లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత త‌ప్ప‌నిస‌రి

  • సమర్థవంతంగా గ్రామ సభలను నిర్వ‌హించాలి: సి.ఎస్ శాంతి కుమారి
  • రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలపై స‌మీక్ష‌

హైదరాబాద్,ప్రజాతంత్ర, జనవరి 15 : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న నాలుగు పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల జాబితాను ఈనెల 21వ తేదీ నుంచి నిర్వహించే  గ్రామ సభల్లో ఆమోదం పొందాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలను ఈనెల 26 వ తేదీన ప్రారంభించాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి  ఆదేశాల మేరకు తగిన‌ కార్యాచరణపై జిల్లా కలెక్టర్లతో బుధవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా సిఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ..ఈ నాలుగు ప్రతిష్టాత్మక పథకాలకు లబ్దిదారుల ఎంపికలో ఏవిధమైన అపోహలకు తావివ్వకూడదని స్పష్టం చేశారు. ఈ పథకాలన్నీ నిజమైన అర్హులకే దక్కేలా పకడ్భందీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.  రైతు భరోసాకు సంబంధించి భూముల వివరాలను రెవిన్యూ శాఖ ద్వారా వ్యవసాయ శాఖకు పంపడం జరిగిందని, సాగు యోగ్యం కాని భూములను క్షేత్ర స్థాయిలో తనిఖీ నిర్వహించాలని అన్నారు.

సంయుక్త సందర్శనలు నిర్వహించి, గ్రామసభల్లో వ్యవసాయ యోగ్యం కాని భూముల వివరాలు ప్రదర్శించి, చదివి వినిపించి ఆమోదం పొందాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించి, ఉపాధి హామీ పథకంలో కనీసం 20 రోజులు పనిచేసిన భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబాల జాబితాను, గ్రామ సభల్లో ప్రకటించి ఆమోదం పొందాలని సి.ఎస్ తెలిపారు.రేషన్ కార్డుల మంజూరీకై రూపొందించిన లబ్ధిదారుల ముసాయిదా జాబితా గ్రామ సభల్లో ఆమోదం పొందాలన్నారు. ఇదేవిధంగా, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు విషయంలో ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శక సూత్రాల ఆదేశాలకు అనుగుణంగా లబ్ధిదారుల ముసాయిదా జాబితా ను గ్రామాల్లో ప్రదర్శించాలని అన్నారు.  గ్రామీణ ప్రాంతాలలో, గ్రామపంచాయతీల వారీగా మరియు పట్టణ ప్రాంతాల్లో వార్డుల వారిగా సభలు నిర్వహించాలన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో లబ్ధిదారుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున, లబ్ధిదారుల జాబితా ఎంపిక, డాటా ఎంట్రీ, క్షేత్ర స్థాయి వెరిఫికేషన్ తదితర అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ను ఆదేశించారు.

ఇప్పటివరకు, ఈ నాలుగు పథకాలకు సంబంధించి క్షేత్ర స్థాయి పరిశీలన, ప్రత్యేక బృందాల ఏర్పాటు, ముసాయిదా జాబితా తయారీ, డేటా ఎంట్రీ ఏర్పాట్లు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లు చేసిన ప్రత్యేక శ్రద్ధని సి.ఎస్ అభినందించారు. ఈ నాలుగు పథకాల అమలుకై రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక అనుగుణంగా అమలయ్యేలా సంబంధిత కార్యదర్శులు పర్యవేక్షించాలని సి.ఎస్. శాంతి కుమారి ఆదేశించారు. ఈ టెలి కాన్ఫరెన్స్ లో రెవిన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, పౌరసరఫరాల శాఖ ముఖ్య కార్యదర్శి డి.ఎస్. చౌహాన్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి బుద్ధప్రకాష్, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, రాష్ట్రంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, జీహెచ్ఎంసీ కమిషనర్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *