ఉద్యమకారుడి కుటుంబానికి కేటీఆర్ అండ

– ముగ్గురు కుమార్తెలకు రూ.9 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్లు
– కుటుంబ ఖర్చుల కోసం భార్యకు రూ.లక్ష ఆర్థిక సహాయం
– జనార్ధన్ కుటుంబానికి బీఆర్ఎస్ నేతల పరామర్శ

మహబూబాబాద్,ప్రజాతంత్ర, అక్టోబర్ 10: తెలంగాణ ఉద్యమంలో మానుకోట సంఘటన నుంచి చురుకైన పాత్ర పోషించిన ఉద్యమకారుడు, దంతాలపల్లి మండలం పెద్దముప్పారం గ్రామానికి చెందిన ఈదురు జనార్ధన్ అనారోగ్యంతో ఇటీవల మరణించారు. పేదరికంతో ఇబ్బందులు పడుతూ కుటుంబ పోషణ కోసం రోజువారీ కూలీగా పనిచేసిన జనార్ధన్‌కు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఆయన మరణంతో కష్టాల్లో పడిన కుటుంబానికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. జనార్ధన్ కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న కేటీఆర్ వెంటనే స్పందించి కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడారు. వారిని పరామర్శించి ధైర్యం చెప్పారు. జనార్ధన్ ముగ్గురు కుమార్తెల భవిష్యత్తుకు భరోసా కల్పించేలా ఒక్కొక్కరి పేరిట రూ.3 లక్షల చొప్పున మొత్తం రూ.9 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్లు అందించేలా చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా జనార్ధన్ సతీమణి ఈదురు మల్లికకు కుటుంబ ఖర్చుల నిమిత్తం తక్షణ ఆర్థిక సహాయంగా రూ.లక్ష అందించారు. భవిష్యత్తులో ఆడబిడ్డలకు ఉద్యోగాల కల్పన విషయంలోనూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కేటీఆర్ ఆదేశాల మేరకు మహబూబాబాద్ జిల్లా బీఆర్‌ఎస్ నాయకులు జనార్ధన్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. దివంగత ఉద్యమకారుడి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా మాట్లాడి వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు. కేటీఆర్ అందించిన ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేసి వారికి ధైర్యం చెప్పారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ మంత్రులు రెడ్యా నాయక్, సత్యవతి రాథోడ్, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేశ్వరరెడ్డి తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారుల త్యాగాలను గుర్తుంచుకుంటూ, వారి కుటుంబాలు కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలవడం బీఆర్‌ఎస్ పార్టీ నిబద్ధతకు నిదర్శనమని అన్నారు. జనార్ధన్ కుటుంబానికి అవసరమైన సమయంలో కేటీఆర్ స్పందించి ఆర్థిక సహాయం అందించడం ద్వారా ఆయన ముగ్గురు కుమార్తెల భవిష్యత్తుకు భరోసా కల్పించారని పేర్కొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *