పట్టభద్రుల ఓటర్ల నమోదును ప్రతిష్ఠాత్మకంగా తీసుకోండి

– అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లండి
– బీజేపీ, బీఆరఎస్ అదృశ్య స్నేహం, వైఫల్యాలను ఎండగట్టండి
– ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు పిలుపు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 6 : ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో పట్టభద్రుల ఓటర్ల నమోదు ప్రక్రియను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్)ను బూత్‌స్థాయిలో పార్టీ పట్టును బలోపేతం చేసే కార్యక్రమంగా భావించి క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లిలో తన అధ్యక్షతన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల కీలక సమావేశం గురువారం జరిగింది. రాబోయే హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహాలు, ‘సర’ ప్రక్రియ పురోగతిని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్షించి కేడర్‌కు దిశానిర్దేశం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలను పార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందన్నారు. పాత, కొత్త నాయకులు సమన్వయంతో ఈ ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కృషి చేయాలని కోరారు. ఎలాంటి భేదాభిప్రాయాలకు తావులేకుండా అందరూ ఐక్యంగా ముందుకు సాగాలని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతీ పట్టభద్రుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు అయ్యేలా పార్టీ శ్రేణులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలన్నారు. పట్టభద్రుల్లో ఓటరు నమోదు ప్రాముఖ్యతపై విస్తృతస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ పార్టీ నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా ఓటరు నమోదును చేపట్టాలని, బూత్ స్థాయిలోని ప్రతి గ్రాడ్యుయేట్‌ను పార్టీ శ్రేణులు కలిసేలా కార్పొరేషన్ల చైర్మన్లు, అసెంబ్లీ, పార్లమెంట్ బాధ్యులు, జిల్లాల అధ్యక్షులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. ఆ క్రమంలో ప్రజా ప్రభుత్వం చేపడుతున్న ఎన్నికల హామీల అమలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలన్నారు. అలాగే బీఆర్‌ఎస్, బీజేపీల వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కోరారు. క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులతోపాటు పార్టీ బాధ్యుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక ఉంటుందని, ఈ విషయంలో తుది నిర్ణయం హైకమాండ్‌దేనని తేల్చి చెప్పారు. ప్రతి కార్యకర్త బూత్‌స్థాయి నుంచి సమన్వయంతో పనిచేస్తూ అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో చేరేలా, తప్పులను సరిదిద్దేలా ‘సర’ ప్రక్రియపై పూర్తి అప్రమత్తతతో వ్యవహరించాలని సూచించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు మల్‌రెడ్డి రంగారెడ్డి, ప్రకాష్ గౌడ్, కసిరెడ్డి నారాయణ రెడ్డి, అరికెపూడి గాంధీ, కార్పొరేషన్ చైర్మన్లు మల్‌రెడ్డి రాంరెడ్డి, జ్ఞానేశ్వర్ ముదిరాజ్, బండి రమేష్, డీసీసీ అధ్యక్షులు వజ్రేష్ యాదవ్, నర్సింహా రెడ్డి, ధారాసింగ్ తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *