిరసనకు దూరంగా ఉంచడానికే ఈ చర్యలు చేపట్టారని సీజేపీ ఆరోపించింది. నాయకుల నిర్బంధం తర్వాత అజింక్య షిండే నిరసన కార్యకలాపాల సమన్వయ బాధ్యతలు చేపట్టారు. జంతర్‌మంతర్‌కు చేరుకోలేకపోతే పోలీసులు ఎక్కడ అడ్డుకుంటే అక్కడే శాంతియుత నిరసన తెలియజేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
వేలాదిమంది నిర్బంధం 
రోజంతా దిల్లీలోని కన్నాట్ ప్లేస్, జనపథ్, జంతర్‌మంతర్, ఆకాశవాణి భవన్, మింటో బ్రిడ్జి తదితర ప్రాంతాల్లో నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మధ్యాహ్నానికి 1,500 మందికిపైగా నిర్బంధానికి గురైనట్లు వార్తలు వెలువడగా, సాయంత్రానికి నాలుగు వేల మందికిపైగా అదుపులోకి తీసుకున్నట్లు కొన్ని ప్రత్యక్ష వార్తా కథనాలు పేర్కొన్నాయి.అదనంగా, నేరచరిత్ర ఉందని పోలీసులు పేర్కొన్న వ్యక్తులను ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వివరించారు.
మమతా బెనర్జీ, కేజ్రీవాల్ సహా పలువురు నేతల నిర్బంధం

శనివారం నిరసనల్లో ప్రతిపక్ష రాజకీయ నాయకులు కూడా పోలీసు చర్యలకు గురయ్యారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, పార్టీ ఎంపీలు డెరెక్ ఓబ్రెయిన్, డోలా సేన్ తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దిల్లీలోని సౌత్ అవెన్యూ ప్రాంతంలో నిరసన తెలుపుతున్న మమతను పోలీసులు అడ్డుకున్నారు.ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్, ఇతర ఆప్ నాయకులను కూడా పోలీసులు నిర్బంధించినట్లు వార్తలు వెల్లడించాయి. వామపక్ష నాయకులు, సామాజిక కార్యకర్తలు సైతం పోలీసు చర్యలను ఎదుర్కొన్నారు. పోలీసు నిర్బంధాలను ప్రతిపక్ష నాయకులు తీవ్రంగా ఖండించారు.

————————————————————————————————————————————————————

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు